ఈవ్ టీజింగ్‌ పై మంత్రి లోకేశ్ సీరియస్.. రైల్వే కోడూరులో పోలీసుల తనిఖీలు...

ఈవ్ టీజింగ్‌ పై మంత్రి లోకేశ్ సీరియస్.. రైల్వే కోడూరులో పోలీసుల తనిఖీలు...

అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారనే ఫిర్యాదులపై మంత్రి నారా లోకేశ్ సీరియస్ అయ్యారు. పాఠశాల విద్యార్థినులను వేధిస్తున్న ఆకతాయిలపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు లోకేష్.

మంత్రి ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన రైల్వే కోడూరు పోలీసులు స్థానిక పాఠశాలను సందర్శించి విద్యార్థినులు, ఉపాధ్యాయులతో మాట్లాడారు. సీఐ పాఠశాలకు వెళ్లి క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. ఆకతాయిల వల్ల ఎదురవుతున్న సమస్యలను, జరిగిన సంఘటనల గురించి విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు లోకేష్. ఎవరూ అధైర్యపడొద్దని, విద్యార్థినుల భద్రతకు పోలీసు శాఖ పూర్తి భరోసా కల్పిస్తుందని హామీ ఇచ్చారు సీఐ.

ఈ ఘటనపై జిల్లా ఎస్పీ స్పందిస్తూ.. ఈవ్ టీజింగ్‌కు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులను గుర్తించి, వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలల పరిసరాల్లో భద్రతను పటిష్టం చేయాలని, వేధింపులకు ఆస్కారం లేకుండా చూడాలని ఎస్పీ పేర్కొన్నారు.

విద్యార్థినుల రక్షణ విషయంలో రాజీ పడబోమని, ఇబ్బందులు ఎదురైతే వెంటనే పోలీసులకు సంప్రదించాలని అధికారులు సూచించారు. పాఠశాల వేళల్లో నిరంతర పర్యవేక్షణ ద్వారా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.