తెలంగాణలో పల్స్ పోలియో కార్యక్రమానికి వైద్యారోగ్య శాఖ భారీ ఏర్పాట్లు చేస్తోంది. సబ్ నేషనల్ ఇమ్యునైజేషన్ డే (SNID)-2026లో భాగంగా ఈ ఆదివారం( నవంబర్ 22) హైదరాబాద్‌తో పాటు రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి, హన్మకొండ జిల్లాల్లో ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నారు. ప్రతి చిన్నారికి రెండు చుక్కల ఓరల్ పోలియో వ్యాక్సిన్ (bOPV) అందించడమే లక్ష్యంగా అధికారులు చర్యలు చేపట్టారు.
ఈ ఐదు జిల్లాల్లో మొత్తం 18,01,698 మంది చిన్నారులకు వ్యాక్సిన్ వేయాలని వైద్యారోగ్య శాఖ లక్ష్యంగా నిర్ణయించింది. ఇందుకోసం 7,428 పోలియో బూత్‌లు, 245 మొబైల్ టీమ్‌లు, 245 ట్రాన్సిట్ పాయింట్లను ఏర్పాటు చేశారు. ఆదివారం పోలియో బూత్‌లకు రాలేని చిన్నారుల కోసం ప్రత్యేకంగా ఇంటింటి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.నవంబర్ 23, 24 తేదీల్లో వైద్య సిబ్బంది ఇళ్లకు వెళ్లి పోలియో చుక్కలు వేయించుకోని చిన్నారులను గుర్తిస్తారు. జీహెచ్‌ఎంసీ పరిధితో పాటు రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో నవంబర్ 25న కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగించనున్నారు.
ముఖ్యంగా వలస కుటుంబాలు, సంచార జాతులు, నిర్మాణ రంగ కార్మికులు, ఇటుక బట్టీల్లో పనిచేసే కుటుంబాలు, మురికివాడలు, గిరిజన, మత్స్యకార గ్రామాల్లోని చిన్నారులపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. ఎవరూ వ్యాక్సిన్‌కు దూరం కాకుండా క్షేత్రస్థాయిలో సిబ్బందిని అందుబాటులో ఉంచుతున్నారు.ప్రజల్లో అవగాహన పెంచేందుకు జీహెచ్‌ఎంసీ పరిధిలోని 1,165 నివాస సముదాయాలు, హైరైజ్ అపార్ట్‌మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల్లో ఉన్న 6,172 డిజిటల్ స్క్రీన్లపై మూడు రోజుల పాటు పల్స్ పోలియో ప్రచార సందేశాలను ప్రదర్శిస్తున్నారు.
