ఐసీయూలో డేంజర్ బెల్స్.. యాంటీబయాటిక్స్ పని చేస్తలేవ్! రక్తంలో మందులకు లొంగని బ్యాక్టీరియా

ఐసీయూలో డేంజర్ బెల్స్.. యాంటీబయాటిక్స్ పని చేస్తలేవ్!  రక్తంలో మందులకు లొంగని బ్యాక్టీరియా
  • బ్లడ్, యూరిన్ ఇన్ఫెక్షన్ల కామన్ మందులకు లొంగని బ్యాక్టీరియా
  •  ఐసీయూ పేషెంట్లలో 'మెరోపెనెమ్'కూ ఇదే పరిస్థితి 
  •  2024తో పోలిస్తే బ్లడ్, ఐసీయూ ఇన్ఫెక్షన్లలో పెరుగుదల 
  •  10 జిల్లాల్లో స్టడీ చేసి తేల్చిన ఉస్మానియా మెడికల్​ కాలేజ్​

హైదరాబాద్, వెలుగు: చిన్న జలుబు, దగ్గు, జ్వరం వచ్చినా డాక్టర్ సలహా లేకుండానే మెడికల్ షాపులకు వెళ్లి యాంటీబయాటిక్స్ మింగేసే అలవాటు ఇప్పుడు ప్రాణాల మీదకు తెస్తోంది. రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో సాధారణ ఇన్ఫెక్షన్ల నుంచి ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగుల వరకు చికిత్స కోసం వాడే కీలకమైన యాంటీబయాటిక్స్ వాటి ప్రభావాన్ని కోల్పోతున్నాయి. అదే ప్రమాదమనుకుంటే.. రాష్ట్రంలో యాంటీబయాటిక్​ రెసిస్టెన్స్​గతంతో పోలిస్తే ఇప్పుడు ఎక్కువైపోవడం మరింత కలవరపెడుతున్నది. స్టైఫైలో కోకస్​రెసిస్టెన్స్​(ఎంఆర్ఎస్ఏ) 53 నుంచి 65 శాతానికి, కార్బాపీనమ్​, కొలిస్టిన్​వంటి అత్యంత ఆధునిక యాంటీబయాటిక్​ల నిరోధకత 2024తో పోలిస్తే ఇప్పుడు 100 శాతం పెరగడం కలవరపెడుతున్నది. 

ఉస్మానియా మెడికల్​కాలేజీ ఆధ్వర్యంలో తెలంగాణ యాంటీ మైక్రోబియల్​రెసిస్టెన్స్​సర్వైలెన్స్​నెట్​వర్క్​ (టార్స్​నెట్​)రాష్ట్రంలోని 10 జిల్లాల్లో స్టడీ చేసి రిపోర్టును విడుదల చేసింది. 14,616 శాంపిళ్లను సేకరించి  అధ్యయనం చేయగా.. 5,716 శాంపిళ్లలో మూత్రనాళ ఇన్ఫెక్షన్లు (యూటీఐ), రక్తంలో ఇన్​ఫెక్షన్లకు కారణమయ్యే ఈ కొలి బ్యాక్టీరియకు సంబంధించి రెసిస్టెన్స్​ఎక్కువగా ఉన్నట్టు స్టడీలో తేలింది. ఈ కొలి ఇన్​ఫెక్షన్​కు సాధారణంగా వాడే మూడోతరం యాంటీబయాటిక్​ సెఫ్ట్రియాక్సోన్​కూ ఆ బ్యాక్టీరియా లొంగడం లేదు. 74 నుంచి 78 శాతం వరకు లొంగట్లేదని ఓయూ స్టడీ వెల్లడించింది.  

ఐసీయూల్లో డేంజర్​ బెల్స్​

ఐసీయూ రోగుల రక్తంలోని 'అసినెటోబాక్టర్'అనే బ్యాక్టీరియాను ఇన్ఫెక్షన్లను తగ్గించడానికి వాడే 'సెఫ్టాజిడిమ్' యాంటీబయాటిక్ పనిచేయడం లేదు. దాదాపు 81% కేసుల్లో విఫలమవుతోంది. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లను తగ్గించడానికి వాడే మెరోపెనెమ్ యాంటీబయాటిక్‌‌కు కూడా 47 శాతం బ్యాక్టీరియా నిరోధకత చూపుతోంది. మరింత ఆందోళన కలిగించే విషయం ఏంటంటే.. ఐసీయూ రోగుల రక్త నమూనాల్లో మెరోపెనెమ్‌‌కు లొంగని అసినెటోబాక్టర్ శాతం 2024లో 22 శాతం ఉండగా, 2025 నాటికి అది ఏకంగా 47 శాతానికి (దాదాపు రెట్టింపు) పెరగడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నది. 

వీటితో పాటు గ్రామ్-నెగెటివ్ వర్గానికి చెందిన బ్యాక్టీరియా కూడా గతేడాదితో పోలిస్తే అత్యంత శక్తిమంతమైన కార్బపెనెమ్స్ గ్రూప్ యాంటీబయాటిక్స్‌‌కు లొంగకుండా మొండిగా మారుతోందని నివేదిక తేల్చింది. దీనివల్ల విషమ పరిస్థితిలో ఉన్న రోగులకు ఏ మందు వాడాలో తెలియక డాక్టర్ల ముందున్న చికిత్సా మార్గాలు తగ్గిపోతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

10 జిల్లాల్లోని 13 కేంద్రాల నుంచి స్టడీ శాంపిల్స్​

స్టడీ కోసం 10 జిల్లాల్లోని 13 కేంద్రాల నుంచి శాంపిళ్లను తీసుకొచ్చారు. హైదరాబాద్​లోని ఉస్మానియా, గాంధీ మెడికల్​ కాలేజీలో, వరంగల్​లోని కాకతీయ మెడికల్​ కాలేజ్​, ఆదిలాబాద్, నిజామాబాద్, మహబూబ్‌‌నగర్, సిద్దిపేట, నల్గొండ, సూర్యాపేట, సంగారెడ్డిల్లోని  ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, బీబీ నగర్​ ఎయిమ్స్​, కామినేని అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ ఇన్‌‌స్టిట్యూట్, అపోలో ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ ల నుంచి తెచ్చిన శాంపిళ్లపై అధ్యయనం చేశారు. 

గ్రామ్–పాజిటివ్ బ్యాక్టీరియాలో ఎంఆర్ఎస్ఏ పెరుగుదల, గ్రామ్–నెగెటివ్ బ్యాక్టీరియాలో కార్బపెనెమ్ నిరోధకత రావడం, నాన్–ఫెర్మెంటర్లలో (సూడోమోనాస్, అసినెటోబాక్టర్) మల్టీడ్రగ్ రెసిస్టెన్స్ తీవ్రత పెద్ద సవాల్ అని నివేదిక స్పష్టం చేసింది. దీనిని అరికట్టేందుకు అన్ని ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో నిరంతర ఏఎంఆర్ నిఘ, బలమైన యాంటీబయాటిక్ స్టీవార్డ్‌‌షిప్ (అవసరమైన మేరకే, సరైన మందు వాడకం), కఠినమైన ఇన్ఫెక్షన్ నివారణ, నియంత్రణ చర్యలను తప్పనిసరిగా అమలు చేయాలని స్టడీ రిపోర్టులో నిపుణులు సూచించారు. మందులు వాడని వారికీ మొండి బ్యాక్టీరియా సోకుతున్నట్టు రిపోర్టులో వెల్లడించారు.

చీములోనూ ప్రమాదకరమైన బ్యాక్టీరియా రెసిస్టెన్స్​

శాంపిళ్లలో 8 రకాల ప్రమాదకరమైన బ్యాక్టీరియాలను స్టడీలో గుర్తించారు. ఇన్​ఫెక్షన్ల ద్వారా వచ్చే చీములోనూ రోగనిరోధకత సంతరించుకున్న బ్యాక్టీరియాలను తాజాగా నిర్ధారించారు. స్టెఫైలో కోకస్​ఆరియస్​ 72 శాతం, సూడోమోనాస్​ 49 శాతం, క్లెబ్సియెల్లా 24 శాతం చొప్పున చీములో కనిపించిన బ్యాక్టీరియా నమూనాలు రెసిస్టెన్స్(మందులకు లొంగకపోవడం)​ సంతరించుకున్నట్టు తేలింది. ఇది మరింత ప్రమాదకరమని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

మొత్తంగా సాధారణ ఇన్​ఫెక్షన్లకు వాడే సెఫెక్సిమ్​, సెఫ్ట్రియాక్సోన్​, అమాక్సీసిలిన్​, టాజోబాక్టమ్​, పైపరాసిలిన్​, సెఫ్పోడాక్సిమ్​ వంటి 29 యాంటీ బయాటిక్స్​తో పాటు సీరియస్​ కేసుల్లో వాడే ఇమిపెనెమ్​, మెరోపెనమ్​, ఎర్టాపెనమ్​, కొలిస్టిన్​ వంటి యాంటీబయాటిక్​లు కూడా బ్యాక్టీరియాలపై పనిచేయడం లేదని ఉస్మానియా మెడికల్​కాలేజ్​స్టడీ తేల్చి చెప్పింది.