ప్రముఖ సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ తల్లి ఉమారాణి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం దొడ్డిపట్ల గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి ఆమె పోటీకి సిద్ధమయ్యారు. నవంబర్ 18న అనంత శ్రీరామ్ తల్లిదండ్రులు చేగొండి వీర వెంకట సత్యనారాయణ మూర్తి, ఉమారాణి జనసేన పార్టీలో చేరారు.
పాలకొల్లు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని దొడ్డిపట్ల గ్రామ పంచాయతీ ఈసారి జనరల్ (మహిళ) కేటగిరీకి కేటాయించారు. రాష్ట్రంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల మూడవ విడతలో భాగంగా డిసెంబర్ 2న ఇక్కడ పోలింగ్ జరగనుంది. నామినేషన్ల దాఖలుకు నవంబర్ 21 నుంచి 23 వరకు గడువు ఉంది. గడువు ముగియడానికి మరో మూడు రోజులు మాత్రమే సమయం ఉండటంతో అనంత శ్రీరామ్ కుటుంబం ఎన్నికల సన్నాహాల్లో నిమగ్నమైంది.
తమ కుటుంబానికి అవకాశం కల్పిస్తే గ్రామాభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తానని అనంత శ్రీరామ్ పేర్కొన్నారు. తన తల్లి ఎన్నిక ఏకగ్రీవం అయ్యేలా సహకరించాలని ఆయన పార్టీలకతీతంగా గ్రామస్తులను కోరుతున్నారు. అయితే, ఇదే స్థానం కోసం కూటమిలోని మరో నేత నుంచి కూడా పోటీ ఉన్నట్లు సమాచారం.
ఈ క్రమంలో తన తల్లిని సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి దింపేందుకు అనుమతించాలని జనసేన జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావుతో పాటు ఇతర ముఖ్య నేతలను అనంత శ్రీరామ్ కలిశారు. ఈ ప్రతిపాదనకు పార్టీ నేతల నుంచి సానుకూల స్పందన లభించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో దొడ్డిపట్లలో రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి.
