కోల్‌కతా టు హైదరాబాద్ గోల్డ్ స్మగ్లింగ్..కారులో టెయిల్ లైట్ వెనుక 4 కోట్ల బంగారం స్వాధీనం

కోల్‌కతా టు హైదరాబాద్ గోల్డ్ స్మగ్లింగ్..కారులో టెయిల్ లైట్ వెనుక 4 కోట్ల బంగారం స్వాధీనం

హైదరాబాద్: విదేశీ మూలాలు కలిగిన బంగారం స్మగ్లింగ్‌ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు గుట్టురట్టు చేశారు. కోల్‌కతా నుంచి హైదరాబాద్‌కు కారులో అక్రమంగా తరలిస్తున్న 2.98 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన బంగారం విలువ సుమారు రూ.3.83 కోట్లు ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఈ కేసులో ఇద్దరిని అరెస్ట్ చేయడంతో పాటు బంగారం తరలింపునకు ఉపయోగించిన కారును సీజ్ చేశారు.

పక్కా సమాచారంతో DRI ప్రత్యేక ఆపరేషన్

నవంబర్ 19, 20 తేదీల్లో DRI హైదరాబాద్ యూనిట్ ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది. విశ్వసనీయ సమాచారం మేరకు కోల్‌కతా నుంచి హైదరాబాద్‌కు వస్తున్న కియా సెల్టోస్ (KIA Seltos) కారును అధికారులు అడ్డగించారు. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించారు.

కారు టెయిల్ లైట్ వెనుక రహస్య అర

అనంతరం కారును క్షుణ్ణంగా తనిఖీ చేయగా టెయిల్ లైట్ వెనుక ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రహస్య అరలో బంగారం దాచినట్లు గుర్తించారు. బ్రౌన్ అడెసివ్ టేప్‌తో చుట్టిన మూడు ప్యాకెట్లను బయటకు తీసి పరిశీలించగా వాటిలో 25 బంగారు బిస్కెట్లు ఉన్నట్లు తేలింది. వీటి మొత్తం బరువు 2.98 కిలోలుగా గుర్తించారు.

24 క్యారెట్ల బంగారంగా నిర్ధారణ

స్వాధీనం చేసుకున్న బంగారు బార్లలో కొన్నింటిపై విదేశీ గుర్తులు ఉండగా, మరికొన్నింటిపై ఉన్న గుర్తులను చెరిపివేసినట్లు అధికారులు గుర్తించారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన గోల్డ్ వాల్యూయర్ నిర్వహించిన పరీక్షల్లో ఈ బంగారం 24 క్యారెట్ల స్వచ్ఛత కలిగి ఉన్నట్లు నిర్ధారణ అయింది. పట్టుబడిన బంగారం విలువ సుమారు రూ.3.83 కోట్లుగా అంచనా వేశారు.

కస్టమ్స్ చట్టం ప్రకారం కేసు నమోదు

కస్టమ్స్ యాక్ట్, 1962 ప్రకారం 25 బంగారు బార్లతో పాటు అక్రమ రవాణాకు ఉపయోగించిన కియా సెల్టోస్ కారును DRI అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కారులో ఉన్న ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఈ బంగారం ఎక్కడి నుంచి వచ్చింది? స్మగ్లింగ్ వెనుక ఎవరున్నారు? హైదరాబాద్‌లో ఎవరికి సరఫరా చేయాలనుకున్నారు? అనే కోణాల్లో అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.