- ఫొటో జర్నలిస్టులు నిజమైన యోధులు: స్పీకర్ గడ్డం ప్రసాద్
హైదరాబాద్, వెలుగు: ఫొటో జర్నలిస్టులు చరిత్రను కళ్లకు కట్టినట్లు చూపించే సాక్షులని, ఒక్క ఫొటోతో చరిత్రను శాశ్వతం చేయగలరని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రశంసించారు. శనివారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ స్టేట్ ఫొటో జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్టేట్ బెస్ట్ ఫొటో జర్నలిస్ట్స్ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. అసోసియేషన్ అధ్యక్షుడు గంగాధర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో స్పీకర్ చేతుల మీదుగా ఉత్తమ ఫొటో జర్నలిస్టులకు అవార్డులు ప్రదానం చేశారు. ఇందులో భాగంగా ‘వీ6 వెలుగు’ చీఫ్ ఫొటోగ్రాఫర్ నవీన్ స్టేట్ బెస్ట్ ఫొటో జర్నలిస్ట్ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా స్పీకర్‌మాట్లాడుతూ.. ఒక వార్తను వందల పదాలతో వివరించాల్సి వచ్చినా.. ఒక్క ఫొటో క్షణాల్లోనే వేల భావాలను ప్రజలకు చేరవేస్తుందని పేర్కొన్నారు.
జర్నలిజంలో వార్తకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో ఫొటోకు కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుందన్నారు. వరదలు, అగ్ని ప్రమాదాలు, ఉద్యమాలు, యుద్ధాల సమయంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించే ఫొటో జర్నలిస్టులు నిజమైన యోధులని ప్రశంసించారు. ఫేక్ ఫొటోలు, మార్ఫింగ్, ఏఐ సృష్టించిన దృశ్యాలతో తప్పుడు సమాచారం వ్యాప్తిచెందే ప్రమాదం ఉందని హెచ్చరించారు. జర్నలిస్టులు ఎప్పటికప్పుడు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని సూచించారు. ఫొటో జర్నలిస్టుల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు ప్రజా ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. టెక్నాలజీకి అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.
