మొయినాబాద్ లో విషాదం చోటు చేసుకుంది. విహారయాత్రకు వచ్చిన బాలుడు ప్రమాదవశాత్తు ఉయ్యాల తగలడంతో మృతి చెందాడు. శనివారం ( నవంబర్ 21 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. నార్సింగిలోని హ్యాపీ స్కాలర్స్ పాఠశాలకు చెందిన విద్యార్థులు విద్యా విహారయాత్రలో భాగంగా, మొయినాబాద్‌లోని గురుకుల్ పాఠశాల పక్కన ఉన్న లోటస్ పాండ్ పార్కును సందర్శించారు.
ఈ సందర్భంగా విద్యార్థులు పార్కులోని ఉయ్యాలపై ఆడుకుంటుండగా, ఉయ్యాలను అధిక వేగంతో ఊపడంతో అది ప్రమాదవశాత్తు వెనుక వైపునకు వచ్చి ఇద్దరు విద్యార్థులను బలంగా ఢీకొట్టింది. దీంతో ఇద్దరు విద్యార్థులకు గాయాలయ్యాయి.మృతిచెందిన విద్యార్థి తమ్ము అభిరామ్ గా గుర్తించారు. పదేళ్ల అభిరామ్ 4వ తరగతి చదువుతున్నట్లు సమాచారం. అభిరామ్ తండ్రి శంకర్ రావు స్వస్థలం కృష్ణా జిల్లాలోని రొయ్యూరు గ్రామం కాగా మణికొండలో నివాసం ఉంటున్నట్లు తెలుస్తోంది.
గాయపడిన ఇద్దరు విద్యార్థులను వెంటనే చికిత్స నిమిత్తం భాస్కర ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి అభిరామ్ అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. మరో విద్యార్థి యశ్వంత్‌కు గాయాలు కావడంతో వైద్య చికిత్స అందించారు.
