లేహ్/జమ్ము: లడఖ్ పాలనా యంత్రాంగంపై పర్యావరణవేత్త, సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. స్థానిక ప్రజల అంగీకారం లేకుండానే నిర్ణయాలను వారిపై బలవంతంగా రుద్దుతున్నారని, లడఖ్‌ను ఓ వలసపాలిత ప్రాంతంగా చూస్తున్నారని ఆరోపించారు. ఈ సరిహద్దు ప్రాంత ప్రజలను ఇలాగే దూరం చేస్తూ పోతే, భవిష్యత్తులో జాతీయ భద్రతపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. లేహ్‌లో కొనసాగుతున్న నిరసనల్లో పాల్గొన్న వాంగ్‌చుక్.. లేహ్ అపెక్స్ బాడీ (ఎల్ఏబీ) చైర్మన్ చెరింగ్ దోర్జే లక్రూక్తో కలిసి శనివారం మీడియాతో మాట్లాడారు.
లడఖ్ విషయంలో పీఎం మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తక్షణమే జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. శాంతి సమయాల్లో ప్రజల అసంతృప్తి పెద్దగా కనిపించకపోవచ్చు కానీ, యుద్ధ సమయాల్లో దాని ప్రభావం తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. స్థానిక ప్రభుత్వ ఉద్యోగులు, అధికారుల ఇబ్బందులను తెలుసుకునేందుకు కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ఒక విచారణ కమిషన్ వేయాలని డిమాండ్ చేశారు.
