- ఆరేండ్ల క్రితం కొనుగోలు చేసిన పంజాబీ సిక్కు వ్యాపారవేత్త
- జ్ఞాపికల కోసం గాంధీ కుటుంబాన్ని కలిసేందుకు సన్నాహాలు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ఇటలీలో పుట్టి పెరిగిన ఇల్లు త్వరలోనే ఒక మ్యూజియంగా రూపుదిద్దుకోనుంది. పంజాబీ మూలాలున్న ఇటలీ వ్యాపారవేత్త సుఖ్‌దేవ్ సింగ్ కాంగ్ ఆరేండ్ల క్రితం ఈ బిల్డింగ్‌ను కొనుగోలు చేశారు. ఇప్పుడు దీనిని మ్యూజియంగా తీర్చిదిద్దేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇటలీలోని విసెంజా ప్రావిన్స్, లూసియానా గ్రామంలో ఉన్న ఈ ఇంట్లోనే 1946 డిసెంబర్ 9న సోనియా గాంధీ జన్మించి, తన చిన్నతనాన్ని గడిపారు. ప్రస్తుతం దీనిని ‘ఇండియన్ హౌస్’ అని పిలుస్తుండగా, ఇంటిపై త్రివర్ణ పతాకంతో పాటు బయట ‘సోనియా గాంధీ జన్మస్థలం’ అనే నేమ్‌ప్లేట్ ఉంది.
1992లో పంజాబ్‌లోని హోషియార్పూర్ నుంచి ఇటలీకి వలస వెళ్లిన కాంగ్.. తొలినాళ్లలో డెయిరీ ఫామ్, వ్యవసాయ రంగం, ఫ్యాక్టరీలలో పనిచేసి అక్కడే స్థిరపడ్డారు. ప్రస్తుతం అమృత్సర్ పర్యటనలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఇంటిని 2020లో తన భార్య, కుమార్తె పేర్లపై కొనుగోలు చేసినట్టు తెలిపారు. ఆస్తి పన్నుతో కలిపి ఇంటి నిర్వహణకు ఏటా సుమారు 1,000 యూరోలు ఖర్చు చేస్తున్న ఆయన, పర్యాటకుల సందర్శనార్థం ఒక కేర్‌టేకర్‌ను కూడా నియమించారు.
అద్దెకు ఇవ్వకుండా చరిత్రకు పెద్దపీట
గాంధీ కుటుంబంపై ఉన్న అభిమానంతో ప్రతి ఏటా సోనియా పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్న కాంగ్ కుటుంబం.. ఈ ఇంటిని అద్దెకు ఇవ్వాలని లేదా గురుద్వారాగా మార్చాలని వచ్చిన ప్రతిపాదనలను సైతం తిరస్కరించింది. సోనియా గాంధీ, మైనో కుటుంబాల చారిత్రక జ్ఞాపకాలను పదిలపరుస్తూ దీనిని అత్యాధునిక మ్యూజియంగా మలిస్తే, ఇటలీ సందర్శించే భారతీయులకు ఇదొక ప్రధాన ఆకర్షణగా నిలవడంతో పాటు స్థానిక గ్రామానికి ఆర్థికంగానూ మేలు జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే, సరైన సమాచారం లేక మ్యూజియం పనులు ఆలస్యమవుతున్నాయని, త్వరలోనే సోనియా గాంధీతో పాటు రాహుల్, ప్రియాంకను కలిసి ప్రదర్శనకు అవసరమైన ఫోటోలు, పత్రాలు, ఇతర జ్ఞాపికలను సేకరించనున్నట్టు కాంగ్ వెల్లడించారు.
