అగ్రిగోల్డ్‌‌‌‌ బాధితులకు ఊరట..నవంబర్ 25 నుంచి బాండ్ల పరిశీలన, వివరాల నమోదు

అగ్రిగోల్డ్‌‌‌‌ బాధితులకు ఊరట..నవంబర్ 25 నుంచి బాండ్ల పరిశీలన, వివరాల నమోదు
  •     రాష్ట్రవ్యాప్తంగా 10 సెంటర్లు, స్పెషల్ ఆఫీసర్లు ఏర్పాటు
  •     ఒరిజినల్ బాండ్ చూపించి, జిరాక్స్‌‌‌‌ కాపీ ఇవ్వాలని అధికారుల సూచన

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: అగ్రిగోల్డ్‌‌‌‌ సంస్థలో పెట్టుబడులు పెట్టి తమ సొమ్మును కోల్పోయిన బాధితులకు ఊరట లభించనుంది. డిపాజిట్ల రూపంలో వీరంతా పోగుట్టుకున్న సొమ్ము తిరిగి అప్పగించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. సీఐడీ ఆధ్వర్యంలో అగ్రిగోల్డ్‌‌‌‌ బాధితుల నుంచి ఒరిజినల్‌‌‌‌ బాండ్లు, నగదు రశీదులు, ఇతర పత్రాలను పరిశీలించి, నమోదు చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా పది ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసింది. 

ఈ మేరకు సీఐడీ చీఫ్ చారుసిన్హా శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. తక్కువ సమయంలో ఎక్కువ లాభాల పేరిట దాదాపు రూ.447 కోట్లకు పైగా వసూలు చేసిన ఈ కేసులో రాష్ట్ర వ్యాప్తంగా 1.65 లక్షల మంది వరకు బాధితులు ఉన్నట్లు తెలిపారు. బాధితులు, వారి కుటుంబసభ్యులు, నామినీలు, చట్టబద్ధ వారసులు, ఏజెంట్లు తమకు సంబంధించిన పత్రాలతో నిర్దేశించిన కేంద్రాలకు హాజరుకావాల్సి ఉంటుందని సూచించారు.

బాండ్ల వెరిఫికేషన్ ద్వారా రిఫండ్ ప్రక్రియ..

బాధితుల బాండ్లు, ఇతర పత్రాలు వెరిఫికేషన్ కోసం హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా సెంటర్లు ఏర్పాటు చేశారు. వీటిలో ఈ నెల 25 నుంచి సీఐడీ అధికారులు బాండ్ల పరిశీలన, రిజిస్ట్రేషన్‌‌‌‌ ప్రక్రియను కొనసాగించనున్నారు. జిల్లా, మండలాల వారీగా షెడ్యూల్‌‌‌‌ను రూపొందించారు. బాండ్ల పరిశీలన, నమోదు ప్రక్రియ పని దినాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. 

బాధితులు అసలు బాండ్‌‌‌‌ను పరిశీలన కోసమే అధికారులకు చూపించాలి. బాండ్‌‌‌‌ వివరాలు, గుర్తింపు సంఖ్య స్పష్టంగా కనిపించేలా కలర్‌‌‌‌ జిరాక్స్‌‌‌‌ తీసి, దానిపై డిపాజిటర్‌‌‌‌ లేదా నామినీ లేదా చట్టబద్ధ వారసుడు సంతకం చేసి సమర్పించాలి. బాధితులు తమ ప్రాంతానికి కేటాయించిన కేంద్రంలోనే బాండ్ల పరిశీలనకు హాజరుకావాలి.