నవంబర్ 16 నాడు నేను సోనియా గాంధీ మెమోయర్ ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ను అమెజాన్‌లో ఆర్డర్ చేద్దామని ఆలోచిస్తుండగా నా మిత్రుడు బెల్లయ్య నాయక్ (కాంగ్రెస్) ఒక కాపీ అకస్మాత్తుగా గిఫ్ట్‌గా పంపించాడు. షాపులో దాని ధర రూ.1200పైగా ఉండగా, అమెజాన్ రూ.800కి అమ్ముతోంది.
రూ.400 తేడాతో అమ్మడానికి గల కారణం దాన్ని లక్షల సంఖ్యలో ఇండియాలో కొంటుండటం. సోనియా గాంధీతో దాన్ని లాంచ్ చేసిన (16–11–26న) సందర్భంగా హార్పర్ కాలిన్స్ అధికారి ఇప్పటికే ఇండియాలో 2 లక్షల కాపీలకు పైగా అమ్మి దేశ చరిత్రలోనే 5 రోజుల్లో హైయెస్ట్ సోల్డ్ బుక్‌గా దాన్ని ప్రకటించాడు.
బ్రిటన్‌లో, ఆస్ట్రేలియలో, సౌత్ ఆసియాలో అదే కంపెనీ పబ్లిష్ చేసింది కనుక అక్కడ నంబర్ వన్ బెస్ట్ సెల్లర్ ఈ పుస్తకమే అని ప్రకటించాడు. అమెరికాలో కూడా అది పెద్ద ఎత్తున అమ్ముడుపోతుందట. ఆ పుస్తకాన్ని మొదటి నుంచి 1968 పెండ్లి వరకు చదివాను. మిగతా చాప్టర్లు అక్కడక్కడా చదివాను. ఈ వ్యాసంలో పుస్తకం టైటిల్ ఫిలాసఫీ మీద ఇండియాకు దాని సంబంధం మీద రాస్తున్నాను. లవ్ అనే పదాన్ని సోనియా గాంధీ యూరోపియన్ సైన్సులో ఇండియా జీవితానికి అప్లై చేసింది. అందుకే లవ్ అనే పదంపై చర్చ చాలా జరగాలి.
లవ్ అనే ప్రక్రియ ఇద్దరి వ్యక్తుల మధ్య ముఖ్యంగా ఒక స్త్రీ, పురుషుడి మధ్య మాత్రమే పుట్టి..పెరిగి ఒక రూపం తీసుకుంటుందా, లేక ఒక సమాజ జీవితంలో అది అంతర్లీనంగా ఉంటుందా? లవ్ తాత్వికంగా స్త్రీ, పురుష శరీర– మానసిక, ముఖ్యంగా సంతోషం, పునరుత్పత్తికి సంబంధించిందా లేక సమాజ నిర్మాణానికి సంబంధించిందా? ఇప్పుడున్న ప్రపంచంలో లవ్ (ప్రేమ) ఎక్కువ తక్కువలుగా ఉందా? లేక కొన్ని దేశాల్లో ప్రేమ అనే తత్వగుణాన్ని అసలు నిలదొక్కుకోనివ్వని స్థితి ఉందా?
సోనియా ప్రేమ
సోనియా గాంధీ ప్రేమ రాజీవ్ గాంధీని కేంబ్రిడ్జిలో గ్రీక్ రెస్టారెంట్‌లో చూసినప్పటి నుంచి రెండు భిన్న సంస్కృతులు, భిన్న చరిత్రలు, భిన్న మత విలువలుగల దేశాల సంఘర్షణలో తన కుటుంబ వ్యతిరేకతలో భయం భయంగా ఇండియాకి వచ్చింది. ఇది విచిత్ర ప్రేమే. రాజీవ్ తల్లి ఇందిరా గాంధీకి 1965లో సోనియాను లండన్‌లో పరిచయం చేసినప్పుడు ఆమె లాల్ బహదూర్ శాస్త్రి కేబినెట్‌లో మినిస్టర్.
అప్పటికే సోనియాతో రాజీవ్ ఇందిరకు ఆమెను పరిచయం చేసి అసలు విషయం చెప్పడానికి బ్రిటిష్ హైకమిషనర్ ఇంట్లో ఉన్న ఇందిర దగ్గరకు తీసుకుపోతుంటే 19 ఏండ్ల సోనియా భయపడిపోయారని, భయమేస్తున్నదని మధ్యలో అడ్డం తిరిగింది.
ఆమెకు రాజీవ్‌ను పరిచయం చేసిన ఇటలీ మిత్రుడు రాజీవ్ ఇండియా మొదటి ప్రధానమంత్రి జవహార్‌లాల్ నెహ్రూ మనవడు అని చెప్పాడు. తన కుటుంబం మధ్య రాజీవ్ కుటుంబ స్టేటస్ పట్ల ఆమెకు భయమేసేంత తేడా ఉంది. ఆరోజు ఆగిపోయి రెండు రోజులు నచ్చజెప్పి తీసుకెళ్లాడు. ఇందిరా గాంధీని చూడగానే ఆమెకు మరీ భయమేసింది. కానీ ప్రేమతో ఆమె దగ్గర కూర్చోబెట్టుకుని ఆమె గురించి అడిగింది.
సోనియాను ఓదార్చిన ఇందిర
అప్పటికే రాజీవ్ ఆమెకు ఫోన్‌లో ఆమె తన ఫియాన్సీ అని చెప్పినట్టు ఉన్నాడు. సోనియా ఏమీ చెప్పలేక ఏడ్వడం మొదలుపెట్టింది. ఇందిర ఆమెను కౌగిట్లోకి తీసుకుని భయపడకు నా జీవితంలో కూడా నీలానే
నా ప్రేమలో భయపడిన పసితనం ఉంది అని ఓదార్చి సున్నితంగా ఆమె బ్యాక్‌గ్రౌండ్ తెలుసుకుంది. ఇందిర, ఫిరోజ్‌ది కూడా ఇండియాలో ఊహించని ఇంటర్ రిలిజీయస్ మ్యారేజీ. ప్రొగ్రెసివ్ నెహ్రూ కూడా ఒప్పుకోలేదు. కానీ పట్టుబట్టి సాధించింది. ఒక కాశ్మీరీ బ్రాహ్మణ అమ్మాయి పార్శీ ఫిరోజ్‌ను పెండ్లి చేసుకుంది. ఆమె పెద్ద కొడుకు ఒక అడుగు ముందుకుపోయి ఇటలీ అమ్మాయిని ప్రతిపాదించాడు. ఇది మరొక చాలెంజ్.
ఆమె అప్పటికే ప్రధానమంత్రిని కావాలనే ఆలోచనలో ఉంది. లాల్ బహదూర్ శాస్త్రి చనిపోగానే 1967లో సోనియా పెండ్లి కాకముందే ప్రధాని అయింది. అయితే ఇందిర ప్రేమ పెండ్లి స్వాతంత్ర్యయోద్యమ కాలంలో కొన్ని సోషల్ రిఫామ్స్‌లో భాగంగా సాధ్యమైంది. ముఖ్యంగా మహాత్మాగాంధీ కులాంతర, మతాంతర పెండ్లిండ్లకు ఒప్పుకున్నాడు. కానీ నెహ్రూ సోషల్ రిఫామ్ కంటే పొలిటికల్ రిఫామ్స్ ఆలోచనలు ఉన్న వ్యక్తి. సరే 1968లో చివరికి ఒక నాటకీయ పద్ధతిలో ప్రధాన మంత్రే సోనియా–రాజీవ్‌ల పెండ్లి చేసింది. అది రిజిస్టర్డ్ మ్యారేజి.
సోనియా స్టోరీలో లవ్ కేవలం వారి కుటుంబం గురించే కాదు
ఆమె ఇండియన్ సొసైటీని ప్రేమద్వారా ఒప్పించి అందులో సభ్యురాలినైనా అని చెప్పదలుచుకుంది. ఇందిరా గాంధీ మతాంతర పెండ్లి, తరువాత రాజీవ్ మతాంతర, దేశాంతర పెండ్లి ఆ కుటుంబానికి, ముఖ్యంగా ఇందిరాగాంధీ ప్రధానమంత్రి పదవికి అటు ఆర్‌ఎస్‌ఎస్, జన్‌సంఘ్ నుంచి కన్సర్వేటివ్ బ్రాహ్మణ కాంగ్రెస్‌వాదుల నుంచి సమస్య ఆనాడే మొదలైంది.
ఆర్‌ఎస్‌ఎస్, జన్‌సంఘ్ నెహ్రూ సెక్యులరిజాన్ని, ఆయన వెస్టర్నయిజ్డ్ జీవన స్టైల్‌ని తీవ్రంగా వ్యతిరేకించారు. అందుకే వాళ్లు సర్దార్ పటేల్ బ్రాహ్మణ్ కాక శూద్రుడైనా ఆయనా బెటర్ అని వాదిస్తూ వచ్చారు. అందుకే గుజరాత్‌లో ఆయనకు పెద్ద విగ్రహం కట్టారు. కానీ ఇందిరా గాంధీ 1971లో బంగ్లాదేశ్‌ను పాకిస్తాన్‌తో విడగొట్టేయత్నంలో గెలిచాక ఆర్‌ఎస్‌ఎస్, జన్‌సంఘ్ కొంత ఆమెకు మెప్పుకోలుదారులుగా మారారు.
వాజ్‌పేయి ఆమెను ‘దుర్గ’గా ప్రకటించారు. కానీ రాజభరణాల రద్దు, బ్యాంకుల జాతీయకరణను వాళ్లు బాగా వ్యతిరేకించారు. ఆ క్రమంలో సోనియాను కోడలిగా అంగీకరించడం పట్ల బలమైన వ్యతిరేకత అంతర్గతంగా వారిలో ఉంది. వారే కాదు కులాన్ని బలంగా నమ్మే రాజకీయ నాయకులంతా సోనియా ప్రధాని ఇంట్లో కోడలిగా ఉండటం ద్వేషించుకుంటూ వచ్చారు.
ఆ తరువాత సంజయ్ గాంధీ ఖత్రి సిక్కు మేనకను పెండ్లి చేసుకోవడం కూడా కుల ద్వేషవాదానికి అసలే నచ్చలేదు. అదొక హిందూ వ్యతిరేక కుటుంబంగా చూడటం ప్రారంభమైంది. ఆర్‌ఎస్‌ఎస్, జన్‌సంఘ్ ఆ రోజుల్లో సిక్కిజాన్ని హిందూయిజంలో భాగంగా చూడడం లేదు.
సోనియా లవ్ ఐడియా ఆమెని ద్వేషించేవారిని మార్చిందా ?
ఈ దేశంలో బ్రాహ్మణిజం కులాన్ని సృష్టించి లవ్ అనే సామాజిక భావనని ఎప్పుడో చంపింది. పై కులాలు కింది కులాలను ప్రేమించవు. ద్వేషిస్తాయి. ప్రతి కులం మరో కులాన్ని విభిన్న పద్ధతుల్లో ద్వేషిస్తుంది. ఒక కులం వృత్తిని మరో కులం ప్రేమించదు.
ఇందుకు తోడుగా ఈ దేశంలోకి ఇస్లామ్ ఒక పాలక మతంగా రావడం, క్రిస్టియానిటీ ఒక ఈస్ట్ ఇండియా మతంగా భావించడంతో మతదేశంపై కులాలకు ఇతర మతాలకు తీవ్ర యుద్ధ వాతావరణాన్ని సృష్టించింది. ఉత్పత్తి కులాల్లో ఆ ద్వేష భావన అంతగా లేదు కానీ పైన కులాల్లో తీవ్రంగా ఉంది. ఈ స్థితిలో సోనియా ‘లవ్’ అవగాహన పూర్తిగా భిన్నకోణం నుంచి చర్చకు దారితీస్తోంది.
ఇటలీ ఒక అతి పురాతన క్యాథలిక్ దేశమైనా ముసోలిన్ లాంటి ఫాసిస్టులు అక్కడ పుట్టిన ప్రేమ అనే పదానికి సమాజంలో, మతంలో, ముఖ్యంగా యువతీ యువకుల మధ్య గౌరవప్రదమైన అంశం. ఇండియాలో ద్వేష పునాది చాలా లోతుగా ఉన్నది.
సనాతన ధర్మవాదం ద్వేషతత్వం అనే ఇరుసు పైన ఆధారపడుతుంది. అందుకే కుల వ్యతిరేక, అరేంజ్డ్ మ్యారేజ్ వ్యతిరేక, సర్వ మానవ సమానత్వ విలువ అనుకూల రచనలు కూడా వారి గ్రంథాల్లో లేవు. ఆచరణలో అంగీకరించరు. కనుక సోనియా ప్రేమతత్వం ఇక్కడి శక్తుల ద్వేషతత్వాన్ని మార్చడానికి పనికొస్తుందా.. ఒక చర్చనైనా మొదలుపెడుతుందా ? అనేది కీలకమైంది.
కాంగ్రెస్ నాయకులు వారి పిల్లలు పుస్తకం చదువుతారా ?
దేశ రాజకీయ నాయకులలో చదివే, రాసే అలవాటు ఎక్కువగా ఉన్నట్లు కనిపించదు. వారి ఇండ్లల్లో లైబ్రరీ ఉన్నట్లు కూడా కనిపించదు. ఆ విషయంలో అతిపెద్ద నాయకుల్లో సోనియా గాంధీ భిన్నమైనది. ఆమె ఇంట్లో పబ్లిక్ అప్పియర్స్ అంతా పెద్ద లైబ్రరీలో కూర్చుని కనిపిస్తుంది. మొదటిసారి చాలామంది కాంగ్రెస్ నాయకుల చేతిలో సోనియా పుస్తకం కనిపిస్తోంది. వాళ్లు, వాళ్ల పిల్లలైనా చదువుతారని ఆశిద్దాం.
ప్రేమకు అన్నిరంగాల్లో స్థానం కల్పించడమెట్ల ?
ఇస్లామ్‌లో కూడా స్త్రీ–పురుష ప్రేమతత్వాన్ని గౌరవించే సంస్కృతి లేదు. సెక్యులర్ భావాన్ని ఇండియన్ ముస్లిం మతవాదులు సైతం రాజకీయ అవసరాలకు అంగీకరిస్తారు. కానీ ముస్లిం దేశాలలో సెక్యులర్ సమాజ విలువలుండవు. కనుక పోటీ ద్వేషతత్వాల మధ్య బలంగా నాటుకొన్న సమాజం ఇది. దీన్ని ఎట్లా మార్చాలి? ప్రేమకు అన్నిరంగాల్లో స్థానం కల్పించడమెట్ల.
ఈ క్రమంలో ఆ పుస్తక ఆవిష్కరణలో రాహుల్ గాంధీ చేసిన ఒక వ్యాఖ్య..‘మా అమ్మ లంచ్, డిన్నర్ టైమ్‌లో నాన్న ఒడిలో కూర్చునేది’ అనడం పెద్ద వివాదం అయింది. అది నిజమా కాదా వేరే విషయం. వారు ఒకరిలో ఒకరు అన్యోన్యంగా ఉండేవారు అనడానికి అది ఒక ఉపమానం. బీజేపీ వారు ఆయన మీద తీవ్రమైన దాడికి దిగారు.
దాని సమాధానంగా శివుని తొడపై పార్వతి కూర్చున్న ఒక శిల్పాన్ని ట్విట్టర్‌లో పెట్టి సత్యం, శివం, సుందరం అని రాసి నేను మనుషుల మధ్య ప్రేమను పెంచే హిందువును అని రాశాడు. దీనిపై కూడా చాలాకాలమే చర్చ జరుగుతుంది. ఎందుకంటే మనుషులు, కులాలు, మతాల మధ్య ప్రేమపూరిత సంబంధాలు ఉండాలని, ప్రేమకు కుష్టివ్యాధి కూడా అడ్డం రాకూడదని సనాతన ధర్మవాదం ఎక్కడా చెప్పలేదు.
ఈ స్థితిలో వచ్చిన సోనియా గాంధీ పుస్తకం, దానిపై జరిగే చర్చ ఎటుదారి తీస్తుంది. కొన్ని శక్తులు ఎంత ద్వేషించుకున్నా, సోనియాను అభిమానించేవారు దేశంలో కోట్లకొద్దీ ఉన్నారు. ఆమె అనీబిసెంట్ కంటే మదర్ థెరిసా కంటే, గెయిల్ కంటే భిన్నమైన ఫారెనర్ సెటిల్డ్ ఇన్ ఇండియా. ఆమె అన్ని విధాలుగా ఈ దేశస్తురాలు అనడంలో ఏ మాత్రం అనుమానం లేదు.
ప్రొ. కంచ ఐలయ్య షఫర్డ్
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ [email protected]
