బియ్యం అక్రమాలపై ఈడీ ఎంట్రీ.. మిల్లర్ల గుండెల్లో గుబులు!

బియ్యం అక్రమాలపై ఈడీ ఎంట్రీ.. మిల్లర్ల గుండెల్లో గుబులు!
  • బియ్యం దొంగలకు బిగుస్తున్న ఉచ్చు..సివిల్ సప్లయ్స్, విజిలెన్స్‌‌‌‌‌‌‌‌కు తోడు ఈడీ దాడులు
  • సుప్రీం తీర్పుతో డిఫాల్టర్​ మిల్లర్లకు మూసుకుపోయిన దారులు
  • సివిల్ సప్లయ్స్, విజిలెన్స్‌‌‌‌‌‌‌‌కు తోడు ఈడీ దాడులు
  • రూ.16 వేల కోట్ల అక్రమాలు.. ఇంకా రూ.6,700 కోట్ల బకాయి
  • ధాన్యం సొమ్ముతో రియల్ ఎస్టేట్, సినిమాల్లో పెట్టుబడులు
  • ఆర్ఆర్ యాక్ట్ కింద ఆస్తుల జప్తుకు సర్కారు రెడీ
  • పెనాల్టీతో కడతారా.. ఆస్తులు వదులుకుంటారా?

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వం ధాన్యాన్ని మిల్లింగ్ కోసం ఇస్తే బియ్యాన్ని తిరిగి అప్పగించకుండా పక్కదారి పట్టించిన డిఫాల్ట్​ మిల్లర్ల చుట్టూ ఉచ్చు బిగుస్తున్నది. గడువు పొడిగించాలంటూ, కేసుల నుంచి తప్పించాలంటూ ఇన్నాళ్లూ కోర్టుల చుట్టూ తిరిగిన మిల్లర్లకు తాజాగా సుప్రీం కోర్టు షాక్​ఇచ్చింది. ఇప్పటికే ఒకవైపు సివిల్ సప్లయ్స్ శాఖ, విజిలెన్స్, సీఐడీ అధికారులు రైస్​మిల్లులపై తనిఖీలు, కేసులతో హోరెత్తిస్తుండగా, తాజాగా ఈడీ రంగంలోకి దిగింది. ప్రభుత్వానికి బియ్యం ఇవ్వకుండా బయట మార్కెట్​లో, ముఖ్యంగా వివిధ రాష్ట్రాలు, దేశాలకు తరలించి కోట్లు గడించిన మిల్లర్లు ఆ మొత్తాన్ని రియల్​ఎస్టేట్, ఇతర వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టినట్లు సివిల్​సప్లయ్స్​శాఖ, సీఐడీ ఇప్పటికే గుర్తించాయి.  

ఆయా ఆధారాలతో క్రిమినల్​ కేసులు  పెట్టి, అరెస్ట్​లు కొనసాగిస్తున్నాయి.  ఈ క్రమంలో ఇటీవల మొదలైన ఈడీ దాడులు మిల్లర్లను భయాందోళనకు గురిచేస్తున్నాయి. మాయమైన ధాన్యం, నిల్వల మధ్య వ్యత్యాసం, ఈక్రమంలో జరిగిన ఆర్థిక లావాదేవీలు, నిధుల దారి మళ్లింపుపై క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తుండడంతో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది. అటు సుప్రీం కోర్టు తలుపులు మూసుకుపోవడంతో బకాయిలు చెల్లించడమా? ఆస్తులను అప్పగించడమా? జైలుకు వెళ్లడమా? ఏదో ఒకటి తేల్చుకోవాల్సిన పరిస్థితుల్లో మిల్లర్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.  

ఇంకా రూ.6,700 కోట్ల బకాయి

2014 నుంచి పలు సీజన్లలో ప్రభుత్వం కేటాయించిన ధాన్యాన్ని పక్కదారి పట్టించి మిల్లర్లు దాదాపు రూ.16 వేల కోట్ల అక్రమాలకు పాల్పడ్డారు. ఆర్ఆర్ యాక్ట్, ఇతర చర్యల ద్వారా ప్రభుత్వం దాదాపు రూ.9 వేల కోట్లు రాబట్టగా, ఇంకా రూ.6,700 కోట్ల బకాయిలు ఉన్నాయి. ఇందులో కేవలం 10 శాతం మిల్లుల్లోనే దాదాపు రూ.4 వేల కోట్లు పేరుకుపోయినట్లు సివిల్ సప్లయ్స్ శాఖ గుర్తించింది. 

సూర్యాపేట జిల్లాలో దాదాపు రూ.810 కోట్లు, నిర్మల్‌లో రూ.670 కోట్లు, నిజామాబాద్‌లో రూ.600 కోట్లు, మెదక్‌లో రూ.300 కోట్ల బకాయిలు ఉన్నట్లు అధికారులు తేల్చారు. 26 జిల్లాల్లోని దాదాపు 300 మిల్లుల్లో తనిఖీలు చేసి, ఇప్పటివరకు 78 మంది మిల్లర్లపై 540 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు. ఒక్కో మిల్లర్‌పై వేర్వేరు సీజన్లు, అభియోగాలతో పలు పోలీస్‌స్టేషన్లలో కేసులు ఉన్నాయి. వీరిలో 32 మందిని అరెస్ట్ చేశారు. తాజాగా కడెంలో రూ.14 కోట్ల విలువైన బియ్యం మాయం చేశాడనే ఆరోపణలపై ఓ మిల్లు యజమాని అరెస్టయ్యాడు.

రేకుల షెడ్లకూ వడ్లు

సీఎంఆర్ నిబంధనల ప్రకారం ప్రభుత్వం ఇచ్చిన ధాన్యాన్ని మూడు నెలల్లో మరాడించి, ప్రతి క్వింటాల్‌కు 67 కిలోల చొప్పున బియ్యం తిరిగి ఇవ్వాలి. 2014కు ముందు ఇది సాఫీగానే సాగినా, తర్వాత సీన్ మారింది. ధాన్యం ఉత్పత్తి పెరగడం, సీఎంఆర్ కేటాయింపులు లాభసాటిగా మారడంతో నాటి అధికార పార్టీ నేతల అండదండలతో మిల్లర్లు దందాకు తెరతీశారనే ఆరోపణలు ఉన్నాయి. కాంగ్రెస్ సర్కారు వచ్చాక విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ దాడుల్లో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. కొన్నిచోట్ల మిల్లులే లేకున్నా రేకుల షెడ్లకు కోట్ల విలువైన వడ్లు కేటాయించారు. ఇంకొన్నిచోట్ల మిల్లుల ఓనర్లకు కాకుండా మిల్లులు లీజుకు తీసుకున్న దళారులకు వడ్లు ఇచ్చారు. వడ్లు అమ్ముకున్న దళారులు లీజులు క్యాన్సల్ చేసుకుని పత్తా లేకుండా పోయారు. దీంతో వారిపై ఆర్ఆర్ యాక్ట్ ప్రయోగించే వీలు కూడా లేకుండా పోయింది.

ధాన్యం సొమ్ముతో వెంచర్లు, సినిమాలు

ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బియ్యాన్ని బయటి మార్కెట్‌లో, విదేశాల్లో అమ్ముకుని పలువురు మిల్లర్లు వందల కోట్లకు పడగెత్తారు. ఆ సొమ్మును రియల్ ఎస్టేట్‌లో పెట్టి భారీ లాభాలు ఆర్జించారు. కుటుంబ సభ్యులు, బినామీల పేర్లతో ఆస్తులు కొన్నారు. గత ఫిబ్రవరిలో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ దాడుల్లో ఈ దందాలు బయటపడ్డాయి. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలోని ఓ మిల్లులో దాదాపు రూ.63 కోట్ల విలువైన సీఎంఆర్ ధాన్యం మాయమైనట్లు విజిలెన్స్ అధికారులు తేల్చారు. ఆ ధాన్యాన్ని బ్లాక్ మార్కెట్‌లో అమ్ముకుని, ఆ సొమ్ముతో ఏపీ రాజధాని ప్రాంతం తుళ్లూరు దగ్గర 20 ఎకరాల్లో వెంచర్ వేసినట్లు గుర్తించారు. సూర్యాపేట జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఇమ్మిడి సోమనర్సయ్య 2022–23, 2023–24 సీజన్లలో తన మిల్లులకు కేటాయించిన దాదాపు రూ.500 కోట్ల విలువైన బియ్యాన్ని విదేశాలకు తరలించి, ఆ సొమ్ముతో పలుచోట్ల రియల్ ఎస్టేట్ పెట్టుబడులు పెట్టారని, రూ.10 కోట్లతో ఓ సినిమా కూడా తీశారని ఆరోపణలు ఉన్నాయి. ఆయనకు చెందిన రఘురామ, సంతోషిమాత మిల్లుల్లో 85,800 మెట్రిక్ టన్నుల ధాన్యం మాయమైనట్లు అధికారులు గుర్తించారు. వడ్డీతో కలిపి ఈ బకాయి రూ.200 కోట్లు దాటింది. ఆర్ఆర్ యాక్ట్ కింద ఆస్తుల జప్తుకు అధికారులు ప్రయత్నించగా, గతేడాది ఆగస్టులో హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు.

సుప్రీంలో చుక్కెదురు.. ఈడీ దాడులతో కలవరం

బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం 90 రోజుల గడువుతో పాటు పలు వెసులుబాట్లు ఇచ్చినా చాలామంది మిల్లర్లు స్పందించలేదు. పైగా తమపై కేసులు కొట్టేయాలని, అరెస్టుల నుంచి రక్షణ కల్పించాలని దాదాపు 300 మంది హైకోర్టును ఆశ్రయించారు. కేసుల నుంచి ఉపశమనం కోరుతూ దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ల (ఎస్ఎల్‌పీ)ను సుప్రీంకోర్టు కొట్టేయడంతో వారికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దీంతో కేసుల దర్యాప్తు, చట్టపరమైన చర్యలకు అడ్డంకులు తొలగిపోయాయి. బాకీ పడ్డ సీఎంఆర్ వెంటనే అప్పగించాలని, లేదంటే ఒప్పంద నిబంధనల ప్రకారం బకాయి విలువలో 125 శాతం (25 శాతం పెనాల్టీతో కలిపి) చెల్లించాలని, దానిపై 12 శాతం వార్షిక వడ్డీ కూడా కట్టాలని సివిల్ సప్లయ్స్ శాఖ స్పష్టం చేసింది. బకాయికి సమానంగా ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్ (ఎఫ్ఆర్కే) కలిపిన సన్నబియ్యం అప్పగించే నిబంధనలూ తెచ్చింది. ఎన్నో గడువులు, వెసులుబాట్లు ఇచ్చామని, ఇక ఉపేక్షించేది లేదని అధికారులు తేల్చిచెబుతున్నారు.

అధికారులపైనా విచారణ

ఈ వ్యవహారంలో పర్యవేక్షణ బాధ్యతలు చూసిన అధికారుల పాత్రపైనా విచారణ జరుగుతోంది. ఇప్పటికే పలువురు అధికారులపై చర్యలు తీసుకోగా, కొందరిని విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ నుంచి సొంత శాఖలకు పంపారు. ధాన్యం కేటాయించాక మిల్లింగ్ జరిగిందా, నిల్వలు ఉన్నాయా, బియ్యం అప్పగింతలో జాప్యానికి కారణాలేంటి, తనిఖీల్లో లోపాలు ఎలా జరిగాయనేది పరిశీలిస్తున్నారు. ఫిజికల్ వెరిఫికేషన్ కోసం ప్రత్యేక యాప్‌లు తెచ్చారు. మిల్లర్ల అక్రమాలకు పరోక్షంగా సహకరించారనే ఆరోపణలున్న అధికారులపై చర్యలకు ఉన్నతాధికారులు సిద్ధమవుతున్నారు.

బియ్యమా? పైసలా? ఆస్తులా?

రైతుల నుంచి సర్కారు కొన్న ధాన్యాన్ని మిల్లింగ్‌కు ఇస్తే పక్కదారి పట్టించి, గడువులు, కోర్టు కేసులతో ఏండ్లుగా కాలయాపన చేసిన డిఫాల్ట్ మిల్లర్లకు ఇప్పుడు అన్ని దారులూ మూసుకుపోయాయి. ఒకవైపు క్రిమినల్ కేసులు, మరోవైపు ఈడీ, విజిలెన్స్ తనిఖీలు, ఇంకోవైపు ఆర్ఆర్ యాక్ట్ కింద జప్తు హెచ్చరికలతో ఒత్తిడి పెరుగుతోంది. ఇక మిల్లర్ల ముందు మిగిలింది మూడే దారులు. బాకీ బియ్యం అప్పగించాలి, లేదంటే పెనాల్టీ, వడ్డీతో సహా సొమ్ము కట్టాలి. రెండూ కాదంటే ఆస్తుల జప్తు, వేలానికి సిద్ధం కావాల్సిందే.

బకాయిల వసూలుకు సిద్ధం

బకాయిల వసూలుకు రెవెన్యూ రికవరీ (ఆర్ఆర్) యాక్ట్ ప్రయోగించేందుకు సివిల్ సప్లయ్స్ శాఖ కార్యాచరణ సిద్ధం చేస్తోంది. బకాయిలను ప్రభుత్వ బాకీలుగా పరిగణించి, అవసరమైతే మిల్లుల యంత్రాలు, వాహనాలు, బ్యాంకు ఖాతాలు, ఇతర స్థిర, చరాస్తులను జప్తు చేయనున్నారు. డిఫాల్టర్ల ఆస్తులను గుర్తించాలని కలెక్టర్ల నుంచి తహసీల్దార్ల వరకు ఆదేశాలు వెళ్లాయి. మిల్లర్లతో పాటు ఒప్పందాల్లో హామీదారులుగా సంతకాలు పెట్టినవారిపైనా అధికారులు దృష్టి పెట్టారు. పాత బకాయిలు పూర్తిగా కట్టి నో డ్యూస్ సర్టిఫికెట్ పొందిన మిల్లులకే కొత్తగా ధాన్యం కేటాయిస్తామనే నిబంధనతో డిఫాల్టర్లకు ధాన్యం దక్కడమే కష్టంగా మారింది.