సిద్దిపేట మెడికల్ కాలేజీకి మదన్ మోహన్ పేరు

సిద్దిపేట మెడికల్ కాలేజీకి మదన్ మోహన్ పేరు
  •     జీవో జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

హైదరాబాద్, వెలుగు: సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీ పేరును రాష్ట్ర ప్రభుత్వం ‘అనంతుల మదన్ మోహన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్’గా మార్చింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ క్రిస్టినా జెడ్. చొంగ్తూ శనివారం జీవో 178ను జారీ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల19న సిద్దిపేటలో పర్యటించిన సందర్భంగా కాలేజీ పేరు మార్పుపై ప్రకటన చేశారు. రాష్ట్రానికి చేసిన సేవలకు గుర్తింపుగా సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీకి మాజీ మంత్రి, సిద్దిపేట మాజీ ఎమ్మెల్యే దివంగత అనంతుల మదన్ మోహన్ పేరు పెడుతున్నట్లు తెలిపారు. 

సీఎం ప్రకటనకు అనుగుణంగా వైద్య, ఆరోగ్య శాఖ అధికారిక ఉత్తర్వులు ఇచ్చింది. మెడికల్ కాలేజీతో పాటు సిద్దిపేటలోని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్సెస్ సంస్థ, ఆయుష్ ఇంటిగ్రేటెడ్ హాస్పిటల్ పేర్లకు ముందు కూడా ఇదే పేరును చేర్చాలని ప్రభుత్వం ఆదేశించింది. పేర్లు మారినప్పటికీ ఆయా సంస్థల హోదాలు, ప్రస్తుతం ఉన్న పాలనా, అకడమిక్, నియంత్రణపరమైన ఏర్పాట్లన్నీ గతంలో మాదిరిగానే యథాతథంగా కొనసాగుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం తదుపరి చర్యలు తీసుకోవాలని హైదరాబాద్‌‌‌‌ లోని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ), సిద్దిపేట జిల్లా కలెక్టర్, సంబంధిత సంస్థల అధిపతులను ప్రభుత్వం ఆదేశించింది.