ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ వర్సిటీలో 566 పోస్టుల భర్తీకి గ్రీన్‌‌‌‌సిగ్నల్‌‌‌‌

ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ వర్సిటీలో 566 పోస్టుల భర్తీకి గ్రీన్‌‌‌‌సిగ్నల్‌‌‌‌
  •     ప్రభుత్వ నిర్ణయంతో తొమ్మిదేళ్ల నిరీక్షణకు తెర
  •     తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక హర్షం

హైదరాబాద్, వెలుగు: ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో 566 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దాదాపు తొమ్మిదేళ్లుగా కొత్త నియామకాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఈ నిర్ణయంతో ఊరట లభించింది. యూనివర్సిటీలో 2018లో చివరిసారిగా అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలు చేపట్టారు. అప్పటి నుంచి కొత్త నోటిఫికేషన్లు రాకపోవడంతో వ్యవసాయ విద్యలో పీహెచ్‌‌‌‌డీ పూర్తి చేసిన వందలాది మంది అభ్యర్థులు వేచి చూస్తున్నారు. ఖాళీలు ఉండటం వల్ల బోధన, పరిశోధన కార్యకలాపాలపై ప్రభావం పడుతోందన్న ఆందోళనల నేపథ్యంలో ఆర్థిక శాఖ తాజాగా 566 పోస్టులకు అనుమతి ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒకేసారి ఇన్ని పోస్టుల భర్తీకి ఆమోదం లభించడం ఇదే తొలిసారి అని అధికారులు పేర్కొన్నారు. 

ప్రభుత్వ నిర్ణయాన్ని తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక స్వాగతించింది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవతో ఈ ప్రక్రియ ముందుకు సాగిందని ఐక్యవేదిక అధ్యక్షుడు డాక్టర్ ఆర్. శ్రీనివాస్ తెలిపారు. వీసీ ఆల్దాస్ జానయ్య బాధ్యతలు చేపట్టిన తర్వాత పోస్టుల భర్తీకి లైన్ క్లియర్ అయిందని, ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆయన కోరారు. త్వరగా నోటిఫికేషన్ విడుదల చేస్తే నిరుద్యోగులకు మేలు జరుగుతుందని విద్యార్థి, ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి.