- త్వరలోనే సిబ్బందికి అందజేస్తామన్న సదరన్ డిస్కమ్ సీఎండీ జితేశ్ వి. పాటిల్
హైదరాబాద్, వెలుగు: గ్రామీణ ప్రాంతాల్లో భూగర్భ జలాల లభ్యతను శాస్త్రీయంగా గుర్తించేందుకు ‘గ్రౌండ్‌వాటర్ డిటెక్టర్’ పరికరాలను అందుబాటులోకి తెస్తున్నట్లు సదరన్ డిస్కమ్ సీఎండీ జితేశ్ వి. పాటిల్ వెల్లడించారు. శనివారం కార్పొరేట్ కార్యాలయం నుంచి 21 ఆపరేషన్ సర్కిళ్ల పనితీరు, బిల్లుల వసూళ్లు, నెట్వర్క్ పటిష్టత, వినియోగదారుల సేవలపై ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. సీఎండీ మాట్లాడుతూ.. డిటెక్టర్ల సాయంతో బోర్‌వెల్స్‌లో నీటి స్థాయిని అంచనా వేసి రైతులకు వాస్తవ పరిస్థితిని వివరించాలన్నారు. తక్కువ నీరు అవసరమయ్యే ఆరుతడి పంటల సాగుపై రైతులను ప్రోత్సహించేందుకు సూపరింటెండింగ్ ఇంజినీర్లు చొరవ తీసుకోవాలని సూచించారు. రానున్న వేసవి డిమాండ్‌ను సమర్థంగా ఎదుర్కొంటూ, వినియోగదారులకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ అందించాలని ఆదేశించారు.
బకాయిల వసూళ్లు వేగవంతం చేయాలి
పగటిపూట వీధి దీపాలు వెలగకుండా పంచాయతీలు, మున్సిపాలిటీలతో సమన్వయం చేసుకుని విద్యుత్ వృథాను అరికట్టాలని, ఇందుకోసం ఆటోమేటిక్ మానిటరింగ్ వ్యవస్థలను పరిశీలించాలని సీఎండీ సూచించారు. ప్రభుత్వ శాఖలు, ఇరిగేషన్, వాటర్ వర్క్స్ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిల వసూళ్లను వేగవంతం చేయాలని అకౌంట్స్ అధికారులను ఆదేశించారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సబ్స్టేషన్లు, ఫీడర్లు, పెండింగ్ పనుల పురోగతిని స్వయంగా పర్యవేక్షించాలని స్పష్టం చేశారు.
