సమస్యలు ప్రజలవి.. పరిష్కారాలు స్టార్టప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లవి.. ‘టిస్క్’కు భారీ రెస్పాన్స్..

సమస్యలు ప్రజలవి.. పరిష్కారాలు స్టార్టప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లవి.. ‘టిస్క్’కు భారీ రెస్పాన్స్..
  • సమస్యలు ప్రజలవి.. పరిష్కారాలు స్టార్టప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లవి.. ‘టిస్క్’కు భారీ రెస్పాన్స్.. 
  • 20 రోజుల్లోనే వెయ్యికి పైగా దరఖాస్తులు
  • దూసుకుపోతున్న తెలంగాణ స్టార్టప్ ఛాలెంజ్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్రజలు, ప్రభుత్వ శాఖలు ఎదుర్కొంటున్న క్షేత్రస్థాయి సమస్యలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వినూత్న పరిష్కారాలు చూపేందుకు ప్రభుత్వం ప్రారంభించిన ‘తెలంగాణ ఇన్నోవేషన్ స్టార్టప్ ఛాలెంజ్’ (టిస్క్)కు వ్యవస్థాపకులు, పరిశోధకులు, ఆవిష్కర్తల నుంచి అనూహ్య స్పందన లభించింది. 

రాబోయే ప్రతిష్టాత్మక ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ – 2026’కు ముందు తెరపైకి తెచ్చిన ఈ కార్యక్రమం ప్రారంభమైన కేవలం 20 రోజుల్లోనే, రికార్డు స్థాయిలో 1,000కి పైగా స్టార్టప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు తమ వినూత్న ప్రతిపాదనలను సమర్పించాయి. పాఠశాల విద్య, విద్యుత్, వ్యవసాయం, రెవెన్యూ, రోడ్లు-భవనాలు, సంక్షేమం, వైద్యారోగ్య రంగాల్లోని ప్రభుత్వ శాఖలు గుర్తించిన 18 కీలక సమస్యలకు పరిష్కారాలు కోరింది.

ప్రతి వ్యవసాయ క్షేత్రానికి సౌర విద్యుత్ ఆధారిత సాగునీరు, పాఠశాల విద్యార్థుల తెలుగు పఠన సామర్థ్యాన్ని ఏఐ ద్వారా అంచనా వేయడం, చెరువులు-సర్కారు భూముల డిజిటల్ పరిరక్షణ, రోడ్లపై గుంతలకు శాశ్వత నివారణ, సూదుల అవసరం లేకుండానే రక్తహీనత (అనీమియా) పరీక్షలు నిర్వహించడం వంటి సంక్లిష్ట సవాళ్లకు ఆచరణాత్మక ప్రతిపాదనలు వెల్లువెత్తాయి. 

దేశంలోనే అత్యుత్తమ వినూత్న ఆలోచనలను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వమే ‘తొలి కస్టమర్’గా మారి స్టార్టప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను ముందుకు నడిపిస్తోందని ఐటీ శాఖ జాయింట్ సెక్రటరీ అనుదీప్ స్పష్టం చేశారు.

ప్రజల జీవన ప్రమాణాలను మార్చే అర్హత గల పరిష్కారాలకు నేరుగా ప్రభుత్వ ప్రాజెక్టులు, కాంట్రాక్టులు కల్పించడమే తమ లక్ష్యమన్నారు. ఎంపిక చేసిన ప్రతిపాదనలను త్వరలోనే క్షేత్రస్థాయిలో ప్రయోగాత్మకంగా పరీక్షించి, ఉత్తమ పరిష్కారాలను రాష్ట్రవ్యాప్తంగా భారీ స్థాయిలో అమలు చేస్తామని వెల్లడించారు.