- కోల్‌కతా నుంచి హైదరాబాద్‌కు ఫారిన్ గోల్డ్ స్మగ్లింగ్
- నిఘా పెట్టి ఇద్దరు స్మగ్లర్లను పట్టుకున్న డీఆర్‌ఐ
హైదరాబాద్, వెలుగు: కారు బ్రేక్ లైట్లలో బంగారం స్మగ్లింగ్ చేస్తున్న ఇద్దరిని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) అధికారులు అరెస్టు చేశారు. వెనుక టెయిల్ ల్యాంప్‌లో 2.98 కిలోల ఫారిన్ గోల్డ్ బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న 25 బార్ల విలువ సుమారు రూ.3.83 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. బంగారాన్ని తరలించేందుకు ఉపయోగించిన కియా సెల్టోస్ కారును సీజ్ చేశారు. ఈ మేరకు డీఆర్‌ఐ హైదరాబాద్ జోనల్ యూనిట్ శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. వివరాల్లోకి వెళ్తే.. కోల్‌కతా నుంచి హైదరాబాద్‌కు ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు కియా సెల్టోస్ కారులో ఫారిన్ గోల్డ్ తరలిస్తున్నట్లు డీఆర్‌ఐ అధికారులకు సమాచారం అందింది. దాంతో హైదరాబాద్ జోనల్ అధికారులు నిఘా పెట్టారు.
గురువారం హైదరాబాద్ పరిధిలో ఆ వాహనాన్ని అడ్డుకుని తనిఖీ చేశారు. కారులో ఉన్న ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారించారు. స్మగ్లర్లు తెలిపిన వివరాల ఆధారంగా కారులో ఒక టెయిల్ ల్యాంప్ వెనుక ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సీక్రేట్ అరలో మూడు ప్యాకెట్లను గుర్తించారు. వాటిని తెరిచి చూడగా ఫారిన్ ముద్రతో ఉన్న మొత్తం 25 బంగారు బార్లు బయటపడ్డాయి. వీటి బరువు 2.98 కిలోలుగా అధికారులు నిర్ధారించారు. బంగారం మూలాలు, అక్రమ రవాణా వెనుక ఉన్న వ్యక్తులు, నెట్‌వర్క్‌పై డీఆర్‌ఐ అధికారులు తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
