అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. విమానాల్లో ఇరుముడి తీసుకెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్

అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. విమానాల్లో ఇరుముడి తీసుకెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్

న్యూఢిల్లీ: అయ్యప్ప స్వాములకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇరుముడిని విమానంలో తీసుకెళ్లేందుకు అయ్యప్ప భక్తులకే అనుమతి ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వెల్లడించారు. అయ్యప్ప భక్తులు ఇరుముడిని తమవెంట తీసుకెళ్లడం సంప్రదాయమని పేర్కొన్నారు. ఇరుముడిని విమానం క్యాబిన్‎లోకి తీసుకెళ్లేందుకు అనుమతి ఉంటుందని చెప్పారు. స్వాముల భక్తి, విశ్వాసం, నమ్మకం, సంప్రదాయాన్ని గౌరవిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. కాగా, విమానంలో ఇరుమడి తీసుకెళ్లేందుకు స్వాములకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడం వరుసగా ఇది మూడోసారి. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై విమానం ద్వారా శబరి వెళ్లే అయ్యప్ప మాలధారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.     

నాలుగు భాషల్లో సైన్ బోర్డులు

అయ్యప్ప భక్తులకు శుభవార్త చెప్పింది శబరిమల దేవస్థానం. మండల పూజ కోసం వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అధికారులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కొండపై యాత్రికుల రాకపోకలను క్రమబద్ధీకరించడానికి, వారికి అవసరమైన సమాచారాన్ని అందించడానికి మరిన్ని సైన్ బోర్డులను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు అధికారులు.

ముఖ్యంగా అప్పం, అరవణ ప్రసాద విక్రయ కేంద్రాల దగ్గర భక్తుల రద్దీని నియంత్రించడంపై అధికారులు దృష్టి సారించారు. ప్రస్తుతం ఈ ప్రాంతాన్ని వన్-వే జోన్‌గా ప్రకటించినప్పటికీ, భక్తులు రెండు వైపుల నుంచి రాకపోకలు సాగిస్తుండటంతో అక్కడ కొత్తగా సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రసాదం ఇచ్చే కౌంటర్లు, రసీదులు ఇచ్చే కౌంటర్ల మధ్య భేదాన్ని యాత్రికులు సులభంగా గుర్తించేలా ప్రత్యేక బోర్డులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు అధికారులు. 

పబ్లిక్ రిలేషన్స్ ఆఫీస్ సమీపంలోని అనౌన్స్‌మెంట్ సెంటర్‌ను గుర్తించేందుకు కొత్త బోర్డును ఏర్పాటు చేయాలని... అలాగే, వలియ నాడ పందల్ దగ్గర ఉన్న డిజిటల్ స్క్రీన్‌లపై భక్తులకు అవగాహన కల్పించేందుకు వివిధ భాషల్లో సందేశాలను ప్రదర్శించాలని నిర్ణయించారు అధికారులు.

దుకాణాలలో వస్తువుల ధరల నియంత్రణకు సంబంధించి అధికారులు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. దుకాణదారులు వస్తువుల ధరల పట్టికను నాలుగు భాషల్లో భక్తులకు స్పష్టంగా కనిపించేలా ప్రదర్శించాలని ఆదేశించారు. గతంలో నిర్వహించిన తనిఖీల సమయంలో చాలామంది బోర్డులను లోపల ఉంచినట్లు గుర్తించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే, టెండర్లు దక్కించుకున్న దుకాణదారులు తమ పరిమితికి మించి రోడ్డుపైకి ఆక్రమణలు చేయకుండా ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు చర్యలు తీసుకోనుంది. దీనిపై బోర్డు లీజు అధికారి నిరంతరం తనిఖీలు నిర్వహిస్తారని వెల్లడించారు.

ఎయిర్ పోర్టు నుంచి పంబకు ప్రత్యేక బస్సులు

శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు కేరళ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అయ్యప్ప భక్తుల ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు తిరువనంతపురం, కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయాల నుంచి నేరుగా పంబకు ఏసీ బస్సు సర్వీసులను ప్రారంభించింది. కేరళ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి సి.పి. జాన్ ఈ ప్రత్యేక సర్వీసులను ప్రకటించారు. విమానాల్లో వచ్చే అయ్యప్ప భక్తులతో పాటు సాధారణ ప్రయాణికులు కూడా ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చని తెలిపారు.