పల్లెల నుంచి పట్టణాలకు జనం.. తెలంగాణలో భారీగా పెరుగుతున్న రియల్ ఎస్టేట్!

పల్లెల నుంచి పట్టణాలకు జనం.. తెలంగాణలో భారీగా పెరుగుతున్న రియల్ ఎస్టేట్!
  • తెలంగాణలో సగం జనాభా ఉంటున్నది టౌన్​లలోనే..
  • చదువు, ఉద్యోగం, ఉపాధి కోసం పల్లెలు వదులుతున్న జనం
  • కొత్త జిల్లాలు, మున్సిపాలిటీలు, గ్రామాల విలీనంతో ఊపు
  • కరీంనగర్ 405%, వరంగల్ నగరం 316 శాతం విస్తరణ
  • సిద్దిపేట, సూర్యాపేట, జగిత్యాలలో రికార్డు స్థాయిలో నిర్మాణాలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో హైదరాబాద్, వరంగల్ వంటి నగరాలకు దీటుగా ఇతర పట్టణాలు శరవేగంగా విస్తరిస్తున్నాయి. జిల్లాల పునర్విభజన, నగరాలు, మున్సిపాలిటీల్లో శివారు గ్రామాల విలీనం, జాతీయ రహదారుల విస్తరణతో పట్టణాల రూపురేఖలు మారిపోయాయి. దీనికి తోడు పిల్లల చదువులు, ఉద్యోగం, ఇతర అవసరాల కోసం పల్లె జనం పట్టణాల బాట పడుతున్నారు. ఫలితంగా పదేండ్లలో రాష్ట్రంలోని ప్రధాన పట్టణాల బిల్ట్–అప్ ఏరియా భారీగా పెరగగా, మున్సిపాలిటీల సరిహద్దులు ఏకంగా 400% వరకు విస్తరించాయి. శివార్లలోని పంట పొలాలు, ఖాళీ స్థలాలన్నీ రియల్ ఎస్టేట్ వెంచర్లు, నివాస కాలనీలుగా మారిపోతున్నాయి. 2011 జనాభా లెక్కలు, పురపాలక శాఖ రికార్డులు, తెలంగాణ సామాజిక–ఆర్థిక సర్వే, నీతి ఆయోగ్ నివేదికలు ఈ వేగవంతమైన పట్టణీకరణకు అద్దం పడుతున్నాయి.

రాష్ట్రం ఏర్పడ్డాక పట్టణ స్థానిక సంస్థల సంఖ్య రెట్టింపు కావడం పట్టణీకరణ వేగానికి నిదర్శనం. 2014లో రాష్ట్రం ఏర్పడినప్పుడు 68 పట్టణ స్థానిక సంస్థలు (6 కార్పొరేషన్లు, 62 మున్సిపాలిటీలు) మాత్రమే ఉండేవి. కొత్త మున్సిపాలిటీల ఏర్పాటు, 2024లో మంచిర్యాల, కొత్తగూడెంను కార్పొరేషన్లుగా అప్‌గ్రేడ్ చేయడంతో ఆ సంఖ్య 142కు చేరింది. అంటే పదేండ్లలో కొత్తగా 74 పట్టణాలు అధికారికంగా పుట్టుకొచ్చాయి. 350కి పైగా మేజర్ గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలుగా మారడం లేదా సమీప పట్టణాల్లో విలీనం కావడం జరిగింది. 2011లో 40.50 చదరపు కిలోమీటర్లు ఉన్న కరీంనగర్, రేకుర్తి, తీగలగుట్టపల్లి, అలుగునూరు, బొమ్మకల్, చింతకుంట విలీనంతో 204.50 చదరపు కిలోమీటర్లకు (దాదాపు 5 రెట్లు) విస్తరించింది. 42 శివారు గ్రామాల విలీనంతో వరంగల్ నగర విస్తీర్ణం 110 నుంచి 457.77 చదరపు కిలోమీటర్లకు (4 రెట్లకు పైగా) పెరిగింది; మడికొండ, హసన్‌పర్తి, భీమారం, మామునూరు వైపు కొత్త కాలనీలు వెలిశాయి. నిజామాబాద్ 42.90 నుంచి 169.37 చదరపు కిలోమీటర్లకు, ఖమ్మం 30.25 నుంచి 94.45 చదరపు కిలోమీటర్లకు విస్తరించాయి. నస్పూర్, క్యాతన్‌పల్లి విలీనంతో మంచిర్యాల 155.93 చదరపు కిలోమీటర్లకు, పాల్వంచ విలీనంతో కొత్తగూడెం 86.10 చదరపు కిలోమీటర్లకు చేరి కార్పొరేషన్లుగా అవతరించాయి. కేంద్రం ‘అమృత్’ పథకంలో లక్షకు పైగా జనాభా ఉన్న రాష్ట్రంలోని 12 ప్రధాన పట్టణాలకు ప్రత్యేక నిధులు రావడంతో వాటి రూపురేఖలు మరింత వేగంగా మారుతున్నాయి.

సరిహద్దులు మారకున్నా.. ఇంచు జాగా ఖాళీ లేదు

కొన్ని పట్టణాల అధికారిక సరిహద్దులు 2011 నుంచి మారకపోయినా నిర్మాణాలు విపరీతంగా పెరిగాయి. కామారెడ్డి (14.10 చ.కి.మీ.), సంగారెడ్డి (13.70), రామగుండం (93.87), ఆదిలాబాద్ (35.50), మిర్యాలగూడ (28.36), జహీరాబాద్ (21.78) పట్టణాల్లో 2011 నాటి ఖాళీ స్థలాలు, సాగు భూములు ఇప్పుడు భవనాలతో నిండిపోయాయి. కామారెడ్డి శివారులోని టేక్రియాల్, అడ్లూర్, దేవునిపల్లి, సంగారెడ్డి శివారులోని పోతిరెడ్డిపల్లి, కంది, ఇస్నాపూర్ పట్టణంలో అంతర్భాగమైపోయాయి. జహీరాబాద్‌లో నిమ్జ్, మహీంద్రా ప్లాంట్, మిర్యాలగూడలో రైస్ మిల్లులు, దామరచర్ల పవర్ ప్లాంట్ వల్ల ఈకాలనీలు పెద్ద ఎత్తున వెలిశాయి.

హైవేల వెంట రియల్ బూమ్

జాతీయ రహదారుల విస్తరణ చిన్న పట్టణాల్లో రియల్ ఎస్టేట్‌కు ఊతమిచ్చింది. టీజీ–బీపాస్ గణాంకాల ప్రకారం 2020 నవంబర్ నుంచి ఇప్పటివరకు మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో 3.65 లక్షలకు పైగా భవన నిర్మాణ అనుమతులు, 2,400కు పైగా కొత్త లేఅవుట్లకు అనుమతులు ఇచ్చారు. ఇందులో 65 శాతం హైదరాబాద్ బయటి చిన్న పట్టణాల్లోనే. రెవెన్యూ శాఖ లెక్కల ప్రకారం పదేండ్లలో పట్టణ శివార్లలో దాదాపు 3 లక్షల ఎకరాల వ్యవసాయ భూమి నివాస, వాణిజ్య స్థలాలుగా మారింది. ఎన్‌హెచ్–44 వెంట ఉన్న ఆర్మూర్ 18 నుంచి 42 చ.కి.మీ.లకు (133.3%), మహబూబ్‌నగర్ 37.28 నుంచి 98.64 చ.కి.మీ.లకు (164.6%), ఎన్‌హెచ్–65పై కోదాడ 15.60 నుంచి 31.19 చ.కి.మీ.లకు (100%), ఎన్‌హెచ్–163పై జనగామ 17.46 నుంచి 27.50 చ.కి.మీ.లకు (57.5%), భువనగిరి 19.50 నుంచి 36.80 చ.కి.మీ.లకు (88.7%) విస్తరించి హైవేలకు ఇరువైపులా కొత్త కాలనీలు వెలిశాయి.

నిలువు విస్తరించిన మెట్‌పల్లి, తాండూరు

శివార్లలో భూమి దొరక్క, ధరలు పెరిగిన పట్టణాల్లో నిలువు విస్తరణ జోరుగా సాగుతోంది. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి విస్తీర్ణం 2.65 నుంచి 3.48 చ.కి.మీ.లకు (31.3%) మాత్రమే పెరిగినా, పాత ఇండ్ల స్థానంలో జీ+3, జీ+4 అపార్ట్‌మెంట్లు, వాణిజ్య భవనాలు వెలిశాయి. వికారాబాద్ జిల్లా తాండూరు (23.50 చ.కి.మీ.)లో సిమెంట్ ఫ్యాక్టరీలు, నాపరాయి గనుల వల్ల కార్మికులు, వ్యాపారుల తాకిడి పెరిగి బిల్ట్–అప్ ఏరియా 55 శాతం పెరిగింది. కోరుట్లలో బీడీ ఫ్యాక్టరీల చుట్టూ కార్మికులు ఇండ్లు కట్టుకోవడంతో పట్టణ విస్తీర్ణం 2.54 నుంచి 4.13 చ.కి.మీ.లకు (62.6%) పెరిగింది.

జీఎస్‌డీపీలో 65% పట్టణాల నుంచే

పట్టణాల విస్తరణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ప్రధాన ఇంజిన్‌గా మారింది. సామాజిక–ఆర్థిక సర్వే ప్రకారం రాష్ట్ర జీఎస్‌డీపీలో 65 శాతానికి పైగా నగరాలు, పట్టణాల నుంచే వస్తోంది. 2014–15లో సేవా రంగం వాటా 61.3 శాతం ఉండగా, చిన్న పట్టణాల్లో విద్యాసంస్థలు, దవాఖానలు, షాపింగ్ మాల్స్, బ్యాంకింగ్ విస్తరించడంతో అది 66.5 శాతానికి చేరింది. ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలోని 16 జిల్లాల్లో పదేండ్లలో గృహ కనెక్షన్లు 38 శాతం పెరగగా, కమర్షియల్ కనెక్షన్లు 62 శాతానికి పైగా పెరిగాయి. జగిత్యాలలో గృహ కనెక్షన్ల కంటే కమర్షియల్ కనెక్షన్లు వేగంగా పెరగగా, మెట్‌పల్లిలో విద్యుత్ లోడ్ 58.4 శాతం పెరిగింది. రవాణా శాఖ లెక్కల ప్రకారం 2014లో 72 లక్షలు ఉన్న వాహనాలు ఇప్పుడు 1.65 కోట్లకు చేరగా, హైదరాబాద్ తర్వాత వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లోనే అత్యధిక రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి.

 ఐదు ప్రధాన కారణాలు ఇవే


పిల్లల చదువు 
గ్రామాల్లో సర్కారు బడుల్లో వసతుల కొరత, నాణ్యమైన ఇంగ్లీష్ మీడియం స్కూళ్లు, జూనియర్, డిగ్రీ కాలేజీలు లేకపోవడంతో తల్లిదండ్రులు దగ్గర్లోని జిల్లా, డివిజన్ కేంద్రాలకు షిఫ్ట్ అవుతున్నారు.
ఉపాధి
 వ్యవసాయంలో కూలీల కొరత, పెట్టుబడులు పెరగడం, యంత్రాల వల్ల ఊర్లలో ఏడాది పొడవునా పని దొరకడం లేదు. దీంతో చిన్న, సన్నకారు రైతులు పొలాలు కౌలుకిచ్చి పట్టణాల్లో కిరాణా, హోటళ్లు, ఆటో, డ్రైవింగ్, నిర్మాణ రంగం వైపు వెళ్తున్నారు.
వైద్యం
అత్యవసర వైద్యం, డయాగ్నస్టిక్ సెంటర్లు, మల్టీ స్పెషాలిటీ దవాఖానలు పట్టణాల్లోనే ఉండటంతో దీర్ఘకాలిక రోగులు, వృద్ధులున్న కుటుంబాలు టౌన్లలో ఉండేందుకు మొగ్గు చూపుతున్నాయి.
పాలనా వికేంద్రీకరణ
కొత్త జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్లు, కోర్టులు, ప్రభుత్వ ఆఫీసులు రావడంతో ఉద్యోగులు, లాయర్లు, అనుబంధ రంగాల వాళ్లు అక్కడే స్థిరపడుతున్నారు.
సులభ రుణాలు
బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ సంస్థల ద్వారా లోన్లు సులభంగా దొరుకుతుండటం, శివార్లలో తక్కువ ధరకే ప్లాట్లు దొరకడంతో గ్రామీణ మధ్యతరగతి ప్రజలు సొంత ఇండ్లు కట్టుకుని శాశ్వత పట్టణవాసులుగా మారుతున్నారు.

సగం జనాభా పట్టణాల్లోనే

రాష్ట్రంలో పట్టణ జనాభా దేశ సగటు కన్నా వేగంగా పెరుగుతోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా 3,50,03,674 కాగా, అందులో పట్టణ జనాభా 1,36,08,665 (38.88 శాతం) మాత్రమే. అప్పట్లో దేశ సగటు 31.16 శాతం. నేషనల్ పాపులేషన్ ప్రొజెక్షన్ రిపోర్టు, తెలంగాణ సామాజిక–ఆర్థిక సర్వే గణాంకాల ప్రకారం 2026 నాటికి రాష్ట్ర పట్టణ జనాభా 50.08 శాతానికి చేరింది. అంటే రాష్ట్రంలో సగం మంది ఇప్పుడు నగరాలు, పట్టణాల్లోనే ఉంటున్నారు. ఇదే సమయంలో దేశ సగటు 36.01 శాతమే.  జాతీయ సగటు కంటే తెలంగాణ 14.07 శాతం పాయింట్లు ముందుంది. 2036 నాటికి రాష్ట్ర పట్టణ జనాభా 57.60 శాతానికి చేరుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.  నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం పెద్ద రాష్ట్రాల్లో తమిళనాడు, కేరళ తర్వాత అత్యంత వేగంగా పట్టణీకరణ చెందుతున్న రాష్ట్రంగా తెలంగాణ మూడో స్థానంలో ఉంది. హైదరాబాద్ జిల్లాలో 100 శాతం పట్టణ జనాభా ఉండగా, మేడ్చల్–మల్కాజిగిరి (91 శాతం), రంగారెడ్డి జిల్లాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

కొత్త జిల్లా కేంద్రాలు.. కొత్త ఆర్థిక కేంద్రాలు

కొత్త జిల్లాల ఏర్పాటు.. రెవెన్యూ డివిజన్ కేంద్రాలుగా ఉన్న పట్టణాలను ఆర్థిక కేంద్రాలుగా మార్చేసింది. జగిత్యాలలో 2015లో 6.06 చదరపు కిలోమీటర్లు ఉన్న బిల్ట్–అప్ ఏరియా 2025 నాటికి 10.93 చదరపు కిలోమీటర్లకు విస్తరించింది. ఇక్కడ సాగు భూములు 67.6%, ఖాళీ స్థలాలు 73.7% తగ్గిపోయి కాలనీలుగా మారాయి. సిద్దిపేట 36.03 నుంచి 55 చదరపు కిలోమీటర్లకు, సూర్యాపేట 24 నుంచి 35, నిర్మల్ 22 నుంచి 32, సిరిసిల్ల 25.68 నుంచి 59.5, వనపర్తి 18.20 నుంచి 40.25, మహబూబాబాద్ 21.10 నుంచి 49.50 చదరపు కిలోమీటర్లకు విస్తరించాయి. ఈ పట్టణాల జనాభా పదేండ్లలో 45 నుంచి 89 శాతం వరకు పెరిగింది.

అప్ అండ్ డౌన్ బంద్.. టౌన్లలోనే మకాం

ఒకప్పుడు ఊళ్లోనే ఉంటూ రోజూ బస్సులు, బైక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లపై దగ్గర్లోని పట్టణానికి వెళ్లి సాయంత్రానికి తిరిగొచ్చేవాళ్లు. కానీ పెరిగిన రవాణా ఖర్చులు, ట్రాఫిక్, మారిన జీవనశైలితో ఆ ‘అప్ అండ్ డౌన్’కు స్వస్తి చెప్పి కుటుంబాలతో సహా పట్టణాలకే మకాం మారుస్తున్నారు. నేషనల్ శాంపిల్ సర్వే వలసల నివేదిక, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం గ్రామాల నుంచి పట్టణాలకు జరుగుతున్న శాశ్వత వలసల్లో దాదాపు 42 శాతం ఉపాధి కోసం, 28 శాతం పిల్లల చదువులు, మెరుగైన జీవన ప్రమాణాల కోసం జరుగుతున్నాయి.