సోవియట్ కమ్యూనిజాన్ని ఓడించాం.. మార్క్స్ స్ఫూర్తిని ఓడించలేకపోయాం !

సోవియట్ కమ్యూనిజాన్ని ఓడించాం.. మార్క్స్ స్ఫూర్తిని ఓడించలేకపోయాం !

‘సోవియట్ కమ్యూనిజం అనే వ్యవస్థను ఓడించాం.. కానీ మార్క్స్ స్ఫూర్తిపై గెలవలేకపోయాం!’ అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో చేసిన ఈ వ్యాఖ్య  ప్రపంచ రాజకీయాల్లో మరోసారి భావజాల చర్చకు తెరలేపింది. నవంబర్ 13న వాషింగ్టన్‌‌‌‌‌‌‌‌లో ఫెడరలిస్ట్ సొసైటీ సమావేశంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలో ఒక రాజకీయ వాస్తవం దాగి ఉంది.

ఒక దేశాన్ని కూల్చవచ్చు.. ఒక ప్రభుత్వాన్ని పడగొట్టవచ్చు.. ఒక రాజకీయ వ్యవస్థను చరిత్ర పుటల్లోకి నెట్టివేయవచ్చు. కానీ సమాజంలోని అసమానతలను ప్రశ్నించే ఆలోచనలను అంతం చేయడం సాధ్యమా? అన్నదే అసలైన ప్రశ్న.

సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమై మూడు దశాబ్దాలు దాటిపోయాయి. ప్రపంచ పటంపై కమ్యూనిస్టు మహాశక్తిగా వెలుగొందిన సోవియట్ వ్యవస్థ కనుమరుగైంది. ప్రచ్ఛన్న యుద్ధంలో అమెరికా ఆధిపత్యం పెరిగింది. పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. ప్రపంచీకరణ పేరుతో మార్కెట్లు విస్తరించాయి. ప్రైవేటీకరణ పేరుతో ప్రభుత్వ రంగ సంస్థలు కుంచించుకుపోయాయి. స్వేచ్ఛా వాణిజ్యం పేరుతో అంతర్జాతీయ పెట్టుబడులకు ద్వారాలు తెరుచుకున్నాయి. అయినప్పటికీ మార్క్స్ ఆలోచనల గురించి ప్రపంచ అగ్రరాజ్యాల నాయకులు ఇప్పటికీ మాట్లాడాల్సి వస్తోంది. ఎందుకు?

ఎందుకంటే మార్క్స్ ప్రశ్నించిన అసమానతలు ఇంకా అంతం కాలేదు. సంపద 
కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతమవుతున్నప్పుడు, శ్రమించే చేతులకు కనీస జీవన భద్రత కరువవుతున్నప్పుడు, కార్మికుడి చెమటతో సామ్రాజ్యాలు నిర్మితమై అతడికి మాత్రం పేదరికమే మిగులుతున్నప్పుడు మార్క్స్ ఆలోచనలు మళ్లీ మళ్లీ గుర్తుకొస్తాయి. ఒకవైపు అపారమైన సంపద, మరోవైపు ఆకలితో అలమటించే జనసమూహాలు ఉన్నంతకాలం సమానత్వం కోసం జరిగే పోరాటం ఆగదు. 

అయితే ఇక్కడ ఒక విషయాన్ని స్పష్టంగా గుర్తించాలి. మార్క్స్ సిద్ధాంతాలు వేరు.. సోవియట్ యూనియన్‌‌‌‌‌‌‌‌లో అమలైన రాజకీయ వ్యవస్థ వేరు. మార్క్స్ రచనలను యథాతథంగా ఒక దేశ పాలనా విధానంతో సమానంగా చూడలేం. సోవియట్ వ్యవస్థలో సాధించిన విజయాలు ఉన్నట్లే, అధికార కేంద్రీకరణ, వ్యక్తిగత స్వేచ్ఛలపై ఆంక్షలు, ప్రజాస్వామిక లోపాలు, ఆర్థిక వైఫల్యాలు కూడా ఉన్నాయి.

అమెరికా స్వప్రయోజనాలు

ఒక వ్యవస్థలోని వైఫల్యాలను చూపించి సమానత్వం, శ్రమ గౌరవం, దోపిడీ రహిత సమాజం వంటి మౌలిక ప్రశ్నలను కొట్టిపారేయడం మేధో నిజాయితీ అనిపించుకోదు. రూబియో వ్యాఖ్యల్లో మరో రాజకీయ కోణం ఉంది. మార్క్సిజం జాతీయ సరిహద్దులను చెరిపివేయాలని ప్రయత్నిస్తోందని, అంతర్జాతీయ సంస్థలు దేశాల సార్వభౌమాధికారాన్ని ప్రభావితం చేస్తున్నాయని ఆయన విమర్శించారు. కానీ ఇక్కడ అమెరికాను కూడా ఒక ప్రశ్న అడగాలి.

ప్రపంచానికి ప్రజాస్వామ్యం గురించి బోధించే అగ్రరాజ్యం అమెరికా తన ఆర్థిక, సైనిక, రాజకీయ ప్రయోజనాల కోసం ఇతర దేశాల వ్యవహారాల్లో జోక్యం చేసుకున్న చరిత్రను ఎలా సమర్థించుకుంటుంది? బలమైన దేశాలకు జాతీయ ప్రయోజనాలు ఉంటే, బలహీన దేశాలకు మాత్రం స్వతంత్ర నిర్ణయాధికారం ఉండకూడదా? అంతర్జాతీయ న్యాయం అందరికీ ఒకేలా వర్తించాలా? లేక అగ్రరాజ్యాల ప్రయోజనాలకు అనుగుణంగా మారిపోవాలా?

దేశభక్తి అంటే పాలకులను ప్రశ్నించకుండా ఉండటం కాదు

ఇక్కడ వామపక్ష పార్టీలను కూడా ప్రశ్నించాల్సిందే. మార్క్స్ పేరును నినాదంగా మార్చుకుని, కార్మికులు, రైతులు, పేదల సమస్యలపై మాట్లాడటం మాత్రమే సరిపోదు. మారుతున్న ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా కొత్త విధానాలను రూపొందించాలి. యువత ఆకాంక్షలను అర్థం చేసుకోవాలి. అసంఘటిత రంగ కార్మికులు, గిగ్ వర్కర్లు, నిరుద్యోగులు, రైతు కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటాలను బలోపేతం చేయాలి. సిద్ధాంతం ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురాలేకపోతే అది పుస్తకాలకే పరిమితమవుతుంది. అదేవిధంగా మితవాద, జాతీయవాద రాజకీయ పార్టీలూ ఒక విషయాన్ని గుర్తించాలి. 

దేశభక్తి అంటే పాలకులను ప్రశ్నించకుండా ఉండటం కాదు. జాతీయ ప్రయోజనాలు అంటే సంపన్న వర్గాల ప్రయోజనాలే కాదు. దేశం అంటే భౌగోళిక సరిహద్దులు మాత్రమే కాదు.. ఆ సరిహద్దుల మధ్య జీవించే  కోట్లాదిమంది ప్రజలు. వారి ఆకలి, వారి ఉపాధి, వారి విద్య, వారి వైద్యం, వారి ఆత్మగౌరవం కూడా దేశ ప్రయోజనాల్లో భాగమే.  ప్రభుత్వాన్ని  ప్రశ్నించేవారిని దేశద్రోహులుగా ముద్రవేయడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం.

పేదల పేరుతో రాజకీయాలు

నేటి రాజకీయాల్లో మరో విచిత్రమైన ధోరణి కనిపిస్తోంది. ఒకప్పుడు పెట్టుబడిదారీ విధానాన్ని విమర్శించిన పార్టీలు అధికారంలోకి వచ్చాక అదే విధానాలను అనుసరిస్తున్నాయి. సమానత్వం గురించి మాట్లాడే నాయకులు తమ చుట్టూ అసమానమైన అధికార వలయాలను నిర్మించుకుంటున్నారు. పేదల పేరుతో రాజకీయాలు చేస్తూ.. ఎన్నికల సమయంలో వారి ఓట్లను సంపదగా భావిస్తూ, ఎన్నికల తర్వాత వారి సమస్యలను మరచిపోతున్నారు.

సిద్ధాంతాలు సభా వేదికలపై కనిపిస్తున్నాయి.. స్వార్థ ప్రయోజనాలు పాలనా గదుల్లో రాజ్యమేలుతున్నాయి. ప్రజాస్వామ్యంలో అసలు విజేత ఏ రాజకీయ పార్టీ కాదు.. ప్రజలే కావాలి.  పాలకుల విధానాలను ప్రశ్నించే హక్కు, ప్రభుత్వాన్ని మార్చే అధికారం, సమాన అవకాశాలను కోరే స్వేచ్ఛ ప్రజలకు ఉండాలి.

మార్క్స్ ఆలోచనలను అంగీకరించాలా, తిరస్కరించాలా అన్నది ప్రతి ఒక్కరి స్వేచ్ఛ. కానీ సమాజంలో పేదరికం, దోపిడీ, నిరుద్యోగం, ఆర్థిక అసమానతలు ఎందుకు కొనసాగుతున్నాయన్న ప్రశ్నను మాత్రం ఎవరూ నిషేధించలేరు. మార్క్స్‌‌‌‌‌‌‌‌ను చరిత్ర నుంచి తొలగించాలంటే ఆయన సిద్ధాంతాలను విమర్శించడం మాత్రమే సరిపోదు. ఆయన ప్రశ్నించిన సామాజిక, ఆర్థిక అసమానతలకు సమాధానం చెప్పాలి.  ఆకలిని అంతం చేయాలి. శ్రమకు గౌరవం కల్పించాలి. సంపద సృష్టించే ప్రజలకు ఆ సంపదలో న్యాయమైన వాటా దక్కేలా చూడాలి. అప్పుడే సమానత్వం కోసం వినిపించే ఆలోచనలకు ఆచరణాత్మక సమాధానం ఇచ్చినట్లవుతుంది.

సమానత్వం కోసం పోరాటం

సోవియట్ యూనియన్‌‌‌‌‌‌‌‌ను కూల్చిన చరిత్రను విజయంగా చెప్పుకోవచ్చు. కమ్యూనిస్టు పాలనా వ్యవస్థల వైఫల్యాలను విమర్శించవచ్చు. కానీ ప్రపంచంలో పేదరికం ఉన్నంతకాలం, శ్రమకు తగిన ప్రతిఫలం దక్కనంతకాలం, సంపద కొద్దిమంది చేతుల్లోనే బందీగా ఉన్నంతకాలం సమానత్వం కోసం పోరాడే భావజాలాన్ని ఎలా ఓడించగలరు? మార్క్స్‌‌‌‌‌‌‌‌ను ఓడించాలంటే మార్క్స్‌‌‌‌‌‌‌‌ను తిట్టడం కాదు.. మార్క్స్ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. పేదవాడి కన్నీటిని తుడవాలి. కార్మికుడి చెమటకు విలువ ఇవ్వాలి.

రైతు బతుకుకు భరోసా కల్పించాలి. ప్రజాస్వామ్యాన్ని ధనస్వామ్యానికి బందీ కాకుండా కాపాడాలి. ఎందుకంటే ఒక వ్యవస్థ పతనం కావచ్చు.. ఒక సామ్రాజ్యం అంతరించిపోవచ్చు.. కానీ అన్యాయంపై ప్రశ్నించే ప్రజల ఆలోచనను ఏ అధికారమూ శాశ్వతంగా సమాధి చేయలేదు! అదే మార్క్స్ స్ఫూర్తి వెనుక ఉన్న అసలు ప్రశ్న. అదే నేటి ప్రపంచ రాజకీయాలకు ఎదురవుతున్న సవాలు!

అధికారమే అంతిమ లక్ష్యమా!

భారతదేశంలో రాజకీయ పార్టీలన్నీ ప్రజాస్వామ్యం, పేదల సంక్షేమం, సామాజిక న్యాయం, అభివృద్ధి అనే పదాలను తమ ప్రసంగాల్లో విస్తృతంగా ఉపయోగిస్తున్నాయి. కానీ ఆచరణలో మాత్రం అధికారమే అంతిమ లక్ష్యంగా మారుతున్నదా అనే అనుమానం ప్రజల్లో పెరుగుతోంది. ఎన్నికల ముందు పేదల పక్షాన నిలబడతామని హామీల వర్షం కురిపించే పార్టీలు, అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేట్ సంస్థల ప్రయోజనాలకు ఎంత ప్రాధాన్యం ఇస్తున్నాయో ప్రజలు పరిశీలించాలి.

పెట్టుబడులు రావాలి.. పరిశ్రమలు పెరగాలి.. ఉపాధి అవకాశాలు విస్తరించాలి. వీటిని ఎవరూ వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. కానీ అభివృద్ధి ఫలాలు కొద్దిమంది పారిశ్రామికవేత్తలకే పరిమితమైతే, భూమిని కోల్పోయిన రైతుకు న్యాయం జరగకపోతే, కాంట్రాక్టు కార్మికుడికి ఉద్యోగ భద్రత లేకపోతే, విద్య, వైద్యం సామాన్యుడికి భారమైతే ఆ అభివృద్ధి ఎవరి కోసం? జాతీయ సంపద పెరిగిందని చెప్పుకోవడం గొప్ప కాదు. ఆ సంపదలో సామాన్యుడి వాటా ఎంత పెరిగిందన్నదే నిజమైన అభివృద్ధికి కొలమానం.

శ్రీనివాస్ జీడిపల్లి, సోషల్ ​ఎనలిస్ట్

ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ​ఐడీ [email protected]