ఆకాశం నుంచి బుల్లెట్ల వర్షం.. భూమి పై నుంచి కౌంటర్‌గా కాల్పులు.. ఏటు చూసినా తుపాకుల మోత.. అసలు ఏం జరుగుతుందో అర్ధంకాక ప్రాణభయంతో ప్రజల పరుగులు.. ఇదేదో సినిమా కాదు. మెక్సికోలో జరిగిన రియల్ ఇన్సిడెంట్. ఎఫ్‌బీఐ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, డ్రగ్ లార్డ్ ఫాస్టో ఇసిడ్రో మెజా-ఫ్లోర్స్‌ను అరెస్ట్ చేసేందుకు మెక్సికో సైన్యం చేపట్టిన స్పెషల్ ఆపరేషన్. శుక్రవారం రాత్రి (నవంబర్ 20) పశ్చిమ మెక్సికోలోని సినలోవా రాష్ట్రంలోని గ్వాసావే నగరంలో స్పెషల్ ఆపరేషన్ నిర్వహించిన మెక్సికో ఆర్మీ డ్రగ్ కింగ్ పిన్ ఫాస్టో ఇసిడ్రో మెజా-ఫ్లోర్స్‌ను అరెస్ట్ చేసింది. సినిమాకు ఏ మాత్రం తీసిపోని హెలికాప్టర్ కాల్పులు, పేలుళ్లతో మెక్సికో దద్దరిల్లింది.
మెక్సికో డ్రగ్స్ సామాజ్ర్యానికి మెజా-ఫ్లోర్స్ కింగ్ పిన్. ఇతను లాస్ మజాట్లెకోస్ అనే గ్యాంగ్‌కు లీడర్. గతంలో బెల్ట్రాన్-లేవా కార్టెల్‌తో కలిసి పనిచేసిన ఇతను మెక్సికో, అమెరికాలోకి భారీ ఎత్తున డ్రగ్స్ అక్రమ రవాణాకు పాల్పడుతున్నాడు. అండర్ గ్రౌండ్లో ఉండి వేలకోట్ల డ్రగ్స్ దందాను నడుపుతోన్న మెజా-ఫ్లోర్స్ అమెరికాకు చెందిన ఎఫ్‌బీఐ టాప్ 10 మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ జాబితాలో ఒకడు. ఇతని సమాచారం ఇచ్చిన వారికి అమెరికా ప్రభుత్వం గతంలో 5 మిలియన్ డాలర్ల రివార్డును కూడా ప్రకటించింది.
ఎంతోకాలంగా పరారీలో ఉన్న మెజా-ఫ్లోర్స్ గ్వాసావే నగరంలో నగరంలో ఉన్నట్లు అమెరికా ఇంటలిజెన్స్ గుర్తించింది. ఈ సమాచారాన్ని మెక్సికో సైన్యానికి తెలియజేసింది. అమెరికా నిఘా సమాచారంతో మెజా-ఫ్లోర్స్‌ను పట్టుకునేందుకు మెక్సికో సైన్యం స్పెషల్ ఆపరేషన్ చేపట్టి దాడులు నిర్వహించింది. మెజా-ఫ్లోర్స్ కార్టెల్ గ్యాంగ్ ఆర్మీపై ప్రతిదాడికి దిగారు. దీంతో సైనిక హెలికాప్టర్లు గాలిలో నుంచే బుల్లెట్ల వర్షం కురిపించాయి. ఎట్టకేలకు మెజా-ఫ్లోర్స్‌ను సైన్యం అరెస్ట్ చేసింది. ఈ ఆపరేషన్‌లో ఇసిడ్రోతో పాటు మరో ఇద్దరు గ్యాంగ్ లీడర్లను కూడా అదుపులోకి తీసుకుని మెక్సికో సిటీకి తరలించారు.
మెజా-ఫ్లోర్స్ అరెస్ట్ తర్వాత అతని కార్టెల్ సభ్యులు విధ్వంసానికి పాల్పడ్డారు. గ్వాసావే పరిసర ప్రాంతాల్లో వాహనాలకు నిప్పు పెట్టి రోడ్లను దిగ్బంధించారు. మరోవైపు.. నగరంలోని కురోడా పార్క్ స్టేడియంలో జరుగుతున్న బేస్‌బాల్ మ్యాచ్‌కు సమీపంలోనే కాల్పులు జరగడంతో ఆటగాళ్లు, ప్రేక్షకులు ప్రాణభయంతో పరుగులు తీశారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. స్థానికంగా భయాందోళనలు నెలకొనడంతో ప్రజలు ఇళ్లలోనే ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
