దేశంలో కోటి దాటిన హెచ్‌‌‌‌పీవీ టీకాలు..తెలంగాణలో 95.28 శాతం కవరేజీతో ముందంజ

దేశంలో కోటి దాటిన హెచ్‌‌‌‌పీవీ టీకాలు..తెలంగాణలో 95.28 శాతం కవరేజీతో ముందంజ
  •     9 నెలల్లోనే కీలక మైలురాయి

న్యూఢిల్లీ: మహిళల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌‌‌‌ (సర్వైకల్‌‌‌‌ క్యాన్సర్‌‌‌‌) నివారణకు కేంద్రం చేపట్టిన హెచ్‌‌‌‌పీవీ టీకా కార్యక్రమం కీలక మైలురాయిని దాటింది. ప్రధాని మోదీ ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభించిన ఈ కార్యక్రమం కింద దేశవ్యాప్తంగా ఇప్పటివరకు కోటికి పైగా డోసులను పంపిణీ చేశారు. కేవలం 9 నెలల్లోనే ఈ ఘనత సాధించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం వెల్లడించింది. దేశవ్యాప్తంగా గుర్తించిన 14 ఏళ్ల బాలికల వార్షిక లక్ష్యంలో దాదాపు 87 శాతం మందికి టీకాలు అందాయి. ఇందులో తెలంగాణ 95.28 శాతం కవరేజీతో ముందంజలో నిలవగా.. ఏపీ, గుజరాత్, యూపీ, మిజోరం, మధ్యప్రదేశ్, బిహార్ రాష్ట్రాలు నిర్ధేశిత లక్ష్యాలను పూర్తి చేశాయి.

యూ–విన్‌‌‌‌ ద్వారా డిజిటల్ పర్యవేక్షణ

టీకా కార్యక్రమాన్ని పారదర్శకంగా అమలు చేసేందుకు ‘యూ–విన్‌‌‌‌’ డిజిటల్ ప్లాట్‌‌‌‌ఫామ్‌‌‌‌ కీలకంగా పనిచేస్తోంది. దీని ద్వారా టీకా తీసుకున్న బాలికల వివరాలను నమోదు చేయడంతో పాటు, ఇంకా తీసుకోని అర్హులను గుర్తిస్తున్నారు. హెచ్‌‌‌‌పీవీలోని కొన్ని హైరిస్క్ వైరస్ రకాల వల్ల ఈ క్యాన్సర్ వస్తుందని, టీకా ద్వారా వీటి నుంచి రక్షణ పొందవచ్చని వైద్య పరిశోధనల్లో తేలినట్లు కేంద్రం తెలిపింది.

14 ఏళ్ల బాలికలకు ఉచితంగా..
ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో తల్లిదండ్రుల సమ్మతితో 14 ఏళ్ల బాలికలకు ఉచితంగా, స్వచ్ఛంద ప్రాతిపదికన సింగిల్ డోస్ హెచ్‌‌‌‌పీవీ టీకా వేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఏడాదికి సుమారు 1.2 కోట్ల మంది బాలికలు ఈ కార్యక్రమం పరిధిలోకి వస్తున్నారు.