- 1.26 లక్షల డాలర్ల నుంచి పడుతూ వస్తున్న క్రిప్టో కరెన్సీ
న్యూయార్క్: ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టోకరెన్సీ బిట్‌కాయిన్ రెండేళ్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. కీలకమైన 60,000 డాలర్ల మార్కును కోల్పోయిన ఈ క్రిప్టో, శుక్రవారం ఏకంగా 5.10శాతం క్షీణించి 55,830 డాలర్లకు (సుమారు రూ. 51.92 లక్షలు) దిగొచ్చింది.
ఆల్ టైమ్ హై అయిన 1,26,000 డాలర్ల (రూ.1.17 కోట్ల) నుంచి పడుతూ వస్తోంది. ఏఐ షేర్ల వాల్యుయేషన్స్ ఎక్కువగా ఉన్నాయనే ఆందోళనతో అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లలో భారీ అమ్మకాలు జరుగుతున్నాయి. దీనికి తోడు అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్ల విజయం తర్వాత క్రిప్టోలపై నియంత్రణలు పెరుగుతాయనే భయం, ఎన్విడియా సీఈఓ జెన్సెన్ హువాంగ్ కంపెనీ నుంచి వైదొలగడం వంటి అంశాలతో ఇన్వెస్టర్లు రిస్క్ ఆస్తులైన క్రిప్టోల నుంచి బయటకొచ్చేస్తున్నారు.
వీటికితోడు అమెరికా ఫెడరల్ రిజర్వ్ మళ్లీ వడ్డీ రేట్లు పెంచుతుందనే అంచనాలు, డాలర్ బలపడటం క్రిప్టో మార్కెట్‌పై ఒత్తిడి పెంచాయి. ఈ ఏడాది బిట్‌కాయిన్ ఈటీఎఫ్‌ల నుంచి ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు 3 బిలియన్ డాలర్లకు పైగా నిధులను వెనక్కి తీసుకున్నారు. ధరల భారీ పతనంతో క్రిప్టో డెరివేటివ్స్ మార్కెట్లో ఒక్కరోజే 2 బిలియన్ డాలర్ల లాంగ్ పొజిషన్లు క్లోజ్ అయ్యాయి.
