KCR ఫామ్‎హౌస్ భూముల లెక్కలన్నీ అసెంబ్లీలో బయటపెడ్తం: మంత్రి పొంగులేటి

KCR ఫామ్‎హౌస్ భూముల లెక్కలన్నీ అసెంబ్లీలో బయటపెడ్తం: మంత్రి పొంగులేటి

హైదరాబాద్: ఎర్రవల్లిల్లోని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్ భూముల సర్వేపై మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం (నవంబర్ 21) మీడియా ప్రతినిధులతో ఆయన చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై పొంగులేటి మాట్లాడారు. కేసీఆర్ ఫామ్ హౌస్ భూముల సర్వే ప్రక్రియ దాదాపు పూర్తయిందని తెలిపారు. కేసీఆర్ ఫామ్ హౌస్ భూముల లెక్కలన్నీ త్వరలో అసెంబ్లీ వేదికగా బయటపెడతామని కీలక వ్యాఖ్యలు చేశారు. భూముల సర్వే ప్రారంభం కాగానే కేసీఆర్ ఫ్యామిలీ మెంబర్స్ భూమి విషయంలో కోర్టుకెళ్లి ముందస్తు స్టే తెచ్చుకున్నారని తెలిపారు. రాష్ట్రంలో భూభారతి పోర్టల్ సాంకేతిక సమస్యలు దాదాపు పరిష్కారం అయ్యాయని తెలిపారు.

డయాఫ్రమ్ వాల్ అని సీకెంట్ పైల్స్ ఫైల్స్

కాళేశ్వరం ప్రాజెక్ట్‎కు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన డీపీఆర్‎లో డయాఫ్రమ్ వాల్ నిర్మిస్తామని చెప్పి, ఎలాంటి అనుమతులు లేకుండా మూడు బ్యారేజీల్లోనూ సీకెంట్ పైల్స్ వాడారని మంత్రి పొంగులేటి అన్నారు. సీకెంట్ పైల్స్ వాడటం వల్లే బ్యారేజీలు కుంగిపోయాయని పేర్కొన్నారు. డయాఫ్రమ్ వాల్ నిర్మిస్తేనే బ్యారేజీలు నిలబడతాయని చెప్పారు. డయాఫ్రమ్ వాల్ కాకుండా సీకెంట్ పైల్స్ ఎందుకు వాడారో కేసీఆర్ సమాధానం చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కేసీఆర్ రూ.వేల కోట్ల ప్రజాధనాన్ని వృథా చేశారని ఆరోపించారు.

యుద్ధం ఎప్పుడు చేయాలో అప్పుడే చేస్తాం..

తెలంగాణలో మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని మంత్రి పొంగులేటి ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ఆట ఎలా ఆడాలో, విపక్షాలను ఎలా కట్టడి చేయాలో తమకు బాగా తెలుసని ఆసక్తికర వ్యాఖ్యలు. ఖచ్చితంగా మళ్లీ గోల్ కొట్టి అధికారంలోకి వస్తామని జోస్యం చెప్పారు. ఎప్పుడు యుద్ధం చేయాలో అప్పుడే చేస్తామని, ఆ యుద్ధంలో గెలిచి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీజేపీ పని అయిపోయిందని, ప్రస్తుతం ఉన్న 8 మంది ఎమ్మెల్యేలను కాపాడు కుంటేనే గొప్ప అని ఆయన ఎద్దేవా చేశారు. ఇక, కాంగ్రెస్ పార్టీలో తాను ఎంతో కంఫర్ట్ ఉన్నానని పొంగులేటి స్పష్టం చేశారు.