టాలీవుడ్ లో కమెడియన్ గా కెరీర్ ప్రారంభించిన .. హీరోగా వరుస విజయాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు ప్రియదర్శి. ఎప్పటికప్పుడు విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈ టాలెంటెడ్ నటుడు ఇప్పుడు 'ఇడుపు కాయితం'తో థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఈసారి ఓ అందమైన ఫ్యామిలీ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో సినిమాపై ఆసక్తి పెరుగుతోంది. లేటెస్ట్ గా ఈ చిత్రానికి సంబంధించిన పెళ్లి పాటను రిలీజ్ చేశారు. దీంతో ప్రమోషన్స్‌లో మరింత జోష్ కనిపిస్తోంది.
ప్రియదర్శి, నాగదుర్గ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి యువ దర్శకుడు దొండపాటి వంశీరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. డిసెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమాను బన్నీ వాస్ వర్క్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బన్నీ వాస్, తబిత సుకుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక లేటెస్ట్ గా విడుదలైన 'గోగులు గోగులు.. గోపాల కృష్ణుడు..' పాట ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
శ్రీనివాస్, శ్రీలత పాత్రల పెళ్లి వేడుక నేపథ్యంలో ఈ గీతాన్ని రూపొందించారు. పల్లెటూరి పెళ్లిళ్లలో కనిపించే సంప్రదాయాలు, సందడి, నలుగుల వేడుకను గుర్తుచేసేలా పాట సాగుతోంది. ముఖ్యంగా జానపద శైలిలో సాగే పదాలు, ఉత్సాహభరితమైన సంగీతం ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. సురేష్ బొబ్బిలి ఈ పాటకు చక్కటి బాణీ అందించగా, కొంగరి కృష్ణ సాహిత్యం సమకూర్చారు. అభిక్య తనికెళ్ల, తరుణి, రచిత రాయప్రోలు, జయశ్రీ పల్లెం, స్నిగ్ధ శర్మ తమ గాత్రంతో పాటకు మరింత అందాన్ని తీసుకొచ్చారు.
జానపద పాటలతో గుర్తింపు తెచ్చుకున్న నాగదుర్గ ఈ సినిమాతో కథానాయికగా అలరించనున్నారు. ప్రియదర్శి కామెడీ టైమింగ్, నాగదుర్గ సహజమైన నటన, పల్లెటూరి నేపథ్యం సినిమాలో ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తాయని అభిమానులు ఆశిస్తున్నారు. పెళ్లి పాటతో 'ఇడుపు కాయితం' ప్రమోషన్లకు మంచి ఊపు వచ్చింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.
