హైదరాబాద్ సిటీ, వెలుగు: పారిశుధ్య కార్మికుల జీతాలు పెంచాలని జాతీయ సఫాయి కర్మచారి కమిషన్ సభ్యుడు కరం సింగ్ కర్మ అధికారులను కోరారు. పారిశుధ్య కార్మికుల సమస్యలు, మెరుగైన సౌకర్యాలపై శనివారం జీహెచ్ ఎంసీ ఆఫీస్లో ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.
ఈ సమావేశానికి జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డితో పాటు మూడు కార్పొరేషన్ల అదనపు కమిషనర్లు, ఆరోగ్య, పారిశుధ్య విభాగాల అధికారులు, ఇతర ఉన్నతాధికారులు, కార్మిక సంఘాల నాయకులు, యూనియన్ ప్రతినిధులు, పారిశుధ్య కార్మికులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్మికులు తమ సమస్యలను కమిషన్ సభ్యుడి దృష్టికి తీసుకెళ్లారు.
పారిశుధ్య కార్మికులు, శానిటేషన్ ఆటో డ్రైవర్లకు హెల్త్ కార్డులు, పీపీఈ కిట్లు, బీమా సౌకర్యం కల్పించాలని కోరారు. పీఎఫ్ బకాయిలు చెల్లించాలని, కనీస వేతనాలు అమలు చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
అనంతరం కరం సింగ్ కర్మ మాట్లాడుతూ పారిశుధ్య కార్మికులు, సఫాయి కర్మచారుల జీతాలు పెంచేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని జీహెచ్‌ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ కమిషనర్లకు సూచించారు. కార్మికులందరికీ వైద్య బీమా సౌకర్యం కల్పించాలని, ప్రభుత్వం కల్పిస్తున్న సంక్షేమ పథకాలు అందించాలని చెప్పారు.
