Team India Record: న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) సారథ్యంలోని టీమిండియా (Team India) టెస్టు క్రికెట్ చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని ప్రపంచ రికార్డును నెలకొల్పింది. వెల్లింగ్టన్ లోని బేసిన్ రిజర్వ్ వేదికగా తొలి ఇన్నింగ్స్‌ను 720/9 దగ్గర డిక్లేర్ చేసిన భారత్, ఒకే టెస్టు ఇన్నింగ్స్‌లో మొదటి ఏడు వికెట్లకూ (1వ వికెట్ నుంచి 7వ వికెట్ వరకు) వరుసగా 50 అంతకంటే ఎక్కువ పరుగుల భాగస్వామ్యాలు నమోదు చేసిన ప్రపంచంలోనే తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరు (368) కంటే ఇండియన్ టీమ్ ఏకంగా 352 పరుగుల భారీ ఆధిక్యం సాధించింది.
ఫస్ట్ వికెట్ నుంచి ఏడో వికెట్ వరకు 50+ భాగస్వామ్యాలు:
* భారత బ్యాటర్ల సమిష్టిగా రాణించడంతో ప్రతి వికెట్‌కు కనీసం అర్ధ సెంచరీ భాగస్వామ్యం నమోదైంది.
* తొలి వికెట్ (130 పరుగులు): ఓపెనర్లు కేఎల్ రాహుల్ (136), యశస్వీ జైస్వాల్ (85) అద్భుత ఆరంభాన్ని ఇచ్చారు.
* రెండో వికెట్ (165 పరుగులు): జైస్వాల్ ఔటయ్యాక రాహుల్, దేవదత్ పడిక్కల్ (80) కలిసి మరో సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పారు.
* మూడో వికెట్ (91 పరుగులు): రాహుల్ 136 రన్స్ దగ్గర ఔటయ్యే ముందు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (98) తో కలిసి 91 పరుగులు జోడించాడు.
* నాలుగో వికెట్ (100 పరుగులు): గిల్, రిషభ్ పంత్ (128) శతక భాగస్వామ్యం నమోదు చేశారు.
* ఐదో వికెట్ (75 పరుగులు): నాలుగో రోజు తొలి గంటలోనే పంత్, నైట్ వాచ్‌మన్ అన్షుల్ కాంబోజ్ మెరుపు వేగంతో 75 రన్స్ జోడించారు.
* ఆరో వికెట్ (54 పరుగులు): లంచ్ విరామానికి ముందు 128 పరుగుల దగ్గర ఔటయ్యే కంటే ముందు పంత్, వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ తో కలిసి 54 పరుగులు జోడించాడు.
* ఏడో వికెట్ (54 పరుగులు): ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్ ఏడో వికెట్‌కు మరో 54 రన్స్ జోడించడంతో భారత్ 700 పరుగుల మార్కును దాటి ప్రపంచ రికార్డును పూర్తి చేసింది.
ఒకే ఇన్నింగ్స్‌లో బద్దలైన భారీ రికార్డులు:
* రెండోసారి 7+ హాఫ్ సెంచరీల భాగస్వామ్యాలు: ఒకే టెస్టు ఇన్నింగ్స్‌లో 7 అంతకంటే ఎక్కువ 50+ భాగస్వామ్యాలను ఒకటి కంటే ఎక్కువసార్లు నమోదు చేసిన తొలి జట్టుగా భారత్ నిలిచింది. గతంలో 2007లో ఇంగ్లండ్‌పై లార్డ్స్ టెస్టులో భారత్ ఒకే ఇన్నింగ్స్‌లో 8 అర్ధశతక భాగస్వామ్యాలు నమోదు చేసింది.
* న్యూజిలాండ్‌పై అత్యధిక టెస్టు స్కోరు: 1995లో వెల్లింగ్టన్‌లోనే వెస్టిండీస్ చేసిన 660/5 డిక్లేర్డ్ రికార్డును భారత్ (720/9d) అధిగమించింది.
* న్యూజిలాండ్ గడ్డపై అత్యధిక స్కోరు: 2019లో హామిల్టన్‌లో బంగ్లాదేశ్‌పై న్యూజిలాండ్ చేసిన 715/6 డిక్లేర్డ్ రికార్డును భారత్ బద్దలు కొట్టింది.
