లా స్టూడెంట్లు ఏఐని అతిగా వాడొద్దు..అతిగా ఆధారపడితే ఆలోచనా శక్తికి ముప్పు

లా స్టూడెంట్లు ఏఐని అతిగా వాడొద్దు..అతిగా ఆధారపడితే ఆలోచనా శక్తికి ముప్పు
  •     ఏఐ వినియోగంపై స్పష్టమైన నియంత్రణలు అవసరం
  •     న్యాయ విద్యార్థులకు ఏఐ వినియోగంపై మార్గదర్శకాలు తప్పనిసరి
  •     కామన్వెల్త్ న్యాయ విద్య సదస్సులో సీజేఐ జస్టిస్‌‌ సూర్యకాంత్‌‌ 

హైదరాబాద్‌‌, వెలుగు: న్యాయవిద్యలో అర్టిఫిషియల్‌‌ ఇంటెలిజెన్స్‌‌ (ఏఐ) వినియోగాన్ని పూర్తిగా నిషేధించడం సాధ్యం కాదని, అయితే దాని వాడకంపై స్పష్టమైన నియంత్రణలు, మార్గదర్శకాలు అవసరమని ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌‌ సూర్యకాంత్‌‌ పేర్కొన్నారు. ఏఐపై అతిగా ఆధారపడితే విద్యార్థుల్లో స్వతంత్రంగా ఆలోచించే, విశ్లేషించే సామర్థ్యాలు క్షీణించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. 

తీర్పుల సారాంశాలు రూపొందించడం, న్యాయవాదనలు సిద్ధం చేయడం, పరిశోధనకు అవసరమైన సమాచారం సేకరించడం వంటి పనులను ఏఐ వేగంగా పూర్తి చేయగలిగినా, విద్యార్థుల సొంత ఆలోచనలకు అది ప్రత్యామ్నాయం కాకూడదన్నారు. కామన్వెల్త్‌‌ లీగల్‌‌ ఎడ్యుకేషన్‌‌ అసోసియేషన్‌‌ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్‌‌లో ప్రారంభమైన రెండ్రోజుల అంతర్జాతీయ సదస్సులో ఆయన ప్రారంభోపన్యాసం చేశారు. విద్యార్థులు సమర్పించే పరిశోధనా పత్రాలు, పరీక్షల సమాధానాల్లో వారి స్వీయ అవగాహన, న్యాయ పరిజ్ఞానం ప్రతిబింబిస్తున్నాయో లేదో పరిశీలించాలని జస్టిస్‌‌ సూర్యకాంత్‌‌ సూచించారు. ఏఐతో రూపొందించిన రచనలను గుర్తించే సాఫ్ట్‌‌వేర్‌‌ల నివేదికలను విశ్వసించలేమన్నారు. రాత పరీక్షలతో పాటు మౌఖిక వివరణ, తీర్పులకు సంబంధించిన ఆధారాలను సమర్థించడం, ఏఐ రూపొందించిన సమాధానాల్లోని తప్పులను గుర్తించడం వంటి పద్ధతులను మూల్యాంకనంలో ప్రవేశపెట్టాలని చెప్పారు. 

తీర్పుల ఉల్లేఖనాల్లో కామన్వెల్త్‌‌ దేశాల మధ్య కనీస ఏకరూపత ఉండాలని, సుప్రీంకోర్టు 2023 నుంచి అమలు చేస్తున్న న్యూట్రల్‌‌ సైటేషన్‌‌ విధానం ద్వారా తీర్పులను ధ్రువీకరించవచ్చని వివరించారు. క్లినికల్‌‌ శిక్షణను ప్రత్యేక పాఠ్యాంశానికే పరిమితం చేయకుండా సాక్ష్యాధారాలు, క్రిమినల్‌‌ ప్రొసీజర్‌‌, కుటుంబ చట్టాలు, రాజ్యాంగ న్యాయం వంటి ప్రధాన అంశాల్లోనూ భాగం చేయాలని పేర్కొన్నారు. . ఏఐ సాయంతో చేసే పరిశోధనల్లో ప్రతి న్యాయ ఆధారాన్ని అసలు మూలంతో సరిచూసుకోవాలని, ఏఐ సహాయం తీసుకున్న విషయాన్ని వెల్లడించాలని సూచించారు. లా కాలేజీల్లోని న్యాయ సహాయ కేంద్రాలు కార్మికులు, పెన్షనర్లు, హింసకు గురవుతున్న మహిళలు, పేదలకు సేవలు అందించాలని, ప్రతి న్యాయ విద్యార్థి పట్టభద్రుడయ్యే ముందు నిర్దిష్ట కాలం న్యాయ సహాయ సేవలు అందించడాన్ని తప్పనిసరి చేయాలని ఆయన ప్రతిపాదించారు.

ఏఐ ప్రత్యామ్నాయం కాకూడదు: జస్టిస్‌‌ పీఎస్‌‌ నరసింహ

ఏఐపై అతిగా ఆధారపడటం వల్ల న్యాయ విద్యార్థుల్లో స్వతంత్రంగా ఆలోచించే సామర్థ్యం బలహీనపడుతుందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌‌ పీఎస్‌‌ నరసింహా హెచ్చరించారు. న్యాయవిద్య తొలుత చట్టాలు, పాఠ్యపుస్తకాల అధ్యయనంతో ప్రారంభమైందని, అనంతరం న్యాయ సమస్యల సంక్లిష్టత పెరగడంతో ఇతర శాస్త్రాల పరిజ్ఞానం అవసరమైందని వివరించారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌‌ అహ్సానుద్దీన్‌‌ అమానుల్లా, జస్టిస్‌‌ అపరేశ్‌‌ కుమార్‌‌ సింగ్‌‌, శ్రీలంక సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌‌ అహ్మద్‌‌ నవాజ్‌‌, హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్‌‌ పి.శ్యామ్‌‌కోశీ, జస్టిస్‌‌ ఈవీ వేణుగోపాల్‌‌, అడ్వకేట్‌‌ జనరల్‌‌ ఎ. సుదర్శన్ రెడ్డి, కామన్వెల్త్‌‌ లీగల్‌‌ ఎడ్యుకేషన్‌‌ అసోసియేషన్‌‌ (సీఎల్ఈఏ) అధ్యక్షుడు, సమావేశాల చైర్మన్‌‌ ప్రొఫెసర్‌‌ ఎస్‌‌.శివకుమార్‌‌ వివిధ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తులు ప్రొఫెసర్‌‌ మిజానూర్‌‌ రెహమాన్‌‌ తదితరులు పాల్గొన్నారు.