అగ్నివీర్ టెస్ట్ సైట్‌ను హ్యాక్ చేసిన 14 ఏళ్ల బాలుడు.. డార్క్ వెబ్‌లో 4 వేల మంది డేటా..!

అగ్నివీర్ టెస్ట్ సైట్‌ను హ్యాక్ చేసిన 14 ఏళ్ల బాలుడు.. డార్క్ వెబ్‌లో 4 వేల మంది డేటా..!

న్యూఢిల్లీ: అగ్నివీర్ల డేటా చోరీ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. హర్యానాలోని బల్లబ్‌గఢ్‌కు చెందిన 14 ఏళ్ల మైనర్ బాలుడు అగ్నివీర్ టెస్ట్ సైట్‌ను హ్యాక్ చేసి అగ్నిపథ్ పథకం కింద ఎంపికైన సుమారు 4 వేల మంది అగ్నివీరుల సమాచారాన్ని సేకరించాడు. ఈ డేటాను  డార్క్ వెబ్‌లో 500 డాలర్ల (సుమారు రూ. 42  వేలు)కు విక్రయానికి పెట్టాడు. ఢిల్లీ స్పెషల్ సెల్‌ పోలీసులు ఈ డేటా చోరీని గుర్తించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. 

బాలుడు ఒక టెస్ట్ వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసి ఈ సమాచారాన్ని సేకరించినట్లు అధికారులు తెలిపారు. అగ్నిపథ్ పథకం కింద ఎంపికైన సుమారు 4 వేల మంది అగ్నివీరుల సమాచారాన్ని సేకరించి డార్క్ వెబ్‎లో అమ్మకానికి పెట్టినట్లు వెల్లడించారు. అగ్నివీరులు ఇతర ప్రభుత్వ విభాగాల్లోని ఖాళీల కోసం రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఉద్దేశించిన వెబ్‌సైట్ నుంచి ఈ డేటా లీక్ అయినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.

సదరు బాలుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఉపయోగించి ఈ సమాచారాన్ని సేకరించాడు. అయితే ఇందుకోసం ఏ రకమైన ఏఐ టూల్స్ వాడాడనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్న డిజిటల్ పరికరాలను ఐఎఫ్ఎస్ఓ విభాగానికి పంపారు.

ఈ కేసులో బాలుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు చట్టప్రకారం విచారించారు. అనంతరం నిందితుడు మైనర్ కావడంతో నిబంధనల ప్రకారం తిరిగి తల్లిదండ్రులకు అప్పగించారు. ప్రస్తుతానికి ఈ కేసులో ఎవరినీ అరెస్ట్ చేయలేదని పోలీసులు స్పష్టం చేశారు.

బాలుడు విక్రయానికి పెట్టిన సమాచారంలో అగ్నివీరుల పేర్లు, ఫోన్ నంబర్లు, సర్వీస్ వివరాలు ఉన్నట్లు డార్క్ వెబ్ ప్రకటనలో పేర్కొన్నాడు. అయితే ఈ డేటా నిజమైనదేనా అన్న కోణంలో పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. ఈ వివరాలను ధృవీకరించుకోవడానికి కేంద్ర హోం శాఖకు లేఖ రాశారు. ప్రభుత్వం వద్ద ఉన్న అధికారిక అగ్నివీరుల జాబితాతో డార్క్ వెబ్‌లోని డేటాను సరిపోల్చి చూడనున్నారు. ఆ ప్రక్రియ పూర్తయ్యే వరకు అందులోని పేర్లు అసలైనవా కాదా అనేది చెప్పలేమని అధికారులు తెలిపారు.

ఈ ఘటన సుమారు రెండు నెలల క్రితమే జరిగినట్లు సమాచారం. బాలుడు అప్పుడే ఫైళ్లను డార్క్ వెబ్‌లో అప్‌లోడ్ చేసి కొనుగోలుదారుల కోసం వెతుకుతున్నట్లు విచారణ సంస్థలు గుర్తించాయి. ఈ సమాచారాన్ని ఎవరైనా కొనుగోలు చేశారా లేదా అనే దానిపై ఇంకా ఆధారాలు లభించలేదు.

సైన్యం, నౌకాదళం, వైమానిక దళాల్లో నాలుగేళ్ల కాలపరిమితితో నియామకాలు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం 2022 జూన్‌లో అగ్నిపథ్ పథకాన్ని ప్రారంభించింది. ఈ స్కీమ్ కింద ఎంపికైన వారిని అగ్నివీరులుగా పిలుస్తారు. ప్రభుత్వ రిక్రూట్‌మెంట్ పోర్టల్స్‌ భద్రతపై ఈ ఘటన పలు ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఒక 14 ఏళ్ల బాలుడు ప్రభుత్వ వెబ్‌సైట్‌ను హ్యాక్ చేయడంపై భద్రతా సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై సమగ్ర విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.