- పాట్నాలో రూ.34 వేల కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన
- దేశంలో 80 కోట్ల మందికి ఉచితంగా రేషన్ ఇస్తున్నాం..
- 50 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తెచ్చినట్లు వెల్లడి
పాట్నా, ఖరగ్‌పూర్: బిహార్ సమగ్రాభివృద్ధికి కేంద్రం పెద్దపీట వేస్తున్నది. రాష్ట్రంలో రూ.34,470 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. పాట్నాలోని కచ్చి దర్గా నుంచి వైశాలిలోని బిదుపూర్ వరకు గంగానదిపై రూ.4,280 కోట్లతో నిర్మించిన 19.7 కిలోమీటర్ల ఆరు లైన్ల కేబుల్ వంతెనను ప్రారంభించి, మాజీ సీఎం నితీశ్ కుమార్ గౌరవార్థం దానికి ‘నితీశ్ సేతు’గా నామకరణం చేశారు. గత 12 ఏండ్ల ఎన్డీయే పాలనలో దేశంలోని 50 కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేశామని, 80 కోట్ల మందికి ఉచిత ఆహార ధాన్యాలు అందిస్తున్నామని ప్రధాని స్పష్టం చేశారు. మరోవైపు, పశ్చిమ బెంగాల్‌లోని ఐఐటీ ఖరగ్‌పూర్ ప్లాటినం జూబ్లీ వేడుకల్లో పాల్గొన్న ఆయన, 2047 నాటికి ‘వికసిత్ భారత్’ నిర్మాణంలో యువత క్రియాశీల భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఉత్తర, దక్షిణ బిహార్‌కు వారధి
‘నితీశ్ సేతు’ ప్రారంభంతో ఉత్తర, దక్షిణ బిహార్ మధ్య రాకపోకలు సులభతరం కావడమే కాకుండా, వ్యవసాయ, పాడి ఉత్పత్తుల రవాణా వేగవంతం కానుందని ప్రధాని తెలిపారు. దశాబ్దాల తరబడి నినాదాలతో ఓట్లు దండుకున్న గత ప్రభుత్వాలు పేదరిక నిర్మూలనలో విఫలమయ్యాయని విమర్శించారు. ప్రస్తుతం కోట్లాది మందికి పక్కా ఇళ్లు, ఉచిత వైద్యం అందుతోందని చెప్పారు. బిహార్‌లో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం వల్లే పథకాలు వేగంగా అమలవుతున్నాయని, ఒకప్పుడు కుంభకోణాలు, నేరాలకు నిలయంగా ఉన్న రాష్ట్రం నేడు రూ.2 లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలతో పారిశ్రామిక కేంద్రంగా మారుతోందని కొనియాడారు. వంతెన ప్రారంభం అనంతరం గవర్నర్ సయ్యద్ అతా హస్నైన్, సీఎం సమ్రాట్ చౌదరి, కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్‌లతో కలిసి మోదీ బ్రిడ్జిపై నడిచారు.
దేశాభివృద్ధిలో ఐఐటీ ఖరగ్‌పూర్ కీలక పాత్ర
పశ్చిమ బెంగాల్‌లోని ఐఐటీ ఖరగ్‌పూర్ నేతాజీ ఆడిటోరియంలో జరిగిన ‘75 వాయిసెస్ ఫర్ వికసిత్ భారత్’ కార్యక్రమంలో ప్రధాని విద్యార్థులతో ముచ్చటించారు. గత 75 ఏళ్లుగా దేశాభివృద్ధిలో ఈ సంస్థ కీలక పాత్ర పోషిస్తోందని, స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తి ఉన్న ఈ గడ్డపై నేడు దేశాన్ని స్వయం సమృద్ధం చేసే ఆవిష్కరణలు పుట్టుకొస్తున్నాయని ప్రశంసించారు. అంతరిక్ష, అణుశక్తి రంగాల్లో ఐఐటీ ఖరగ్‌పూర్ సహకారాన్ని, ప్రపంచ దిగ్గజ కంపెనీలకు నాయకత్వం వహిస్తున్న ఇక్కడి పూర్వ విద్యార్థుల ప్రతిభను మోదీ కొనియాడారు. ఆకాంక్షల నుంచి స్వయం సమృద్ధి దిశగా సాగే ప్రయాణమే వికసిత్ భారత్‌కు ఛోదక శక్తి అని పేర్కొంటూ, సవాళ్లను ఎదుర్కోవడమే కాకుండా సవాళ్లకే సవాల్ విసరడం తన స్వభావమని వ్యాఖ్యానించారు. ఈ వేడుకల్లో బెంగాల్ సీఎం సువేందు అధికారి, గవర్నర్ ఆర్.ఎన్. రవి, కేంద్ర మంత్రి సుకాంత మజుందార్ పాల్గొన్నారు.
