తమిళనాడులోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుచెందూర్ సుబ్రమణ్య స్వామి ఆలయం వివాహ వేడుకలతో సందడిగా మారింది. నవంబర్ 20న శుభ ముహూర్తం కావడంతో ఒకే రోజు ఈ ఆలయ ప్రాంగణంలో 100కు పైగా జంటలు వివాహ బంధంలోకి అడుగుపెట్టాయి. ఆలయ ప్రాంగణం కళ్యాణ మండపంలా మారిపోయింది.
శుభ ముహూర్తం రోజు ( నవంబర్ 20) కావడంతో ఒక్కరోజే 100కి పైగా జంటలు ఒక్కేసారి ఒక్కే వేదికపై పెళ్లి పీటలు ఎక్కారు.గురువారం (నవంబర్ 19) తెల్లవారుజాము నుంచే నూతన వధూవరులు, వారి తల్లిదండ్రులు, బంధుమిత్రులతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి.ఆలయ ప్రాంగణంతో పాటు షణ్ముగ విలాస్ మండపంలో కూడా పెళ్లిళ్లు జరిగాయి. మేళతాళాలతో, మంత్రోచ్చారణలతో ఆలయం మొత్తం పెళ్లి సందడితో నిండిపోయింది. ఒకేసారి వందకు పైగా పెళ్లిళ్లు జరగడంతో ఫోటోలు, వీడియోలు తీసుకునే వారితో ఆలయ పరిసరాల్లో సందడి నెలకొంది.
పెళ్లిళ్లతో పాటు దర్శనానికి వచ్చిన భక్తులతో కూడా ఆలయం పోటెత్తింది. గురువారం రాత్రి నుంచే భక్తులు ఆలయానికి చేరుకున్నారు.తెల్లవారుజామున చలిని కూడా లెక్కచేయకుండా భక్తులు సముద్రంలో, పవిత్ర నాళి కిణరు తీర్థంలో పుణ్యస్నానాలు చేసి స్వామి దర్శనానికి బారులు తీరారు.ఉచిత సాధారణ దర్శనం క్యూలో, రూ.100 ప్రత్యేక దర్శనం క్యూలో భక్తులు సుమారు 3 గంటల పాటు వేచి ఉండి స్వామిని దర్శించుకున్నారు.
తమిళనాడులోని తిరుచెందూర్ సుబ్రమణ్య స్వామిని దర్శించుకుంటే వివాహ విషయంలో ఆటంకాలు వస్తుంటే తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. పెళ్లి దోష నివారణకు అత్యంత ప్రసిద్ధమైన క్షేత్రంగా విరాజిల్లుతోంది. పెళ్లి ఆలస్యం అవుతున్న వారు ఇక్కడ స్వామిని దర్శించుకుంటే త్వరగా పెళ్లి కుదురుతుందని నమ్ముతుంటారు
శుభ ముహూర్తం రోజుల్లో ఇక్కడ వందల సంఖ్యలో పెళ్లిళ్లు జరగడం ఆనవాయితీగా వస్తోంది. తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలో బంగాళాఖాతం ఒడ్డున మురుగన్ ఆరు పడై వీడులలో సముద్ర తీరంలో ఉన్న ఏకైక ఆలయంగా ప్రసిద్ది చెందింది.
