ఒడిశా టు అచ్చంపేట.. గంజాయి సప్లై నెట్‌వర్క్ గుట్టురట్టు...

ఒడిశా టు అచ్చంపేట.. గంజాయి సప్లై నెట్‌వర్క్ గుట్టురట్టు...

అచ్చంపేటలో  భారీ గంజాయి సప్లై నెట్వర్క్ గుట్టురట్టు చేశారు పోలీసులు. యువతను టార్గెట్‌గా చేసుకుని గంజాయి విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను పట్టుకున్నారు పోలీసులు. శనివారం ( నవంబర్ 21 ) గంజాయి సరఫరా చేస్తున్న ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల దగ్గరి నుంచి 7.44 కిలోల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు పోలీసులు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.3.72 లక్షలు ఉంటుందని తెలిపారు అధికారులు.

నిందితుల నుంచి ఒక బైక్, మూడు సెల్‌ఫోన్లు, రూ.21 వేల నగదు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. గంజాయి ప్యాకింగ్‌కు ఉపయోగించే ఎలక్ట్రానిక్ వెయింగ్ మిషన్, ప్యాకింగ్ మిషన్ సీజ్ చేశామని.. ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా కలిమెల గ్రామం నుంచి అచ్చంపేటకు గంజాయి సరఫరా చేస్తున్నట్లు విచారణలో తేలిందని వెల్లడించారు పోలీసులు.

నిందితులు ఒడిశాకు చెందిన హరి అనే వ్యక్తి నుంచి గంజాయి కొనుగోలు చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ప్రధాన నిందితుడు మహమ్మద్ రసూల్ బాబా, మరో నిందితుడు పుట్టపాగ రాజేష్ లను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. రసూల్ బాబా గతంలో హైదరాబాద్‌లో జెప్టో డెలివరీ ఎగ్జిక్యూటివ్‌గా పని చేశాడని.. డెలివరీ ఉద్యోగ సమయంలో గంజాయి వినియోగదారులతో పరిచయాలు పెంచుకున్నట్లు విచారణలో వెల్లడైందని తెలిపారు పోలీసులు.

రసూల్ 2025 నవంబర్‌లో ఒడిశాకు వెళ్లి రూ.25 వేలకు 16 కిలోల గంజాయి కొనుగోలు చేశాడని.. ఛత్తీస్‌గఢ్‌లోని సీసీ కుంట పోలీస్ స్టేషన్ పరిధిలో గతంలో పోలీసులకు పట్టుబడ్డాడని తెలిపారు. దంతెవాడ జైలులో సుమారు ఐదు నెలల 20 రోజులు జ్యుడీషియల్ కస్టడీలో కూడా ఉన్నాడని తెలిపారు పోలీసులు.