- సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల మాదిరిగా టీడీఆర్ బదిలీలు
- అధికారుల పర్యవేక్షణలోనే కొనుగోళ్లు, అమ్మకాలు
- టీడీఆర్ బ్యాంకులో కొనుగోలుదారులు, విక్రేతల వివరాల నమోదు
- టీడీఆర్ బ్యాంకులో స్లాట్ బుక్ చేసుకుంటే నేరుగా సంప్రదింపులు
హైదరాబాద్ సిటీ, వెలుగు: టీడీఆర్ (ట్రాన్స్‌ఫరబుల్ డెవలప్‌మెంట్ రైట్స్) క్రయవిక్రయాల్లో అక్రమాలకు చెక్ పెట్టేందుకు సీఎంసీ కొత్త విధానానికి శ్రీకారం చుట్టబోతోంది. ఇప్పటివరకు పర్యవేక్షణ లేకుండా సాగుతున్న టీడీఆర్ లావాదేవీలను ఇకపై సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు జరిగే తరహాలో పారదర్శకంగా నిర్వహించాలని భావిస్తోంది.
ఇందుకోసం ప్రత్యేక వ్యవస్థను అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. మూడు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో కొందరు టీడీఆర్‌లను బ్లాక్ చేసి, కృత్రిమ కొరత సృష్టిస్తూ దందా చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
నగరంలో రోడ్ల విస్తరణ, ఇతర అభివృద్ధి పనుల కోసం భూములు కోల్పోయిన యజమానులకు పరిహారానికి బదులుగా ప్రభుత్వం టీడీఆర్ సర్టిఫికెట్లు జారీ చేస్తోంది. వీటిని అవసరమైన ఇతరులు కొనుగోలు చేసి, భవన నిర్మాణాలకు సంబంధించి అదనపు ఫ్లోర్లు, సెట్ బ్యాక్‌ల వెసులుబాటు కోసం వినియోగించుకునే అవకాశం ఉంది. దీంతో టీడీఆర్‌లకు మార్కెట్‌లో డిమాండ్ ఏర్పడింది.
అయితే కొందరు మధ్యవర్తులు వీటిని ముందుగానే కొనుగోలు చేసి బ్లాక్ చేయడం, ఆ తర్వాత అధిక ధరలకు విక్రయించడం వంటి వ్యవహారాలకు పాల్పడుతున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో లావాదేవీలన్నీ తమ పర్యవేక్షణలో జరిగేలా కొత్త విధానాన్ని రూపొందిస్తున్నారు.
టీడీఆర్ బ్యాంకులో రిజిస్ట్రేషన్..
కొత్త విధానంలో టీడీఆర్‌లు విక్రయించాలనుకునే వారు, కొనుగోలు చేయాలనుకునే వారు తమ వివరాలను టీడీఆర్ బ్యాంకులో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. టీడీఆర్ అవసరమైన కొనుగోలుదారులు ముందుగా బ్యాంకులో స్లాట్ బుక్ చేసుకుని సంబంధిత కార్యాలయానికి వెళ్లాలి. అక్కడ అధికారుల సమక్షంలోనే విక్రయదారులతో లావాదేవీలు పూర్తి చేసుకునేలా ఏర్పాట్లు చేయనున్నారు. దీనివల్ల మార్కెట్‌లో అందుబాటులో ఉన్న ధరలకే టీడీఆర్ కొనుగోలు చేసే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.
మధ్యవర్తుల దందాకు అడ్డుకట్ట..
ప్రస్తుతం టీడీఆర్‌ల కొనుగోలు, విక్రయాలు, బదిలీలపై సమగ్ర పర్యవేక్షణ లేకపోవడంతో మధ్యవర్తుల జోక్యం పెరుగుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొత్త విధానం అమల్లోకి వస్తే ఎవరి దగ్గర ఎన్ని టీడీఆర్‌లు ఉన్నాయి? ఎవరు విక్రయిస్తున్నారు? ఎవరు కొనుగోలు చేస్తున్నారు? వాటిని ఎక్కడ వినియోగిస్తున్నారు? అనే వివరాలు అధికారుల వద్ద నమోదవుతాయి. దీంతో టీడీఆర్‌లను బ్లాక్ చేసి అధిక ధరలకు విక్రయించే వ్యవహారాలకు అడ్డుకట్ట పడుతుందని అధికారులు భావిస్తున్నారు.
టీడీఆర్ జారీ నుంచి బదిలీ, వినియోగం వరకు ప్రతి దశను పారదర్శకంగా నిర్వహించడమే ఈ కొత్త విధానం ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. ప్రస్తుతం మార్కెట్ ధర కంటే 50 నుంచి 60 శాతం ఎక్కువకు టీడీఆర్‌లు కొంటున్నారు. రోజురోజుకు రియల్ ఎస్టేట్ తరహాలోనే టీడీఆర్‌కు రేటు పెరుగుతోంది. లక్ష రూపాయల విలువ ఉన్న టీడీఆర్‌కు రూ.1.60 లక్షల వరకు ధర పలుకుతోంది.
టీడీఆర్ అంటే..?
టీడీఆర్ అనేది భూమి కోల్పోయిన యజమానికి ప్రభుత్వం ఇచ్చే ఒక హక్కు పత్రం. దీని ద్వారా కోల్పోయిన భూమి స్థానంలో వేరే చోట అదనపు నిర్మాణ విస్తీర్ణాన్ని నిర్మించుకునే వెసులుబాటు ఉంది. టీడీఆర్ పొందిన వారికి నిర్మించుకునే స్తోమత లేకపోతే, ఆ టీడీఆర్ సర్టిఫికెట్‌ను బహిరంగ మార్కెట్‌లో పెట్టి అమ్ముకునే అవకాశముంది. ఇది భూమికి నగదు పరిహారానికి ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది.
రోడ్లు, నాలాల విస్తరణ తదితర పనుల కోసం అవసరమైన భూమి, ఆస్తుల సేకరణలో భాగంగా నష్టపరిహారంగా నగదు చెల్లింపులకు బదులుగా మార్కెట్ వ్యాల్యూని బట్టి టీడీఆర్ సర్టిఫికెట్లను జారీ చేస్తున్నారు.
అభివృద్ధి పనులకు ప్రైవేట్ వ్యక్తుల నుంచి భూమిని సేకరించి, నగదు పరిహారానికి ప్రత్యామ్నాయంగా ఈ టీడీఆర్‌ను ఇస్తున్నారు. ఏదైనా ఒక నిర్వాసితుడు రోడ్ల విస్తరణ వల్ల ఏ మేరకు ఆస్తులను కోల్పోయాడో, అంతకు నాలుగు రెట్లు; నాలాలు, వాటర్ బాడీస్‌లో కోల్పోతే రెండు రెట్ల విలువైన టీడీఆర్ పత్రాలను పరిహారంగా పొందుతారు.
