- నిపుణులు, విద్యార్థులు, టీచర్లు, పేరెంట్స్‌తో చర్చించాకే ముందుకెళ్లాలి
- ఎస్ఎఫ్ఐ రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు
హైదరాబాద్, వెలుగు: ఇంటర్ బోర్డును రద్దు చేసి, ఇంటర్ విద్యను పాఠశాల విద్యలో విలీనం చేయాలనే నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా ముందుకు వెళ్లొద్దని విద్యార్థి, యువజన, ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేశాయి. విద్యారంగ నిపుణులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, తల్లిదండ్రులతో సమగ్రంగా చర్చించి, మౌలిక వసతుల కల్పన, అధ్యాపకుల నియామకాలు, ఉద్యోగుల హక్కులకు భరోసా కల్పించిన తర్వాతే 10+2 విధానాన్ని అమలు చేయాలని కోరాయి. నగరంలోని ఐటీయూ సిటీ కార్యాలయంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆ రాష్ట్ర అధ్యక్షుడు రజినీకాంత్ అధ్యక్షతన శనివారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
ముందుగా వసతులు కల్పించాలి
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. అందరితో చర్చించకుండా సీఎం ఏకపక్షంగా ఇంటర్ బోర్డు రద్దును ప్రకటించడం ప్రజాస్వామ్యబద్ధం కాదన్నారు. కేవలం బోర్డు రద్దు, విలీనంతోనే డ్రాపౌట్లు తగ్గుతాయన్న ప్రభుత్వ వాదనకు ఆధారమైన గణాంకాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. హైస్కూళ్లలో 11, 12 తరగతులు ప్రారంభించేందుకు ముందుగా తరగతి గదులు, ప్రయోగశాలలు, గ్రంథాలయాలు, కంప్యూటర్ ల్యాబ్‌లు, తాగునీరు, టాయిలెట్ల వంటి వసతులు కల్పించాలన్నారు. గ్రామీణ విద్యార్థులకు ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్‌ఈసీ గ్రూపులన్నీ అందుబాటులో ఉంచి అర్హులైన అధ్యాపకుల నియామకంతో పాటు ఖాళీగా ఉన్న టీచర్, లెక్చరర్ పోస్టులను భర్తీ చేయాలని కోరారు.
విలీనం నేపథ్యంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లోని అధ్యాపకులు, ప్రిన్సిపాళ్లు, బోధనేతర సిబ్బంది ఉద్యోగ భద్రత, క్యాడర్, సీనియారిటీ, పదోన్నతులు, బదిలీలు, జీతభత్యాలు, రిటైర్మెంట్ ప్రయోజనాలపై స్పష్టమైన సర్వీస్ రూల్స్ ప్రకటించాలన్నారు. ఇంటర్‌ను పాఠశాల విద్యలో విలీనం చేసిన ఏపీ అనుభవాలను అధ్యయనం చేయాలని కోరారు. సమావేశంలో విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.
