ఐబొమ్మ పైరసీ సైట్ రేపిన దుమారం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చాలా ఏళ్ళ పాటు సినీ ఇండస్ట్రీకి చుక్కలు చూపించింది ఐబొమ్మ. అయితే.. పోలీసులు ఐబొమ్మ సూత్రధారి రవిని అరెస్ట్ చేయడంతో ఈ ఎపిసోడ్ ముగిసింది. ఇప్పుడు మరో పైరసీ సైట్ నెట్వర్క్ గుట్టురట్టు చేశారు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు. కొత్తగా విడుదలైన సినిమాలను థియేటర్లలోనే రికార్డ్ చేసి ఆన్ లైన్ లో పంపిణీ చేస్తున్న పైరసీ ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. థియేటర్లలో రికార్డ్ చేసిన ఒక్కో సినిమాకు రూ.20 వేలు క్రిప్టో కరెన్సీ రూపంలో చెల్లించేలా డీల్ కుదుర్చుకున్నారని తెలిపారు పోలీసులు.
పైరసీ వెబ్సైట్లు, టెలిగ్రామ్ ఛానళ్ల ద్వారా సినిమాలను అక్రమంగా పంపిణీ చేస్తున్నట్లు గుర్తించామని తెలిపారు పోలీసులు. కర్నూలుకు చెందిన ఇద్దరు 19 ఏళ్ల విద్యార్థులు షేక్ రిజ్వాన్, రాంపోగు అజయ్‌లను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నిందితులు కర్నూలులోని సిటీ స్క్వేర్ మాల్ SVC సినిమాస్‌లో కొత్త సినిమాలను మొబైల్ ఫోన్లతో రికార్డు చేశారని...రికార్డు చేసిన సినిమాలను Gofile.comలో అప్లోడ్ చేశారని తెలిపారు.
టెలిగ్రామ్ ద్వారా ప్రధాన నిందితుడితో సంప్రదింపులు జరిపారని.. go2.india4movies.click వెబ్సైట్లో సినిమాల అప్లోడ్ చేశారని వెల్లడించారు పోలీసులు.సినిమాలు రికార్డ్ చేసినందుకు గాను వచ్చిన క్రిప్టో చెల్లింపులను భారతీయ కరెన్సీలోకి మార్చుకున్నారని.. తెలిపారు. నిందితుల నుంచి సినిమాలను రికార్డు చేసేందుకు ఉపయోగించిన మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని.. పైరసీ వెబ్సైట్ల ద్వారా ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్ యాప్‌ల ప్రకటనల ద్వారా అక్రమ ఆదాయం సమకూర్చుకున్నారని తెలిపారు పోలీసులు.
రామాయణ, సీన్, మహాశక్తి, ENE, ఆకాశంలో ఒక తార, OM, కల్ట్, ఆదర్శ కుటుంబం సహా పలు కొత్త సినిమాల పైరసీ చేసినట్లు తెలిపారు పోలీసులు. ప్రధాన నిందితుడితో పాటు నెట్‌వర్క్‌లోని ఇతర వ్యక్తుల గుర్తింపుపై దర్యాప్తు కొనసాగిస్తున్నామని తెలిపారు.
