హైదరాబాద్, వెలుగు: కరువు కాలంలోనూ అవసరానికి మించి ఇప్పటికే కృష్ణాలోని నీటిని తన్నుకుపోయిన పొరుగు రాష్ట్రం.. ఇప్పుడు సాగర్ నీళ్లపైనా కన్నేసింది. మనం వాడుకోవడానికి శ్రీశైలం నుంచి తెచ్చుకుని సాగర్‌లో స్టోర్ చేసుకున్న నీటినీ తన్నుకుపోవాలని ప్రయత్నిస్తున్నది. అందులో భాగంగానే సాగర్ ప్రాజెక్ట్నుంచి మరో 9 టీఎంసీల కృష్ణా జలాలను విడుదల చేయాలంటూ కృష్ణా బోర్డును కోరింది. ఈ నెల 25 నుంచి మూడు నెలల పాటు తాగునీటి అవసరాల కోసం కుడి, ఎడమ కాల్వల నుంచి నీటిని విడుదల చేయాలని కోరింది.
పల్నాడు, గుంటూరు, బాపట్ల, మార్కాపురం, ప్రకాశం జిల్లాల తాగునీటి అవసరాలను తీర్చడానికి కుడి కాల్వ నుంచి 8 టీఎంసీలు, ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు జిల్లాల తాగునీటి ఎడమ కాల్వ నుంచి 1 టీఎంసీ నీటిని ఇవ్వాలని కోరడం గమనార్హం. ఏపీ ఇలా అడిగిందో లేదో అలా వెంటనే బోర్డు మీటింగ్‌కు కేఆర్ఎంబీ ఆదేశించింది. ఈ నెల 23న (సోమవారం) బోర్డు త్రీమెంబర్ కమిటీ మీటింగ్‌ను నిర్వహించనున్నట్టు రెండు రాష్ట్రాలకు సమాచారం ఇచ్చింది. జలసౌధలో ఉదయం 11 గంటలకు మీటింగ్ నిర్వహిస్తామని వెల్లడించింది.
