గోదావరి పుష్కరాలకు 8 కోట్ల మంది భక్తులు..గడువులోగా పనులు పూర్తి చేయండి: సీఎస్ సంజయ్ జాజు

గోదావరి పుష్కరాలకు 8 కోట్ల మంది భక్తులు..గడువులోగా పనులు పూర్తి చేయండి: సీఎస్ సంజయ్ జాజు

హైదరాబాద్, వెలుగు: గోదావరి పుష్కరాలకు సంబంధించిన ఇంజినీరింగ్, మౌలిక సదుపాయాల పనులన్నింటినీ నిర్ణీత గడువులోపు పూర్తి చేసేలా సంబంధిత శాఖలన్నీ చర్యలు తీసుకోవాలని సీఎస్ సంజయ్ జాజు ఆదేశించారు. పుష్కరాల సందర్భంగా రాష్ట్రానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున, అందుకు అనుగుణంగా ముందస్తు ఏర్పాట్లు చేయాలని సూచించారు. గోదావరి పుష్కరాల ఏర్పాట్లు, సన్నద్ధతపై నేడు అన్ని సంబంధిత శాఖల అధికారులతో సీఎస్ సమీక్షా సమావేశం నిర్వహించారు. 

2027 జూన్ 26 నుంచి జులై 7 వరకు జరగనున్న గోదావరి పుష్కరాలకు సుమారు 8 కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు వివరించారు. భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. పుష్కరాలకు సంబంధించిన కార్యక్రమాల నిర్వహణ, భక్తులకు సౌకర్యాల కల్పన కోసం మొత్తం 67 ప్రాంతాలను గుర్తించారు. అన్ని మౌలిక సదుపాయాలు, ఇంజినీరింగ్ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసేందుకు ముందస్తు ప్రణాళిక, వివిధ శాఖల మధ్య సమన్వయం, పనులపై నిరంతర పర్యవేక్షణ ఎంతో అవసరమని సీఎస్ స్పష్టం చేశారు.