ఉప్పల్ హెరిటేజ్ ఫుడ్స్ కంపెనీలో మహిళ మృతి...ఆందోళనకు దిగిన కార్మికులు

ఉప్పల్ హెరిటేజ్ ఫుడ్స్ కంపెనీలో  మహిళ మృతి...ఆందోళనకు దిగిన కార్మికులు

ఉప్పల్: ఐడీఏ ఉప్పల్‌లోని హెరిటేజ్ ఫుడ్స్ కంపెనీలో శనివారం సాయంత్రం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వ్యర్థాలను పారవేసే క్రమంలో డ్రమ్ పేలడంతో పింకీ దేవి (35) అనే మహిళా కార్మికురాలు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనతో కంపెనీ పరిసరాల్లో విషాదం నెలకొంది.

రామంతాపూర్‌లోని గాంధీనగర్‌కు చెందిన పింకీ దేవి శనివారం సాయంత్రం సుమారు 4 గంటల సమయంలో కంపెనీలో వ్యర్థాలను పారవేసేందుకు వెళ్లారు. ఈ క్రమంలో ఒక్కసారిగా డ్రమ్ పేలడంతో ఆమె తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతురాలికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఘటన అనంతరం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు.

కంపెనీలోని డ్రమ్ గత ఐదు రోజులుగా సరిగా పనిచేయడం లేదని తెలిసినా యాజమాన్యం పట్టించుకోలేదని కార్మికులు, బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కంపెనీ ఎదుట కార్మికులు, స్థానికుల ధర్నా

ప్రమాదానికి నిరసనగా సుమారు 300 మంది కార్మికులు, స్థానికులు కంపెనీ ఎదుట ధర్నా చేపట్టారు. మృతురాలి కుటుంబానికి తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని, ముగ్గురు పిల్లల భవిష్యత్తుకు భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు.కాగా, డ్రమ్ పేలడానికి గల అసలు కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఘటనపై సంబంధిత అధికారులు విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.