హైదరాబాద్, వెలుగు: తెలంగాణ అస్తిత్వం, నీటి హక్కులకు భంగం కలిగించే ఏ చర్యనైనా ఐక్యంగా ఎదుర్కొంటామని తెలంగాణ అధ్యయన సమాలోచన కేంద్రం (టాస్క్) రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రోజు శ్రీనివాస్ స్పష్టం చేశారు. శనివారం హైదరాబాద్లో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం విశిష్ట పురస్కారానికి సినీ నటుడు, ఏపీ ఎమ్మెల్యే బాలకృష్ణను ఎంపిక చేశారన్న వార్త ఒకవైపు, నాగార్జునసాగర్ కుడి కాలువకు సొరంగం తవ్వి ఏపీ ప్రభుత్వం కృష్ణా జలాలను తరలించుకుపోతోందన్న అంశం మరోవైపు తెలంగాణ ప్రయోజనాలపై దాడిగా ఆయన అభివర్ణించారు.
గోలకొండ కవుల సంచిక ద్వారా తెలంగాణ కవుల ప్రతిభను చాటిన వైతాళికుడు సురవరం పేరుతో ఇచ్చే పురస్కారాన్ని, ఇక్కడ సాహితీవేత్తలు లేనట్లుగా సినీనటుడికి ఇవ్వాలనుకోవడం సరికాదన్నారు. తెలంగాణ సాధన కోసం కృషి చేసిన వారికి ఈ పురస్కారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. గతంలో పోతిరెడ్డిపాడు మాదిరిగానే తాగునీటి నెపంతో సాగర్ వద్ద అక్రమంగా నీటిని తరలించేందుకు ఏపీ ప్రయత్నిస్తున్నట్లు తెలంగాణ ఇంజినీర్లు నిజనిర్ధారణ చేశారని ఆరోపిస్తూ, ప్రభుత్వం బాధ్యతగా స్పందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో టాస్క్ కో-కన్వీనర్లు రవీందర్, సురేశ్ కుమార్, సలహాదారులు సీతారాంరావు, వెంకటేశ్వర్లు, సభ్యులు రవీందర్ రెడ్డి, లక్ష్మణ్, రూబీ స్టీవెన్సన్, ఆసరి రాజు, బొడిగె శ్రీనివాస్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
