- జల్ జీవన్ నిధులు ఆపేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలె
- గురుదక్షిణగా బాబుకు నీళ్లు అప్పగించిన రేవంత్
- తొమ్మిది నెలలుగా పనులు జరుగుతుంటే తెల్వదా?
- బండి, కిషన్ రెడ్డి, రఘునందన్ ఎందుకు మాట్లాడరని ఫైర్
హైదరాబాద్, వెలుగు: ఏపీ సాగర్ రిజర్వాయర్‌లో అక్రమంగా చేపడుతున్న ప్రాజెక్టు పనులను వెంటనే నిలిపివేయించాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవిత డిమాండ్ చేశారు. రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు ప్రధాని వద్దకు వెళ్లి ఒత్తిడి తేవాలని కోరారు. ఈ ప్రాజెక్టుకు కేంద్రం జల్ జీవన్ మిషన్ నుంచి 50 శాతం నిధులు ఇవ్వకుండా అడ్డుకోవాలని అన్నారు.
వారం రోజుల్లోగా ప్రాజెక్టు పనులు ఆపకుంటే వేలాది మంది ప్రజలతో నాగార్జున సాగర్ డ్యాంను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఇందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. శనివారం ఆమె ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. ఏపీ జలదోపిడీకి సీఎం రేవంత్ రెడ్డి తీరే కారణమని కవిత ఆరోపించారు. చంద్రబాబును ప్రజాభవన్‌కు పిలిచి కాళ్లు కడిగి, గురుదక్షిణగా తెలంగాణ నీళ్లను అప్పగించారని విమర్శించారు. రేవంత్ రెడ్డి ఆమోదంతోనే చంద్రబాబు పోలవరం–బనకచర్ల లింక్ ప్రాజెక్టును చేపట్టారని ఆరోపించారు.
అడ్డుకోరనే ధైర్యంతోనే..
రేవంత్ రెడ్డి అడ్డుకోలేరనే ధైర్యంతోనే ఏపీ ప్రభుత్వం తాగునీటి పేరుతో నాగార్జున సాగర్ నీళ్లకు గండికొడుతోందని కవిత ఆరోపించారు. తాగునీటి కోసం 2.8 టీఎంసీల నీటిని తీసుకుంటున్న ఏపీ.. లిఫ్ట్ పేరుతో మరో 1.8 టీఎంసీలను తరలించేందుకు సిద్ధమైందని పేర్కొన్నారు.
తాగునీటి పేరుతో ప్రాజెక్టులు మొదలుపెట్టి, చివరకు రిజర్వాయర్లలోని నీటినంతా తరలించుకుపోవడం ఏపీ నైజమని విమర్శించారు. ఏపీ ప్రభుత్వం తొమ్మిది నెలలుగా అక్రమ ప్రాజెక్టు నిర్మిస్తున్నా తెలంగాణ సర్కారుకు కనీస సమాచారం లేదన్న వాదనను ఎలా నమ్మాలని కవిత ప్రశ్నించారు.
ఎక్కడ ఏం జరిగినా ఇంటెలిజెన్స్ ముఖ్యమంత్రిని అప్రమత్తం చేస్తుందని, రాష్ట్ర హోంశాఖ బాధ్యతలు కూడా చూస్తున్న రేవంత్ రెడ్డికి ఈ ప్రాజెక్టు గురించి తెలియకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోందన్నారు. బీజేపీకి తెలంగాణలో ఓట్లు, సీట్లు కావాలి తప్ప రాష్ట్ర ప్రయోజనాలు పట్టవా అని ప్రశ్నించారు. అన్ని అంశాలపై స్పందించే ఎంపీ రఘునందన్ రావు, కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి ఈ అక్రమ ప్రాజెక్టుపై ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు.
26న మహిళలు– రాజ్యాంగ సదస్సు
రాజ్యాంగం కల్పించిన ఫలాలను అందిపుచ్చుకున్నప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుందని కవిత అన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈనెల 26న నిర్వహించనున్న ‘మహిళలు–రాజ్యాంగం’ సదస్సు పోస్టర్‌ను శనివారం బంజారాహిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో మహిళా నాయకులతో కలిసి ఆవిష్కరించారు.
