- ఆదాయం, ఐటీ చెల్లింపులు, రిటర్న్స్ రికార్డుల పరిశీలన
హైదరాబాద్, వెలుగు: ప్రముఖ పౌల్ట్రీ, అగ్రి బిజినెస్ సంస్థ స్నేహ గ్రూప్‌పై ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ అధికారులు శనివారం మెరుపు దాడులు చేశారు. తెలంగాణ, ఏపీలోని మొత్తం 16 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టారు. హైదరాబాద్, విజయవాడ సహా పలు ప్రాంతాల్లో సంస్థ కార్యాలయాలు, డైరెక్టర్ల నివాసాల్లో అధికారులు తనిఖీలు కొనసాగాయి. హైదరాబాద్‌లోని కొండాపూర్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న స్నేహ గ్రూప్ డైరెక్టర్లు రామ్ రెడ్డి దెంది, వరుణ్ రెడ్డి దెంది, స్నేహ దెంది నివాసాల్లోనూ ఐటీ అధికారులు సోదాలు చేపట్టినట్లు సమాచారం. సంస్థకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, ఆదాయపు పన్ను చెల్లింపులు, వ్యాపార కార్యకలాపాలకు సంబంధించిన పత్రాలను ఐటీ అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. కీలక పత్రాలు, నగదు స్వాధీనంపైనా అధికారులు ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. సోదాలకు నిర్దిష్ట కారణాలు, తనిఖీల్లో గుర్తించిన అంశాలపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
స్నేహ గ్రూప్స్ నేపథ్యం ఇలా..
1982లో రామ్ రెడ్డి చికెన్ మార్కెట్‌గా ప్రారంభమైన ఈ వ్యాపారం 1994లో స్నేహ ఫామ్స్‌గా విస్తరించింది. అనంతరం పౌల్ట్రీ బ్రీడింగ్, చికెన్ ప్రాసెసింగ్, పశువుల దాణా తయారీతో పాటు వంట నూనెల వ్యాపారంలోకి సంస్థ ప్రవేశించింది. సఫల బ్రాండ్ పేరుతో వంట నూనెలను మార్కెట్ చేస్తోంది. తెలంగాణలో గంటకు 12 వేల కోళ్లను ప్రాసెస్ చేయగల సామర్థ్యం ఉన్న ఆటోమేటెడ్ ప్లాంట్‌ను నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా 2,000 మందికి పైగా కాంట్రాక్ట్ రైతులతో కలిసి సంస్థ పౌల్ట్రీ వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. భారత రక్షణ సంస్థలకు సైతం ఫ్రోజెన్ చికెన్‌ను సరఫరా చేస్తోంది. 2024 ఆర్థిక సంవత్సరంలో సింగ్ పౌల్ట్రీ సంస్థను కొనుగోలు చేయడం ద్వారా తన వ్యాపార కార్యకలాపాలను మరింత విస్తరించింది.
