న్యూఢిల్లీ: షాంఘై సదస్సులో పాల్గొనేందుకు భారత్‌కు వచ్చిన పాకిస్తాన్ వాతావరణ మార్పుల శాఖ మంత్రి ముసాదిక్ మాలిక్‌కు ఆగ్రాలోని తాజ్ మహల్, ఢిల్లీలోని హుమాయూన్ సమాధి సహా మరో రెండు ప్రముఖ ప్రదేశాల సందర్శనకు భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే, భద్రతా కారణాల దృష్ట్యా హజ్రత్ నిజాముద్దీన్ దర్గాను సందర్శించేందుకు ఆయన చేసిన అభ్యర్థనను అధికారులు తిరస్కరించారు. నవంబర్ 20 నుంచి 22 వరకు న్యూఢిల్లీలో జరుగుతున్న తొలి షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) 'సివిలైజేషన్స్ డైలాగ్ ఫోరమ్' సదస్సు కోసం ముసాదిక్ మాలిక్ భారత్‌కు వచ్చారు.
సదస్సు మినహా ఇతర కార్యక్రమాలకు ఆయనకు అనుమతి లేదంటూ తొలుత వార్తలు వచ్చినప్పటికీ, భద్రతా సమీక్ష అనంతరం కేంద్రం తాజా నిర్ణయం తీసుకుంది. తాజ్ మహల్, ఢిల్లీ హాట్, హుమాయూన్ సమాధి, ఖిలా రాయ్ పితోరాతోపాటు హజ్రత్ నిజాముద్దీన్ దర్గా సందర్శనకు అనుమతి కోరుతూ పాకిస్తాన్ హైకమిషన్ దరఖాస్తు చేసుకుంది. అయితే, భద్రతాపరమైన అంశాలను పరిశీలించిన అధికారులు మొదటి నాలుగు ప్రదేశాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి, నిజాముద్దీన్ దర్గా పర్యటనకు మాత్రం అనుమతి నిరాకరించారు.
