ముంబై పార్క్‌‌‌‌ లో యువ జంటపై మైనర్ల దాడి..కట్టెలతో చితకబాదిన 10 మంది కుర్రాళ్లు

ముంబై పార్క్‌‌‌‌ లో యువ జంటపై మైనర్ల దాడి..కట్టెలతో చితకబాదిన 10 మంది కుర్రాళ్లు
  •     సోషల్ మీడియాలో వీడియో వైరల్

ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కుర్లా ప్రాంతంలోని ఓ పబ్లిక్ పార్క్‌‌‌‌లో నడుస్తున్న యువ జంటపై 8 మంది బాలురు మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. కట్టెలతో విచక్షణారహితంగా కొడుతూ భయాందోళనకు గురిచేశారు. ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు ఆరుగురు మైనర్లను అదుపులోకి తీసుకున్నారు.

అసలేం జరిగింది?

కుర్లా వెస్ట్‌‌‌‌లోని ఫీనిక్స్ మాల్ వెనుక ఉన్న ప్రమోద్ మహాజన్ గార్డెన్‌‌‌‌లో ఓ యువ జంట.. మైనర్లతో గొడవకు దిగారు. దీంతో ఆ మైనర్లందరు కలిసి ఆ జంటను చుట్టుముట్టి, వారి దారిని అడ్డుకున్నారు. అందులోని కొందరు బాలురు యువకుడిపై కట్టెలతో దాడి చేయగా, మరికొందరు పిడిగుద్దులు కురిపించారు. దాడిని ఆపేందుకు పక్కనే ఉన్న యువతి ప్రయత్నించినా వారు వెనక్కి తగ్గలేదు. ఎట్టకేలకు ఆ జంట నిందితుల చెర నుంచి తప్పించుకుని అక్కడి నుంచి బయటపడింది. ఈ ఘటన వీడియో నెట్టింట వైరల్ కావడంతో ముంబై పోలీసులు స్పందించారు. ఫుటేజీ ఆధారంగా దాడికి పాల్పడిన మైనర్లను గుర్తించి వారిపై కేసు నమోదు చేశారు. అదుపులోకి తీసుకున్న ఆరుగురు మైనర్లను జువైనల్ జస్టిస్ బోర్డు ఎదుట హాజరుపరచగా, వారిని 15 రోజుల పాటు అబ్జర్వేషన్ హోమ్‌‌‌‌కు తరలించాలని ఆదేశించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని, వారి తల్లిదండ్రులకు నోటీసులు జారీ చేశామని అధికారులు వెల్లడించారు.

రాజకీయ దుమారం.. 

ఈ దాడికి సంబంధించిన వీడియోను బీజేపీ నేత కిరీట్ సోమయ్య 'ఎక్స్' వేదికగా షేర్ చేశారు. ఇది ‘ముస్లిం గూండాయిజం’ అంటూ ఆరోపణలు చేశారు. తాను ఘటనా స్థలాన్ని సందర్శించనున్నట్లు తెలిపారు. మరోవైపు, బహిరంగ ప్రదేశాల్లో నడిచే పౌరులను వేధించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని ముంబై పోలీసులు హెచ్చరించారు.