ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలకు బెంగుళూరు కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. గత కొంతకాలంగా వివాదాస్పదంగా మారిన యలహంక ప్యాలెస్ లో షర్మిల జోక్యం చేసుకోవద్దని తేల్చి చెప్పింది దేవనహళ్లి కోర్టు. శనివారం ( నవంబర్ 21 ) ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది కోర్టు. యలహంక ప్యాలెస్ లో షర్మిల జోక్యం చేసుకోకుండా నిరోధించాలని జగన్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన కోర్టు ఈమేరకు తీర్పు వెల్లడించింది.
ఆదివారం ( నవంబర్ 22 ) జగన్ ఇంటి ముందు షర్మిల భారీ ధర్నాకు ప్లాన్ చేసిన క్రమంలో కోర్టు తీర్పు బిగ్ షాక్ అనే చెప్పాలి. షర్మిల కానీ, షర్మిల కుటుంబసభ్యులు, అనుచరులు ఎవరూ కూడా జగన్ యలహంక లోని జగన్ ఇంటి పరిసరాలకు వెళ్లోద్దని స్పష్టం చేసింది కోర్టు. జగన్ ఇంటికి సంబంధించిన గోడలు, చెట్లు ఫెన్సింగ్ మొదలుకొని ఏ ఒక్క వస్తువు నష్టం వాటిల్లేలా వ్యవహరించొద్దని స్పష్టం చేసింది కోర్టు.
గత కొంతకాలంగా యలహంక ప్యాలెస్ కేంద్రంగా వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. షర్మిల తన కుమార్తె అంజలి వివాహాన్ని యలహంక ప్యాలెస్ లో నిర్వహించాలని భావించిన క్రమంలో భద్రతా కారణాల దృష్ట్యా అభ్యంతరం వ్యక్తం చేశారు జగన్. దీంతో అంజలి వివాహ వేదిక మార్చుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో తన కూతురు వివాహానికి జగన్ ను ఆహ్వానించేందుకు షర్మిల తన కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం యలహంక ప్యాలెస్ కు వెళ్లి, అక్కడే బస చేయాలని నిర్ణయించుకుంది.ఈ క్రమంలో అప్రమత్తమైన జగన్ టీం న్యాయపరమైన చర్యలు మొదలుపెట్టింది.
షర్మిల నేరుగా యలహంక ప్యాలెస్ కు వస్తే భద్రతా సిబ్బందితో అడ్డుకోవడం ద్వారా అనవసర రాజకీయ దుమారం రేగుతుందని జగన్, ఎలాంటి వివాదాలకు తావులేకుండా ఉండేందుకే చట్టబద్ధంగా కోర్టు ద్వారా ఇంజంక్షన్ ఆర్డర్ కోరినట్లు సమాచారం. ఈ క్రమంలో ఆదివారం యలహంక ప్యాలెస్ దగ్గర హై డ్రామా చోటు చేసుకుంటుందా అన్న ఉత్కంఠ నెలకొంది.
