బియ్యం రేట్లు, నిత్యవసరాల ధరలు ఇంత విపరీతంగా పెరగడానికి రెండే కారణాలు !

బియ్యం రేట్లు, నిత్యవసరాల ధరలు ఇంత విపరీతంగా పెరగడానికి రెండే కారణాలు !

బియ్యం హోల్‌‌‌‌సేల్‌‌‌‌  ట్రేడర్స్, మిల్లర్స్, కిందిస్థాయిలో బియ్యం వ్యాపారం చేసేవారు ధరలను అనూహ్యంగా పెంచేస్తున్నారు. యాసంగి పంట వరి పూర్తిగా రాదని, సన్న బియ్యం ధరలు కిలో రూ.100కు చేరుకుంటుందని ప్రచారం చేస్తున్నారు. ఇది పేద, మధ్యతరగతి ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

దీనికి తోడు నిత్యావసర వస్తువులైన పప్పులు, చింతపండు, ఉల్లి, మిర్చితోపాటు రోజు వాడే కూరగాయల ధరలు పెరుగుదలతో ప్రజలు సతమతమవుతున్నారనేది వాస్తవం.  అసమాన వర్షాలతో రైతు పండించే పంటలపై తీవ్ర ప్రభావంతో బియ్యం మాత్రమే కాదు అన్నింటి ధరలు పెరుగుతున్నాయని వ్యాపార వర్గాలు చెపుతున్నారు.

జులై ఆఖరి వరకు రిటైల్ మార్కెట్లో సోనా మైసూర్  కిలో 60 రూపాయలు ఉంటే, అక్టోబర్ నాటికి 95 నుండి 105 రూపాయలకు చేరింది.  బియ్యం ఇతర నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెరగడానికి ప్రభుత్వ విధానాలు, సిండికేట్ వ్యాపారులే కారణం. సిండికేట్ వ్యాపార వర్గం మార్కెట్ యంత్రాంగాన్ని తమ గుప్పెట్లో పెట్టుకుని కృత్రిమ కొరత సృష్టించి వినియోగదారులపై అదనపు భారాన్ని మోపుతుంది. 

ధాన్యం కొనుగోలు నుండి బియ్యం అమ్మకం వరకు ప్రతి దశలోనూ ధరలను  వీళ్లే  నిర్ణయిస్తారు.  రైతుల నుండి వినియోగదారులకు చేరేలోపు కనీసం మూడు నుండి నాలుగు దశలలో సిండికేట్ సభ్యులు లాభాల శాతాన్ని పెంచుకుంటూ పోతున్నారు. దీనివల్ల రైతులకు దక్కేది తక్కువ,  వినియోగదారులకు పెట్టే ధర ఎక్కువగా అవుతుంది.

బియ్యం ధరలు పెంపు.. సిండికేట్ వ్యాపారుల హస్తం!
 బియ్యం మార్కెట్లో సిండికేట్ వ్యాపార లాభాలు సాధారణ వ్యాపార లాభాల కంటే మూడు నుండి నాలుగు రెట్లు అధికంగా ఉన్నాయి. పంట చేతికి వచ్చి సమయంలో రైతుల నుంచి ప్రభుత్వ మద్దతు ధర కంటే 15 నుండి 20% తక్కువ ధరకు కొనుగోలు చేస్తారు. అదే సరుకులు వినియోగదారులకు అమ్మేటప్పుడు మార్కెట్ ధర కంటే 30% నుంచి 40 శాతం అదనపు ధరకు విక్రయించి రెండు విధాలుగా భారీగా లాభాలు గడిస్తున్నారు. 

సాధరణ లేదా నాణ్యత లేని బియ్యాన్ని అత్యాధునిక మిల్లులో పాలిష్ చేసి బ్రాండెడ్ సంచుల్లో ప్యాక్ చేసి, సూపర్ ఫైన్ రకం పేరుతో మార్కెట్లో పెట్టి 50% పైగా లాభాలు గడిస్తున్నారు. పేదలకు అందాల్సిన ప్రభుత్వ రేషన్ బియ్యాన్ని కిలో 10 నుండి 15 రూపాయలకు కొనుగోలు చేసి, వాటిని పాలిష్ పట్టి బహిరంగ మార్కెట్లో 40 నుండి 50 రూపాయలకు అమ్ముతున్నారు.

ఇటీవల పౌర సరఫరాల శాఖ వారు విస్తృతంగా తనిఖీలు చేస్తే వివిధ మిల్లులో పాలిష్ చేసి ఫైన్ రైస్ పేరుతో 20 కిలోలు, 25 కిలోలు, 10 కిలోలు సంచుల్లో నింపి మార్కెట్లో అమ్ముతున్నట్లు వెలుగులోనికి వచ్చినవి.  రైతుల పరిస్థితులను, కరువు ప్రభావాన్ని, ఏర్పడనున్న ఆహార ధాన్యాల కొరతను దృష్టిలో పెట్టుకుని నీటి వనరులు ఉన్నచోట వరి సేద్యానికి అనుమతించాలి. 

బియ్యం తదితర ఆహార ధాన్యాల ధరల పెరుగదలను, సిండికేట్ వ్యాపారుల మోసాలను అరికట్టాలి. అక్రమ నిలవలను బయటకు తీసి బహిరంగ మార్కెట్లో మేలురకం బియ్యాన్ని పూర్తిగా ప్రభుత్వమే చౌక ధరల డిపోల ద్వారా విక్రయించాలి.  

ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలి
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సివిల్ సప్లై శాఖ ద్వారా సన్న బియ్యం కిలో  రూ. 66  కంటే ఎక్కువ అమ్మకూడదని ఆదేశాలు ఇచ్చింది.  ఎక్కువ రేట్లుకు అమ్మితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించినప్పటికీ సిండికేట్ వ్యాపార వర్గాలు మాత్రం లెక్కచేయకుండా..కృత్రిమ కొరతను సృష్టించి వినియోగదారులపై అదనపు భారాన్ని మోపుతున్నారు. 

రాష్ట్ర ప్రభుత్వం సన్నబియ్యాన్ని ప్రతి వ్యక్తికి ఆరు కిలోలు మాత్రమే ఇస్తున్నారు. అంటే నలుగురు ఉన్న కుటుంబానికి నెలకు 24 కిలోలు మాత్రమే అందుతున్నాయి. దీనిని 10 కిలోలకు పెంచి ఇవ్వాలిజ  ఆదనంగా ఇచ్చే బియ్యానికి  కొంతరేటు నిర్ణయించి ఇస్తే బాగుంటుందని వినియోగదారులు కోరుతున్నారు. బియ్యం ట్రేడర్స్.. రైస్ మిల్లర్స్ సిండికేట్‌‌‌‌గా మారి మామూలు సన్నబియ్యాన్ని  సూపర్ ఫైన్‌‌‌‌గా  ముద్రించిన బ్యాగులలో ఎక్కువ రేట్ల అమ్మటాన్ని నిఘాపెట్టి ధరలను నియంత్రించే చర్యలను చేపట్టాలి.

ఉజ్జిని రత్నాకర్ రావు, వినియోగదారుల ఫోరం సభ్యుడు

ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ఐడీ [email protected]