న్యూఢిల్లీ, వెలుగు: పోచంపల్లి ఇక్కత్ నుంచి గద్వాల, నారాయణపేట చీరల వరకు.. హైదరాబాద్ ముత్యాల నుంచి ఆదిలాబాద్ ఇప్పపూల లడ్డూల వరకు తెలంగాణ ప్రత్యేకతలు ఢిల్లీలో సందడి చేస్తున్నాయి. భారత్ మండపంలో జరుగుతోన్న 45వ భారత అంతర్జాతీయ వాణిజ్య మేళా (ఐఐటీఎఫ్)లో ఏర్పాటు చేసిన తెలంగాణ పెవిలియన్ సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు అందుకున్న ఇప్పపూల లడ్డూలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. గిరిజన సంప్రదాయ ఆహార ఉత్పత్తులతోపాటు చిరుధాన్యాల బిస్కెట్లు, సేంద్రియ చిరుతిళ్లు, ఆదిలాబాద్ చేతితో తయారు చేసిన అగరుబత్తులను ప్రదర్శిస్తున్నారు.
గద్వాల, నారాయణపేట చీరలు, వరంగల్ చేనేత తివాచీలు, కలంకారీ ఉత్పత్తులు, హైదరాబాద్ లక్క గాజులు, ఇక్కత్ వస్త్రాలతో రూపొందించిన ఆధునిక బ్యాగులు సందర్శకుల ఆసక్తిని పెంచుతున్నాయి. సెర్ప్ ఎంపిక చేసిన స్వయం సహాయక సంఘాలు, గ్రామీణ కళాకారుల ఉత్పత్తులకు ఇతర రాష్ట్రాల కొనుగోలుదారులను నేరుగా కలుసుకునే అవకాశం లభిస్తోంది. ‘వికాస్ ఔర్ విరాసత్’ ఇతివృత్తంతో జరుగుతున్న ఈ మేళాలో 11 దేశాలు, 3,500 మందికి పైగా ప్రదర్శకులు పాల్గొంటున్నారు.
