వెనిస్: ప్రతిష్ఠాత్మక 'ఇటాలియా టీ10 లీగ్' కోసం వెనిస్ లైవ్‌వైర్స్ ఫ్రాంచైజీ తమ స్టార్ ఆటగాళ్లతో కూడిన జట్టును ప్రకటించింది. వెస్టిండీస్ విధ్వంసకర బ్యాటర్ క్రిస్ గేల్ ఈ జట్టుకు ప్రధాన ఆకర్షణగా నిలవనుండగా, ఇంగ్లండ్ మాజీ అంతర్జాతీయ ఆటగాడు డేవిడ్ మలన్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అనుభవజ్ఞులైన అంతర్జాతీయ క్రికెటర్లతో పాటు యువ ప్రతిభావంతులతో ఈ జట్టును పటిష్ఠంగా తీర్చిదిద్దారు. ఇండియా ఆటగాళ్లు కేసీ కరియప్ప, విజయ్ శంకర్, సౌతాఫ్రికా మాజీ ఆటగాడు (ప్రస్తుతం ఇటలీకి ప్రాతినిధ్యం) జేజే స్మట్స్ ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు.
ప్రధాన కోచ్‌గా డోనోవన్ మిల్లర్ బాధ్యతలు నిర్వర్తించనుండగా, టీమిండియా మాజీ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ టీమ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా ఫ్రాంచైజీ చైర్మన్ టీఎన్‌ఆర్ మోహిత్ మాట్లాడుతూ.. ‘అంతర్జాతీయ క్రికెటర్లను ఒకే వేదికపైకి తీసుకురావడం ఆనందంగా ఉంది. వెనిస్ స్ఫూర్తిని చాటుతూ లీగ్‌లో బలమైన ముద్ర వేయడమే మా లక్ష్యం. క్రిస్ గేల్, డేవిడ్ మలన్ లాంటి దిగ్గజ ఆటగాళ్ల రాకతో జట్టుకు తిరుగులేని బలం చేకూరింది’ అని పేర్కొన్నారు.
అనుభవం, నైపుణ్యం కలగలిసిన సమతూకమైన జట్టును ఎంపిక చేశామని, టోర్నీలో అద్భుత ప్రదర్శన చేస్తామని టీమ్ డైరెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ ధీమా వ్యక్తం చేశారు. ఆది, సోమ, మంగళవారం జరిగే మ్యాచ్‌ల్లో లైవ్‌వైర్స్.. వరుసగా నపోలీ నైట్స్, రోమ్ గ్లాడియేటర్స్, బ్రెసియా లయన్స్‌తో తలపడతుంది. ఈ లీగ్ మ్యాచ్‌లు స్టార్ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి.
