హరిద్వార్‌లో కలకలం... ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారిపై డ్రైవర్ కాల్పులు...

హరిద్వార్‌లో కలకలం... ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారిపై డ్రైవర్ కాల్పులు...

హరిద్వార్ లో కాల్పుల కలకలం రేగింది.ఐబీ అధికారిపై కాల్పులు జరిపాడు డ్రైవర్. కంఖాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది ఈ ఘటన. శనివారం ( నవంబర్ 21 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి... హరిద్వార్ లో ఇంటెలిజెన్స్ బ్యూరోలో సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ గా పని చేస్తున్న సీపీ నౌటియాల్ పై ఆయన డ్రైవర్ కాల్పులు జరిపారు.

ఈ ఘటనలో నౌటియాల్ తీవ్రంగా గాయపడ్డారు. బుల్లెట్ ఆయన శరీరాన్ని తాకుతూ వెళ్లినప్పటికీ, గాయాల తీవ్రత దృష్ట్యా మొదట స్థానిక ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం ఆయనను రిషికేశ్‌లోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు.

నిందితుడిని వినోద్ నేగిగా గుర్తించిన పోలీసులు, అతడిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. వినోద్ నేగి తాత్కాలిక డ్రైవర్‌గా పనిచేస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. కాల్పులకు గల ఖచ్చితమైన కారణాలు తెలియాల్సి ఉంది. అయితే, పని ఒత్తిడి కారణంగానే డ్రైవర్ ఈ ఘాతకానికి పాల్పడి ఉండవచ్చని భావిస్తున్నట్లు తెలిపారు పోలీసులు.

నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని.. చట్టప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని, దర్యాప్తు పూర్తయిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు పోలీసులు.