- భారతీయత గురించి మాట్లాడిన నేతల ఖాతాలనూ సస్పెండ్ చేశారు
- బహుళజాతి సంస్థలపై దాడులతో రాష్ట్రానికి పెట్టుబడులు ఎట్లొస్తయ్?
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు
హైదరాబాద్, వెలుగు: గతంలో భారతీయత గురించి మాట్లాడిన పలువురు నాయకుల సోషల్ మీడియా ఖాతాలను, తన అకౌంట్‌ను కూడా మెటా సంస్థ బ్లాక్, సస్పెండ్ చేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు వెల్లడించారు. ఆ ఖాతాను తిరిగి పునరుద్ధరించుకోవడానికి తాను తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నానని చెప్పారు. అయితే, సోషల్ మీడియా సంస్థల చర్యలపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే ప్రజాస్వామ్యబద్ధంగా న్యాయస్థానాలను ఆశ్రయించాలి తప్ప, హైదరాబాద్‌లోని మెటా కార్యాలయంపై దాడి చేసి ఆస్తులను ధ్వంసం చేయడం, ఉద్యోగులను బెదిరించడం ఎంతమాత్రం సమర్థనీయం కాదని స్పష్టం చేశారు.
శనివారం బీజేపీ స్టేట్ ఆఫీసులో రాంచందర్ రావు సమక్షంలో పలువురు సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, మేధావులు, విద్యావేత్తలు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా రాంచందర్ రావు మాట్లాడుతూ.. మెటాపై అభ్యంతరాలుంటే హైకోర్టులో కేసు వేయవచ్చని, సభ్యసమాజం ఇలాంటి హింసాత్మక చర్యలను ఎప్పటికీ ప్రోత్సహించదని స్పష్టం చేశారు. ఒకవైపు తెలంగాణకు పెట్టుబడులు తీసుకొస్తామని గ్లోబల్ సమిట్లు నిర్వహిస్తూనే, మరోవైపు ఇప్పటికే ఇక్కడ నడుస్తున్న కంపెనీలపై దాడులు చేస్తుంటే హైదరాబాద్‌కు కొత్త పెట్టుబడులు ఎలా వస్తాయని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సందేశం ఇస్తోందో చెప్పాలన్నారు.
దేశాన్ని కించపరిచేలా రాహుల్ గాంధీ వ్యాఖ్యలు
దేశాన్ని, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య వ్యవస్థలను కించపరిచేలా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విదేశాల్లో వ్యాఖ్యలు చేస్తున్నారని రాంచందర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో ప్రపంచ దేశాల ప్రతినిధులు హాజరైన ఏఐ సమిట్‌లో యువజన కాంగ్రెస్ కార్యకర్తలు దుస్తులు విప్పి నిరసన తెలపడం అంతర్జాతీయ వేదికపై దేశ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నమని విమర్శించారు. ఇటీవల నిర్వహించిన భారత్ సమిట్నూ దేశాన్ని అవమానించేందుకు వాడుకున్నారని ఆరోపిస్తూ, దీనిపై తప్పకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. తెలంగాణలో బీజేపీ రోజురోజుకూ బలపడుతుండటంతోనే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు భయం పట్టుకుందని విమర్శించారు. ‘‘కేసీఆర్ అయినా, కేటీఆర్ అయినా, రేవంత్ రెడ్డి అయినా ఎప్పుడూ బీజేపీ, అమిత్ షా గురించే మాట్లాడుతున్నారు. ఎవరు బాద్షా అంటూ పోలికలు పెడుతున్నారు. బీజేపీ బలపడకపోతే మీకు మా గురించి ఎందుకంత భయం?’’ అని నిలదీశారు.
రాష్ట్రంలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే
రాష్ట్రంలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని రాంచందర్ రావు ధీమా వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వచ్చాక గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో జరిగిన అవినీతి, అధికార దుర్వినియోగం, దౌర్జన్యాలు, అక్రమాలపై సమగ్ర విచారణ జరిపిస్తామని స్పష్టం చేశారు. ప్రజాధనంలో ప్రతి పైసాకూ లెక్కలు తేల్చి, దోచుకున్న సొమ్మును వసూలు చేస్తామన్నారు.
రాష్ట్ర అప్పులు దాదాపు రూ.10 లక్షల కోట్లకు చేరాయని, ఆదాయం తక్కువగా ఉండి ఖర్చులు పెరుగుతున్నాయని, ఆర్థిక సమస్యలను పరిష్కరించడం చేతకాక కాంగ్రెస్ ప్రభుత్వం సర్కారు భూములను అమ్ముకుని పాలన సాగించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రాంచందర్ రావు విమర్శించారు. రాబోయే రోజుల్లో అవినీతికి వ్యతిరేకంగా పోరాటాన్ని ఉధృతం చేసి, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలను ప్రజల ముందు జవాబుదారీగా నిలబెడతామని స్పష్టం చేశారు.
