- పొలిటికల్ ఆట పర్ఫెక్ట్ గా ఆడుతున్నాం
- రాష్ట్రంలో బీజేపీకి ఉన్న 8 సీట్లు కాపాడుకోవడమే గగనం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రాజకీయ ఆటను కాంగ్రెస్ ప్రభుత్వం పర్ఫెక్ట్గా ఆడుతోందని, వచ్చే ఎన్నికల్లోనూ విపక్షాలను మట్టికరిపించి మళ్లీ అధికారంలోకి వచ్చి గోల్ కొట్టడం ఖాయమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. సచివాలయంలో శనివారం మీడియాతో చిట్ చాట్ చేశారు. ‘వచ్చే ఎన్నికల్లో ఏం చేయాలో, ప్రత్యర్థులను ఎలా వంగదీయాలో మా ఐదుగురికి పక్కా క్లారిటీ ఉంది.. నేను కాంగ్రెస్ లో అత్యంత కంఫర్ట్ గా ఉన్నాను ’ అని చెప్పారు.
దివంగత సీఎం వైఎస్ హయాంలో పార్టీ కోసం పనిచేసే బలమైన బృందం ఎలా ఉండేదో, ఇప్పుడు సీఎం రేవంత్ నేతృత్వంలో అలాంటి పటిష్ట టీమ్ ఉందని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ను దెబ్బకొట్టేందుకు బీఆర్ఎస్, బీజేపీలు ఎన్ని లోపాయికారీ ఎత్తుగడలు వేసినా ప్రజల అండతో తిప్పికొడతామని హెచ్చరించారు. రాష్ట్రంలో బీజేపీకి పెద్దగా మైలేజ్ లేదని, ఆ పార్టీకి ఉన్న 8 స్థానాలను నిలబెట్టుకోవడమే పెద్ద సవాలుగా మారిందని ఎద్దేవా చేశారు. ఎప్పుడు ఎలాంటి రాజకీయ యుద్ధం చేయాలో తమకు బాగా తెలుసని, సమయం వచ్చినప్పుడు ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామని తేల్చిచెప్పారు.
‘కాళేశ్వరం’ వైఫల్యంతోవేల కోట్లు గోదారి పాలు
గత కేసీఆర్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన తీరే నేడు కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యానికి, మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడానికి ప్రధాన కారణమని పొంగులేటి మండిపడ్డారు. ప్రాజెక్టు డీపీఆర్‌లో డయాఫ్రమ్ వాల్ నిర్మిస్తామని కేంద్రానికి నివేదిక ఇచ్చి, క్షేత్రస్థాయిలో ఎలాంటి శాస్త్రీయ అధ్యయనాలు, భూగర్భ పరిశోధనలు లేకుండా ఏకపక్షంగా సీకెంట్ పైల్స్ విధానాన్ని ఎందుకు మార్చారో కేసీఆర్ సమాధానం చెప్పాలని నిలదీశారు. దేశ చరిత్రలో ఇప్పటివరకు ఏ ఒక్క బ్యారేజీని కూడా సీకెంట్ పైల్స్ పద్ధతిలో నిర్మించలేదని, నిపుణుల సలహాలు లేకుండా డిజైన్లు మార్చి వేల కోట్ల ప్రజాధనాన్ని గోదారిలో ముంచారని ఆరోపించారు.
నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) సైతం బ్యారేజీ పునాది కింద ఇసుక తరలిపోవడం, బేరింగ్ సామర్థ్యం లేకపోవడం, అప్‌స్ట్రీమ్ సీకెంట్ పైల్స్‌పై బ్యారేజీ లోడ్ పడడం వల్లే పిల్లర్లు కుంగినట్లు తేల్చిచెప్పిందన్నారు. మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను ఇదే అసంబద్ధ డిజైన్లతో నిర్మించారని, అక్కడ డయాఫ్రమ్ వాల్ కడితేనే భద్రత ఉంటుందని స్పష్టం చేశారు.
హరీశ్ మామ స్టే ఎందుకు తెచ్చుకున్నరు?
సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి, శివారు వెంకటాపూర్ గ్రామాల్లోని కేసీఆర్ ఫామ్‌హౌస్ భూముల సర్వే ఇప్పటికే తుది దశకు చేరుకుందని మంత్రి పొంగులేటి వెల్లడించారు. ఈ అక్రమ భూముల సమగ్ర లెక్కలను రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఆధారాలతో సహా బయటపెడతామన్నారు. ఫామ్‌హౌస్ భూముల సర్వే మొదలుకాగానే మాజీ మంత్రి హరీశ్‌రావు మామ హనుమంతరావు కోర్టుకెళ్లి ఆయన ఆక్రమించుకున్న అసైన్డ్ భూములకు ముందస్తు స్టే ఎందుకు తెచ్చుకున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ఎల్-నినో ప్రభావం వల్ల రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులను అధిగమించేందుకు కేంద్ర సహకారం ఆశిస్తున్నామని చెప్పారు.
